Ibrahimpatnam: డాక్టర్ నిర్లక్ష్యం రెండు ప్రాణాలను బలి తీసుకుంది. వాట్సప్ (Whatsapp) వీడియో కాల్‌తో వైద్యం చేయడంతో, అది వికటించి గర్భంలోనే కవలలు మృతి చెందారు. పెళ్లైన ఏడేళ్ల తర్వాత సంతానం కలగబోతోందని ఆనందంలో ఉన్న దంపతులకు గర్భశోశం మిగిలింది. ఆసుపత్రికి వచ్చిన గర్భిణీకి వైద్యం చేయాలని నర్సుకు మరెక్కడో ఉన్న వైద్యురాలు వాట్సప్ వీడియో కాల్ ద్వారా సూచించడంతో ఇదంతా జరిగింది. రంగారెడ్డి (Rangareddy) జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గ కేంద్రంలో ఈ ఘటన జరిగింది.
ఇబ్రహీంపట్నం మండలం ఎల్మినేడు గ్రామానికి చెందిన బుట్టి గణేశ్, కీర్తిలకు ఏడేళ్ల కిందట వివాహం జరిగింది. ఏళ్లు గడుస్తున్నా సంతానం కలగకపోవడంతో ఇబ్రహీంపట్నంలోని విజయలక్ష్మి ఆసుపత్రిలో డాక్టర్ అనూషా రెడ్డి దగ్గర వైద్యం చేయించుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఐదు నెలల క్రితం కీర్తి గర్భం దాల్చింది. సడెన్‌గా ఆమెకు నొప్పులు రావడంతో అదే ఆసుపత్రికి కుటుంబ సభ్యలు తీసుకువచ్చారు.
Also Read: Hyderabad Crime: వదినపై కన్నేసి.. భార్యను చంపేసి.. హైదరాబాద్ లో ఘోరం!
ఆ సమయంలో వైద్యురాలు అందుబాటులో లేకపోవడంతో డాక్టర్ వాట్సప్ వీడియో కాల్ ద్వారా చేసిన సూచనల మేరకు గర్భిణీ కీర్తికి ఇంజక్షన్లు ఇచ్చి నర్సు చికిత్స చేసింది. దీంతో వైద్యం వికటించి గర్భంలో ఉన్న ఇద్దరు మగ శిశువులు మృతి చెందారు. అనంతరం చికిత్సకు రూ.30 వేలు చెల్లించాలని బాధితులను ఆసుపత్రి యాజమాన్యం డిమాండ్ చేసింది.
మీ నిర్లక్ష్యం వల్లే కవల శిశువులు మృతి చెందారని, పైగా మమ్మల్నే డబ్బులు చెల్లించమంటారా అంటూ ఆసుపత్రి దగ్గర భాదిత కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. ఇప్పటికే సంతానం కోసం రూ. 15 లక్షల వరకు ఖర్చు చేశామని కవల పిల్లలు పుడుతున్నారని తెలిసి సంతోషంగా ఉన్న సమయంలో ఇలా వైద్యురాలి నిర్లక్ష్యంతో దారుణం జరిగిందని కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వరరావుకు విషయం తెలిసి అక్కడకు చేరుకొని వివరాలు సేకరించి ఆసుపత్రిని సీజ్ చేశారు.
స్వేచ్ఛ E పేపర్ కోసం ఈ లింక్ ని క్లిక్ చేయండి https://epaper.swetchadaily.com/