Etela Rajender: రేవంత్ రెడ్డి తనకు మంచి మిత్రుడని, ఆయనకు, తనకు మధ్య ఎలాంటి విబేధాలు లేవని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తాము రేవంత్ ను ప్రశ్నించేది. ఆయన ముఖ్యమంత్రి కాబట్టేనని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు తప్పా ఎక్కడా పాలక మండళ్లు లేవని, పాలక మండళ్లు లేకపోవడంతో పాలన అస్తవ్యస్థంగా మారిందని ఆవేదన వ్యక్తంచేశారు.
గ్రామ కార్యదర్శులే సొంతంగా ఖర్చు పెట్టుకుంటున్న పరిస్థితి నెలకొందన్నారు. తెలంగాణను రోల్ మోడల్ గా చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి. గ్రామ పంచాయతీ సిబ్బందికి జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో ఎందుకున్నట్లని ప్రశ్నించారు. జీహెచ్ఎంసీలో కూడా డబ్బులు లేవని కాగితాలు ఇచ్చి లోన్లు తెచ్చుకోవాలని గుత్తేదారులకు ప్రభుత్వం చెప్పడం దేనికి సంకేతమని ఈటల నిలదీశారు.
Also Read: CM Revanth Reddy: పరువు తీయోద్దు.. మనం ఒకే ఫ్యామిలీ.. సీఎం రిక్వెస్ట్
గుత్తేదారులు కూడా ధర్నాలు చేయడమంటే దానికి మించిన సిగ్గుమాలిన చర్య మరొకటి ఉంటుందా అని రేవంత్ రెడ్డిని ఈటల ప్రశ్నించారు. రేవంత్ కు రాష్ట్రాన్ని పాలించే నైతిక హక్కు ఉందా అని ఆయన నిలదీశారు. నిజమైన పేదలకు ఇందిరమ్మ ఇండ్లు రాకపోతే ఊరుకునే పరిస్థితి లేదని హెచ్చరించారు. అకాల వర్షాలతో వరిధాన్యం తడిసి ముద్దైందని, ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాల్సిన అవసరముందని డిమాండ్ చేశారు.
హైదరాబాద్ ట్రాఫిక్ సమస్య తీర్చేందుకు నితిన్ గడ్కరీని నిధులు కోరుతామన్నారు. పదేళ్ల వరకు కాంగ్రెస్ అధికారంలోకి రాదని ఆ పార్టీ నేతలే చెబుతున్నారని ఈటల వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి రూపంలో కాంగ్రెస్ కు బొంద పెట్టినట్లవుతోందని అంతా చెప్పుకుంటున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఇకపోతే తాము అందాల పోటీలకు వ్యతిరేకం కాదని, కానీ ముందు విద్యార్థులు, రైతుల సమస్యలు పరిష్కరించాలని ఆయన సూచించారు. ఉప్పల్ ఫ్లై ఓవర్ గుత్తేదారు కాంగ్రెస్ కు చెందిన సుబ్బిరామిరెడ్డి అని ఆయన పేర్కొన్నారు. సుబ్బిరామిరెడ్డి దివాళా తీసి ఫ్లై ఓవర్ పూర్తిచేయకుండానే పారిపోయారని ఈటల చురకలంటించారు.
Also Read: Hyderabad Metro:హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణ..ఫేజ్-2 డీటీఏపీలు ఆమోదానికి సిద్ధం!