Nitin Gadkari: ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ ఫ్లైఓవర్ పనులు సరిగ్గా జరగడంలేదని, ఈ సమస్యకు తాము పరిష్కారం కనుగొన్నామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. పనుల్లో వేగం పెంచేలా కొత్త కాంట్రాక్టర్ ను మార్చామని స్పష్టంచేశారు. పది నెలల్లో ఉప్పల్ ఫ్లై ఓవర్ ను పూర్తిచేస్తామని ఆయన హామీ ఇచ్చారు. తెలంగాణలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం, పలు శంకుస్థాపనలు చేసేందుకు నితిన్ గడ్కరీ వచ్చారు. ఈ సందర్భంగా అంబర్ పేట్ ఫ్లై ఓవర్ ను ఆయన ప్రారంభించారు.
అంతకుముందు ఆ ఫ్లైఓవర్ పై ర్యాలీగా తరలివచ్చారు. అనంతరం మున్సిపల్ గ్రౌండ్ లో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. అందరికీ నమస్కారం, బాగున్నారా అంటూ తెలుగులో తన ప్రసంగాన్ని నితిన్ గడ్కరీ ప్రారంభించారు. రాష్ట్రంలో పలు అభివృద్ధి పనులకు భూసేకరణ పనులు పూర్తవ్వక అడ్డంకిగా మారాయని, రాష్ట్ర ప్రభుత్వం దీనిపై ఫోకస్ చేయాలని ఆయన సూచించారు. మంత్రులు కోమటిరెడ్డి, పొన్నం ప్రభాకర్ భూసేకరణ త్వరగా పూర్తి చేస్తారని భావిస్తున్నట్లుగా చెప్పారు.
Also Read: CM Revanth on BRS: బీఆర్ఎస్ పాలన తెలంగాణను అప్పుల కుప్పగా మార్చింది.. సీఎం రేవంత్ రెడ్డి!
హైదరాబాద్ రీజినల్ రింగ్ రోడ్డు త్వరగా పూర్తిచేసేలా చర్యలు తీసుకుంటామని గడ్కరీ తెలిపారు. హైదరాబాద్-విజయవాడ 4 లేన్ రోడ్డును 6 లేన్ రోడ్డుగా మార్చుతామని, నాగ్ పూర్ లో డబుల్ డెక్కర్ ఎయిర్ బస్ అందుబాటులోకి తెచ్చామని, ఎయిర్ హోస్టెస్ లాగా బస్ హోస్టెస్ ఉంటారని ఆయన వివరించారు. హైదరాబాద్ రింగ్ రోడ్డుపై ఈ ఎయిర్ బస్సులను వినియోగించాలని రాష్ట్ర ప్రభుత్వానికి గడ్కరీ సూచించారు.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. అంబర్ పేట ఫ్లై ఓవర్ ప్రారంభించుకున్నప్పటికీ సర్వీస్ రోడ్డు అసంపూర్తిగా ఉందన్నారు. ఆరు చోట్ల భూసేకరణ పూర్తికాకపోవడంతో సర్వీస్ రోడ్డు పూర్తి కాలేదని ఆయన వివరించారు. మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్ వీటికి సంబంధించిన భూసేకరణ పూర్తిచేయాలని సూచించారు. తెలంగాణలో అమెరికాను తలదన్నేలా జాతీయ రహదారులు ఉన్నాయన్నారు. దీనికి గడ్కరీ చొరవ చూపడమే కారణమని వివరించారు. నితిన్ గడ్కరీ దగ్గరకు ఏ పార్టీ ఎంపీ వెళ్లి అడిగినా కాదనకుండా పనులు చేస్తారని చెప్పారు. అందుకే నితిన్ గడ్కరీని ఫ్లై ఓవర్ల మంత్రి అని పిలుస్తారని చమత్కరించారు.
Also Read: Ponnam Prabhakar: ఆర్టీసీ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధం.. మంత్రి ప్రకటన!
మల్కాజిగరి ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. పార్లమెంటులో అన్ని పార్టీల ఆమోదం పొందిన ఏకైక మంత్రిత్వ శాఖ నితిన్ గడ్కరీకి చెందిన రోడ్డు రవాణా శాఖేనని, నో అనే పదం ఆయన నోట నుంచి వినలేదన్నారు. ఎందుకంటే ఎవరు ఏది అడిగినా కాదు , లేదనకుండా ఇవ్వడమే ఇందుకు కారణమని కొనియాడారు. బాలానగర్ నుంచి గండిమైసమ్మ వరకు ఉన్న ఇండస్ట్రియల్ కారిడార్‌లో మరో ఎక్స్‌ప్రెస్ వే మంజూరు చేయాలని ఈటల.., గడ్కరీకి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. ఇక శామీర్ పేట నుంచి కరీంనగర్ రోడ్డును జాతీయ రహదారిగా గుర్తించాలని ఆయన కోరారు.
రాష్ట్ర ఆర్ అండ్ బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ.. మారుమూల ప్రాంతాలకు జాతీయ రహదారులతో అనుసంధానం చేస్తూ తెలంగాణ అభివృద్ధికి నితిన్ గడ్కరీ ఎంతో కృషి చేస్తున్నారని కొనియాడారు. విజయవాడ హైవేలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయని, వాటిని త్వరగా పూర్తిచేయాలని కోరారు. ఉప్పల్ ఫ్లై ఓవర్ నిర్మాణాన్ని సైతం త్వరగా పూర్తిచేసేలా చూడాలని గడ్కరీని ఆయన కోరారు. హైదరాబాద్ ను సిగ్నల్ ఫ్రీ సిటీగా మార్చుకోవాడానికి కేంద్రం సహకరించాలని పేర్కొన్నారు. రీజినల్ రింగ్ రోడ్డు ఉత్తర దిశగా 90 శాతం భూసేకరణ పూర్తి చేశామని, దక్షిణ దిశగా కూడా కేంద్రమే టేకాఫ్ చేయాలన్నారు.
Also Read: Drinking water: తాగునీటి సమస్యలపై తక్షణ స్పందన అవసరం.. సీఎస్ అధికారులకు ఆదేశాలు!
రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. తెలంగాణను కొట్లాడి తెచ్చుకున్నట్లుగా చెప్పారు. గత రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో కలిసి పని చేయలేదని గుర్తుచేశారు. రాష్ట్ర అభివృద్ధి కోసం తాము కేంద్రంతో కలిసి పనిచేస్తామని స్పష్టంచేశారు. కేంద్రం తీసుకువచ్చే పాలసీలను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అమలు చేస్తోందని వివరించారు. తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం సహకరిస్తున్నందుకు ఆయన గడ్కరీకి కృతజ్ఞతలు తెలిపారు.
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/లింక్ క్లిక్ చేయగలరు