YS Jagan: కష్టకాలంలో ఉన్న రైతులకు అండగా నిలవాలని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి పార్టీ ముఖ్య నేతలను ఆదేశించారు. రాష్ట్రంలో కురుస్తున్న అకాల వర్షాలు, ఈదురుగాలుల కారణంగా నష్టపోయిన రైతులను పరామర్శించి ధైర్యం చెప్పాలని, రైతులను ఆదుకునేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని నేతలకు సూచించారు. సోమవారం అందుబాటులో ఉన్న రీజినల్ కో-ఆర్డినేటర్లు, పార్టీ ముఖ్యనాయకులతో జగన్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ‘ అకాల వర్షాలు, ఈదురు గాలుల కారణంగా రాష్ట్రంలో పలుచోట్ల ధాన్యం తడిసిపోవడంతో పాటు అనేక ఉద్యానవన పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వర్షాలు కురుస్తాయన్న సమాచారం ముందస్తుగానే ఉన్నప్పటికీ కళ్లాల్లో, పొలాల్లో రైతుల వద్దనున్న ధాన్యాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించడంలో తీవ్ర నిర్లక్ష్యం చూపారు. యంత్రాంగం మొత్తం నిస్తేజంలో ఉంది. ఖరీఫ్‌లో ప్రతికూల వాతావరణం, కనీస మద్దతు ధరలు లభించక తీవ్ర ఇబ్బందులు పడ్డ వరి రైతులు ఈ రబీ సీజన్‌లో కూడా కష్టాలు పడుతున్నారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలు సహా పలు చోట్ల ప్రభుత్వం ధాన్యాన్ని సరిగ్గా సేకరించడం లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు అకాల వర్షాల వల్ల మరింతగా నష్టపోతున్నారని నా దృష్టికి వచ్చింది. దీంతోపాటు పలు ఉద్యానవన పంటలు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి. పంటలు దెబ్బతిన్న ప్రాంతాల్లో వైసీపీ నాయకులు క్షేత్రస్థాయిలో పర్యటనలు చేసి రైతులకు బాసటగా నిలవాలి. రైతులను ఆదుకునేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు రావాలి’ అని పార్టీ నాయకులకు వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు.
Also Read- Viral Video: కేటుగాడికి భలే మస్కా కొట్టిందిగా? ఈ యువతి తెలివి అదరహో!
50 వేలకు పైగా ఎకరాల్లో దెబ్బతిన్న వరి..
రాష్ట్రంలో గాలివాన బీభత్సం అపార నష్టాన్ని మిగిల్చిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం నాడు పలు ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షాలతో భారీ వృక్షాలు విరిగిపడటంతో పాటు, విద్యుత్ స్తంభాలు సైతం నేలకొరిగాయి. మరోవైపు వ్యవసాయ, ఉద్యాన పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. సుమారు 50 వేలకు పైగా ఎకరాల్లో వరి పంట పూర్తిగా దెబ్బతిని ఉంటుందని అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. పలు ప్రాంతాల్లో కోతకొచ్చిన వరి నేలవాలడంతో రైతన్నలు కంటతడిపెడుతున్నారు. అమ్మకానికి సిద్ధం చేసిన వరి బస్తాలూ తడిసిపోయాయి. ధాన్యం సకాలంలో మిల్లర్లు కొనుగోలు చేయకపోవడంతో నష్టపోయామని వరి రైతులు వాపోతున్నారు. ఆరబెట్టిన ధాన్యం వర్షానికి తడిసిపోవడం, వేల ఎకరాల్లో అరటి, బొప్పాయి తోటలు నేలకొరిగిపోయాయి. మొక్కజొన్న రైతులూ నిండా మునిగారు. భారీ గాలుల థాటికి మామిడి పంటకు కూడా నష్టం వాటిల్లింది. అరటిచెట్లు నేలకొరిగాయి. మోపిదేవి మండలంలో ఆరబెట్టిన పసుపు పంట వర్షానికి తడిసిపోవడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని రైతులు విజ్ఞప్తి చేశారు. ఇదిలా ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా పిడుగులు పడి 8 మంది మృతి చెందారు.
Also Read- CPI Narayana On Nagarjuna: హీరో నాగార్జునపై సీపీఐ నేత సంచలన ఆరోపణలు.. బాబోయ్ మరీ ఈ స్థాయిలోనా!
మరో రెండ్రోజులు..
కాగా, రాష్ట్రంలో మరో రెండ్రోజులు భారీ వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో 41-42 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతలు నమోదైనా, మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఇవాళ, రేపు (మే 5,6 తేదీల్లో) శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, మన్యం, అల్లూరి, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులు, బలమైన ఈదురు గాలులతో కూడిన భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, అనకాపల్లి, కృష్ణా, నెల్లూరు, కర్నూలు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు హెచ్చరించారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు