CPI Narayana On Nagarjuna: బిగ్ బాస్ తెలుగు షోను వ్యతిరేకించే రాజకీయ నేతల్లో సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ (CPI Narayana) ముందు వరుసలో ఉంటారు. గతంలో ఈ షోపై సంచలన వ్యాఖ్యలు చేసిన నారాయణ.. తాజాగా మరోమారు బిగ్ బాస్ (Big Boss Telugu) పై తన గళం విప్పారు. బిగ్ బాస్ కు తొలి నుంచి తాము వ్యతిరేకమన్న సీపీఐ నేత.. అది సమాజానికి ఉపయోగపడని గేమ్ షో అంటూ మండిపడ్డారు. అటు హైదరాబాద్ వేదికగా జరగబోతున్న అందాల పోటీలపైనా తన మార్క్ విమర్శలతో నారాయణ విరుచుకుపడ్డారు.
హీన సంస్కృతి
మంచి వయసులో ఉన్న యువతి యువకులను తీసుకెళ్లి బిగ్ బాస్ లో పడేస్తున్నారని సీపీఐ నేత నారాయణ విమర్శించారు. దీనివల్ల వారు ప్రకృతి రియాక్షన్స్ కు లోనై తప్పులు చేస్తున్నట్లు ఆరోపించారు. చెడు, హీనత్వ సంస్కృతికి తాము పూర్తిగా వ్యతిరేకమని నారాయణ తెలిపారు. బిగ్ బాస్ పై పోలీస్ స్టేషన్ కు వెళ్తే కేసు కూడా నమోదు చేయలేదని గుర్తుచేశారు. జిల్లా కోర్టు పిల్ కూడా స్వీకరించలేదని అన్నారు.
బిగ్ బాస్ బ్యాన్ చేయాలి
ఈ నేపథ్యంలో హైకోర్టులో బిగ్ బాస్ పై పిల్ వేసినట్లు సీపీఐ నారాయణ గుర్తు చేశారు. దీనిపై న్యాయస్థానం వెంటనే స్పందించి హోస్ట్ నాగార్జునకు, షో ఎండీకి నోటీసులు జారీ చేసిందని చెప్పారు. వీరందరిని కోర్టుకు వచ్చి సమాధానం చెప్పాలని సూచించినట్లు తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలు జరిగే కార్యక్రమంగా బిగ్ బాస్ ను పరిగణనలోకి తీసుకొని దానిని వెంటనే బ్యాన్ చేయాలని ఈ సందర్భంగా నారాయణ పట్టుబట్టారు.
అందాల పోటీలపైనా
మరోవైపు హైదరాబాద్ లో అందాల పోటీల నిర్వహణపైన సీపీఐ నేత నారాయణ ఫైర్ అయ్యారు. ఆడవాళ్లను అంగడిలో సరుకుగా మార్చినట్లేనని విమర్శించారు. ప్రపంచ సుందరిని వివిధ రకాల నాసిరకం వస్తువులను బ్రాండ్ అంబాసిడర్ గా వినియోగించి సేల్స్ పెంచుకునే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. బిగ్ బాస్ తరహాలోనే అందాల పోటీలు సైతం హీనమైన కార్యక్రమమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అందాల పోటీ వల్ల నష్టం తప్ప.. టూరిజం ఎందుకు పెరుగుతుందని నారాయణ ప్రశ్నించారు.
Also Read: Viral Video: కేటుగాడికి భలే మస్కా కొట్టిందిగా? ఈ యువతి తెలివి అదరహో!
ఒక హీరో.. ముగ్గురు హీరోయిన్లు
బిగ్ బాస్, అందాల పోటీల ద్వారా పవిత్రమైన స్త్రీ జాతికి కళంకం తీసుకొస్తున్నారని సీపీఐ నేత నారాయణ ఫైర్ అయ్యారు. ఓ హీరోను ముగ్గురు హీరోయిన్లను చూపించి హీరో నాగార్జున అసభ్యకర డేరింగ్స్ ఇస్తారని ఆరోపించారు. చీప్ గా కాకుండా కాస్ట్లీగా వ్యభిచారం చేయాలని ఇలాంటి షోలు సందేశం ఇస్తున్నాయని పేర్కొన్నారు. మన దేశంలో ఉన్న కుటుంబ సంప్రదాయం ఎంతో గొప్పదని, పాశ్చాత్య దేశాల సంస్కృతి ఫాలో అయితే మనం మనపై వాత పెట్టుకున్నట్లేని పేర్కొన్నారు.