Congress Leaders: ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు నివురు గప్పిన నిప్పులా ఉంది. జిల్లాల వారీగా నిర్వహిస్తున్న సమావేశాల్లో వర్గ విభేధాలు బయటపడుతున్నాయి. జిల్లాకు పెద్ద దిక్కు లేకపోవడంతో నాయకులను, కార్యకర్తలను సమన్వయ పరిచే వారే కరువయ్యారు. ముఖ్యంగా పాత, కొత్త నేతల మధ్య పొసగడం లేదు. త్వరలోనే స్థానిక ఎన్నికలు ఉండడంతో పరిస్థితి చేయి దాటక ముందే చక్కదిద్దేందుకు కాంగ్రెస్ పార్టీ దృష్టి సారించినట్లు తెలిసింది. ఇందులో భాగంగా రంగారెడ్డి, మేడ్చల్ జిల్లా అధ్యక్షుల్లో ఒకరి మార్పు తథ్యమని తెలుస్తోంది. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి పదవులు కట్టబెట్టడంతో అక్కడక్కడా క్యాడర్ గురుగా ఉండగా..ఇకపై జెండా మోసిన కార్యకర్తలకే పదవుల్లో ప్రాధాన్యత కల్పించాలని అధిష్టానం నిర్ణయానికి వచ్చింది.
అధికార మార్పుతో బలపడిన కాంగ్రెస్
గత పదేళ్లలో డీలా పడిపోయిన కాంగ్రెస్ పార్టీ 2023 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చాక ఉమ్మడి జిల్లాలో బలపడింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఇబ్రహీంపట్నం, షాద్ నగర్, కల్వకుర్తి, వికారాబాద్, కొడంగల్, తాండూరు, పరిగి అసెంబ్లీ నియోజకవర్గాల్లోనే గెలిచిన కాంగ్రెస్ పార్టీ ఆతర్వాత చోటుచేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో అనూహ్యంగా పుంజుకుంది. రాజేంద్ర నగర్, శేరిలింగంపల్లి, చేవెళ్ల ఎమ్మెల్యేలు బీఆర్‌ఎస్ను వీడి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. అదేవిధంగా ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ లోకి నేతల వలసలు సైతం పెరిగాయి. ప్రస్తుతం పటిష్ట స్థితిలో ఉన్న కాంగ్రెస్ ను అంతర్గత విభేధాలు కలవర పెడుతున్నాయి. పాత, కొత్త నేతల మధ్య సమన్వయం కొరవడి చాలా నియోజకవర్గాల్లో పార్టీ కేడర్ రెండుగా చీలి పోయింది. కొన్నిచోట్ల ఇతర పార్టీల నుంచి వచ్చిన వారి పెత్తనమే నడుస్తోంది. ఇటీవల రాష్ట ఇంఛార్జి మీనాక్షి నటరాజన్ పార్లమెంటు నియోజకవర్గాల వారీగా నిర్వహించిన సమావేశాల్లోనూ నేతల మధ్య ఉన్న బేధాభిప్రాయాలు బయట పడ్డాయి. ప్రస్తుతం అన్ని జిల్లాల్లో నిర్వహిస్తున్న పార్టీ విస్తృత స్థాయి సమావేశాల్లోనూ అంతర్గత పోరు బయట పడుతోంది. పార్టీ నేతలను సమన్వయ పర్చేందుకు ఉమ్మడి జిల్లాకు ఒక్క మంంత్రి కూడా లేకపోవడం కూడా ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ కు పెద్ద లోటుగా ఉంది. దీంతో సమస్యలను ఎవరికి ఏకరువు పెట్టుకోవాలో తెలియని పరిస్థితిలో క్యాడర్ ఉంది. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాకు ఇంఛార్జిగా మంత్రి శ్రీధర్ బాబు వ్యవహరిస్తున్నప్పటికీ ఆయనకు ఉన్న పని ఒత్తిడితో ఉమ్మడి జిల్లా రాజకీయాలపై పూర్తి స్థాయిలో దృష్టి సారించే పరిస్థితి లేకుండా పోతోంది. జిల్లాలకు అధ్యక్షులు ఉన్నప్పటికీ నామమాత్రంగానే ఉన్నారన్న విమర్శలు విన్పిస్తున్నాయి. ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ ను ప్రక్షాళించాలని భావిస్తున్న పార్టీ అధిష్టానం రంగారెడ్డి, మేడ్చల్ జిల్లా అధ్యక్షుల్లో ఒకరి మార్చనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
Also Read: Bhatti Vikramarka: కేంద్రం తలొగ్గింది.. ఇది సమిష్టి విజయం.. డిప్యూటీ సీఎం
పదవుల్లో కొత్త వారికి ఆశా భంగమే
అధికార కాంగ్రెస్ పార్టీలో పదవులు ఆశిస్తున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. ఇప్పటికే కొన్ని కీలక పదవులను ఇతర పార్టీల నుంచి వలస వచ్చిన వారికి కట్టబెట్టారు. దీన్ని పాతతరం క్యాడర్ జీర్ణించుకోలేకపోతోంది. ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఇకపై జెండా మోసిన వారికే పదవులను కట్టబెట్టాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. 2017కు ముందు నుంచి పార్టీలో ఉన్నవారికి పెద్ద పీట వేయాలని, ఆతర్వాతనే కొత్తగా పార్టీలో చేరిన వారికి ప్రాధాన్యం దక్కుతుందని చెప్పడంతో ఏండ్ల తరబడిగా పార్టీని వెన్నంటి ఉన్న నేతల్లో సంతోషం వ్యక్తమవుతోంది. అధిష్టానం తీసుకున్న ఈ నిర్ణయం మాత్రం కొత్తగా పార్టీలో చేరి పదవులను ఆశిస్తున్న ఆశావాలకు మాత్రం ఆశాభంగంగా మారింది. పదవుల భర్తీకిగాను జిల్లాలకు పరిశీలకులను సైతం అధిష్టానం నియమించింది. త్వరలోనే గ్రామ, మండల, బ్లాక్, పట్టణ కమిటీలకు అధ్యక్షులుగా, ఇతర పదవుల్లో బాధ్యులను నియమించేందుకు పేర్లను సూచించాలని పరిశీలకులను అధిష్టానం ఆదేశించింది. దీంతో వారు క్షేత్రస్థాయికి వెళ్లి సమావేశాలు నిర్వహించి ఎంతోకాలంగా పార్టీలో పనిచేస్తున్న వారిని మాత్రమే పదవులకు నామినేట్ చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. కాంగ్రెస్ లో కొత్తగా చేరి, పదవులు ఆశిస్తున్న వారికి ప్రస్తుత పరిస్థితుల్లో నిరాశే ఎదురయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి.
Also Read: YS Sharmila On Amaravati 2.0: నాడు మట్టి – నేడు సున్నం.. అమరావతి సభపై షర్మిల ఫైర్!