Who Is Nalgonda Nawaab In Parliament Elections
Politics

Nalgonda: పార్లమెంట్ ఎన్నికల్లో నల్లగొండ నవాబు ఎవరో..?

– 5 లక్షల మెజారిటీ లక్ష్యంగా హస్తం
– వలస నేతను బరిలో దించిన బీజేపీ
– అభ్యర్థి మార్పు యోచనలో బీఆర్ఎస్
– 76.4% గ్రామీణ ఓటర్లే

Who Is Nalgonda Nawaab In Parliament Elections:లోక్‌సభ ఎన్నికల వేళ తెలంగాణలోని నల్గొండ స్థానంలో హోరాహోరీ పోరు జరగనుంది. ఒకప్పుడు కమ్యూనిస్ట్‌ల కంచుకోటగా ఉన్న ఈ స్థానం, కాలక్రమేణా కాంగ్రెస్ పార్టీకి అడ్డాగా మారింది. సీపీఐ దిగ్గజనేతలు రావి నారాయణరెడ్డి, దేవులపల్లి వెంకటేశ్వరరావు, బొమ్మగాని ధర్మభిక్షంగౌడ్‌, సురవరం సుధాకర్‌రెడ్డి వంటి నేతలంతా ఇక్కడి నుంచి ఎన్నికైన వారే. 1952 నాటి లోక్‌సభ ఎన్నికల్లో ఇక్కడి నుంచి గెలిచిన ఉమ్మడి కమ్యూనిస్టు నేత రావి నారాయణరెడ్డి దేశం మొత్తం మీద అత్యంత మెజారిటీతో గెలిచారు. దీంతో నాటి ప్రధాని నెహ్రూజీ నూతన పార్లమెంటు భవనాన్ని నారాయణ రెడ్డి చేతనే ప్రారంభింపజేశారు. 1996 నాటి పార్లమెంటు ఎన్నికల వేళ, జిల్లాలోని ఫ్లోరోసిస్‌ సమస్యను దేశం దృష్టికి తీసుకెళ్లేందుకు ఈ స్థానంలో 480 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. అయితే, నాటి ఎన్నికల్లోనూ ఇక్కడ సీపీఐ అభ్యర్థిగా బరిలో దిగిన సీపీఐ నేత ధర్మభిక్షంగౌడ్‌నే ప్రజలు గెలిపించారు. ఈ స్థానంనుంచి 15 ఏళ్ల పాటు ఎంపీగా గుత్తా సుఖేందర్‌రెడ్డి రికార్డు సృష్టించారు.

నల్గొండ లోక్‌సభ నియోజక వర్గంలో సుమారు 16.25 లక్షల ఓటర్లున్నారు. వీటిలో 17.5% ఎస్సీ ఓటర్లు, 15.5% ఎస్టీ ఓట్లు, 7.1% ముస్లిం ఓటర్లున్నారు. మొత్తం నియోజకవర్గంలో 76.4% గ్రామీణ ఓటర్లుండగా, 23.6% ఓటర్లు పట్టణ ప్రాంతాలకు చెందిన వారు. ఈ పార్లమెంటు సీటు పరిధిలో నాగార్జున సాగర్, సూర్యాపేట, దేవరకొండ, నల్గొండ, హుజూర్ నగర్, కోదాడ అసెంబ్లీ స్థానాలున్నాయి. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో 6 సీట్లూ హస్తగతం కాగా, బీఆర్ఎస్ కేవలం సూర్యాపేట సీటుతో సర్దుకు పోవాల్సి వచ్చింది. ఈసారి కాంగ్రెస్ నుంచి పీసీసీ ప్రధాన కార్యదర్శి కుందూరు రఘువీర్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌ తరపున నల్లగొండ మాజీ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి సోదరుడు కంచర్ల కృష్ణారెడ్డి, బీజేపీ అభ్యర్థిగా హుజూర్‌నగర్‌ మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి బరిలో దిగారు.

Also Read:బీఫామ్‌ అందుకున్న గులాబీ అభ్యర్థుల్లో టెన్షన్

కాంగ్రెస్ సీనియర్ నాయకులు కుందూరు జానారెడ్డి తనయుడు కుందూరు రఘువీర్ రెడ్డి నల్గొండ కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగడంతో తండ్రి జానారెడ్డి, రఘువీర్ రెడ్డి సోదరుడైన నాగార్జునసాగర్ ఎమ్మెల్యే జయవీర్ రెడ్డి సైతం ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. పార్లమెంటు పరిధిలోని సీనియర్లయిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు మిగతా ఎంఎల్‌ఎలంతా కలసి రఘువీర్ రెడ్డి గెలుపుకు కృషి చేయటం, జానారెడ్డి కూడా తనకున్న పరిచయాలతో మెజారిటీ పెంచేందుకు కృషి చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయా నియోజకవర్గాల పరిధిలో ముఖ్య కార్యకర్తలు, నాయకులతో ఆయన ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ ఎన్నికల్లో 5 లక్షల మెజార్టీ లక్ష్యమని జానారెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఈసారి ఈ స్థానంలో బీజేపీ వలస నేత సైదారెడ్డిని బరిలో దించింది. పార్టీలో చేరిన రెండు రోజులకే ఆయనకు టికెట్ ఇవ్వటంపై స్థానిక బీజేపీ నేతలు భగ్గుమని సహాయనిరాకరణకు దిగినా, అగ్రనేతల ఆదేశాలతో ప్రస్తుతం ప్రచార బాటపట్టారు. హుజూర్‌నగర్ స్థానంలో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సీనియర్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి చేతిలో స్వల్ప తేడాతో సైదిరెడ్డి ఓడిపోయారు. కానీ, 2019 నాటి లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపీగా గెలవటంతో తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఆ ఉపఎన్నికలో ఉత్తమ స్థానంలో ఆయన భార్య బరిలో దిగగా, బీఆర్ఎస్ తరపున సైదిరెడ్డి ఆమెపై 44 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు.

Also Read:నూతన సచివాలయం..వసతులు లేక సతమతం

బీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి ఆ పార్టీ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ సీటును గెలవలేకపోయింది. 2014లో పల్లా రాజశ్వేర్​రెడ్డి, 2019లో వేమిరెడ్డి నర్సింహారెడ్డి బరిలో నిలిచినా ఓటమే ఎదురైంది. గత ఎంపీ ఎన్నికల్లో స్వయంగా కేటీఆర్ పర్యవేక్షించినా ఇక్కడ గెలవకపోవటం విశేషం. అయితే, గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి తర్వాత భారీగా బీఆర్ఎస్ కార్యకర్తలంతా కాంగ్రెస్‌లో చేరటం, కేసీఆర్ నల్గొండలో పెట్టిన ‘చలో నల్గొండ’ సభ సక్సెస్ కాకపోవటం, తమ పాలనా కాలంలో ఇక్కడి ఒక్క సాగునీటి ప్రాజెక్టునూ పూర్తిచేయలేకపోవటంతో ఆ పార్టీ నిరాశలో ఉంది. దీనికి తోడు ఇక్కడి అభ్యర్థి కృష్ణారెడ్డి సర్వేల్లో మూడో స్ధానానికే పరిమితం కావటం ఆ పార్టీని కలవరపెడుతోంది.

Just In

01

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..

Khairatabad Ganesh 2025: గంగమ్మ ఒడికి.. ఖైరతాబాద్ మహా గణపతి.. భారీగా తరలివచ్చిన భక్తులు

Ponguleti Srinivasa Reddy: అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!