- కేసీఆర్ కలల సౌధం నూతన సచివాలయం
- నిర్మాణలోపం..నిధుల కైంకర్యం
- త్వరలోనే నివేదిక ఇవ్వనున్న విజిలెన్స్ శాఖ
- ప్రశ్నార్థకంగా మారిన ముఖ్యమైన ఫైళ్ల భద్రత
- నిత్యం ఎలుకలతో ఉద్యోగుల సతమతం
- ఫైళ్లు పెట్టేందుకు కనీసం ర్యాకులు లేవు
- ఇరుకు గదులలోనే సర్ధుకుపోతున్న ఉద్యోగులు
- పై అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యం
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కలల సౌధం అది…పాత జ్ణాపకాలు చెరిపేసి కొత్తకా కట్టిన సచివాలయం అది. అమెరికాలోని వైట్ హౌస్ ను తలపిస్తూ బ్రహ్మాండంగా రూపుదిద్దుకుంది. అయితే అప్పట్లో నిర్మాణంలో అక్రమాలు జరిగాయన్న కాంగ్రెస్ విమర్శలను ఎంత మాత్రం పట్టించుకోలేదు కేసీఆర్.
అసలు సచివాలయం విభాగానికి సంబంధించి కొనుగోలు చేసిన ఐటీ పరికరాలలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని కాంగ్రెస్ నేతలు విమర్శలు చేశారు. అయితే మొదట అనుకున్నట్లు రూ.180 కోట్ల ఖర్చు అంచనాలను మించి ఆరు నెలలలో దీనిని రూ.361 కోట్ల మేరకు భారీగా పెంచేశారు. దీనిని సంబంధించి ఎలాంటి నిబంధనలు పాటించకుండా అప్పట్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇష్టారాజ్యంగా చెల్లింపులు చేశారు. ఇప్పుడు ఈ అంశంపై అధికార కాంగ్రెస్ విజిలెన్స్ విచారణకు ఆదేశాలు ఇచ్చింది. త్వరలోనే నూతన సచివాలయ నిర్మాణంలో జరిగిన అక్రమాలపై సమగ్ర నివేదిక ివ్వనుంది విజిలెన్స్ శాఖ. అవన్నీ పక్కన పెడితే ప్రారంభమై ఏడాది కూడా గడవక ముందే కొత్త సెక్రటేరియట్‌లో ఎలుకలు సంచరిస్తున్నాయి. చైర్లు, టేబుళ్లు, సోఫాల కింద, బీరువాల్లోనూ తిరుగుతున్నాయి. దీంతో అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫైళ్లను ఎక్కడ కొరికేస్తాయోననే టెన్షన్ వారిలో నెలకొన్నది. కొత్తగా నిర్మించిన భవనంలోకి ఎలుకలు లోపలికి ఎలా వచ్చాయనే చర్చ ఉద్యోగుల్లో జరుగుతోంది. ఎలుకలను నివారించేందుకు కొన్ని గదుల్లో బోన్లను ఏర్పాటు చేయగా.. మరికొన్నింటిలో మందు పెడుతున్నారు.
ఫైళ్లు పెట్టేందుకు భద్రత కరువు
చూడటానికి పైకి ఎంతో ఆకర్షణీయంగా నిర్మించారు. కానీ లోపల మాత్రం లొసుగులు ఎవరికీ అర్థం కావు. లోపల చిన్న గదులు, వెలుతురు లేకపోవడం, కనీసం ఫైళ్లు దాచుకునేందుకు పటిష్టమైన ర్యాకులు కూడా లేకపోవడంతో ప్రభుత్వ ఉద్యోగులు తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. అసలు సమస్యలు అలా ఉంటే కొత్తగా ఎలుకల సమస్య వచ్చిపడింది వారికి. లోపల గదులలో ఎలుకలు యథేచ్ఛగా తిరుగుతున్నాయి. ఎక్కడ అవి ముఖ్యమైన ఫైళ్లను కొరికేస్తాయో అని హడలిపోతున్నారు ఉద్యోగులు. తాము పనిచేస్తుండగానే కాళ్ల సందుల్లోనుంచి ఎలుకలు, పందికొక్కులు తిరుగుతున్నాయని ఉద్యోగులు భయాందోళనకు గురవుతున్నారు.
ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదు..
ఎలుకల బెడదను తగ్గించేందుకు కొందరు ఉద్యోగులు తమ చాంబర్‌లో బోన్లను ఏర్పాటు చేసుకున్నారు. ఎలుకల మందును ఉపయోగిస్తున్నారు. ‘ప్రతి రోజూ ఐదారు ఎలుకలు బోన్‌లో పడుతున్నాయి.’ అని మూడో అంతస్తులో ఓ సెక్షన్‌లో పనిచేసే అటెండర్ వివరించారు. ‘చాలా సార్లు కంప్లయింట్ ఇచ్చినం. కానీ జీఏడీ వాళ్లు ఏం పట్టించుకోవట్లేదు. ఇలాగే వదిలేస్తే, ఎలుకల కొంప అవతది’ అని సదరు అటెండర్ కామెంట్ చేశారు. కొత్త బిల్డింగ్‌లోకి ఎలుకలు ఎలా వచ్చాయి? ప్రారంభానికి ముందే ఉన్నాయా? లేక బీఆర్కే నుంచి ఫైల్స్ తెస్తుండగా వాటితో పాటే వచ్చాయా? అని ఉద్యోగులు చర్చించుకుంటున్నారు.
ఈ నెలాఖరుకు సంవత్సరం..
గతేడాది ఏప్రిల్ 30న సెక్రటేరియట్ కొత్త బిల్డింగ్‌ను ప్రారంభించారు. అప్పటి నుంచి ఈ భవనం వేదికగానే ప్రభుత్వ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. కానీ నిర్మాణ పనులు మాత్రం ఇంకా పూర్తికాలేదు. గ్లోబ్ కింద నిర్మించిన 10, 11, 12 అంతస్తుల్లో పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. సెక్రటేరియట్ బయట నిర్మించిన క్యాంటిన్‌లో కిచెన్ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. బీఆర్ఎస్ హయాంలో అప్పటి ప్రభుత్వ పెద్దల మౌఖిక ఆదేశాల మేరకు అడ్మినిస్ట్రేషన్ సాంక్షన్ లేకుండానే కాంట్రాక్టు సంస్థ చాలా పనులు చేసింది. వీటన్నింటికి కాంగ్రెస్ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తున్నది. ఇష్టానుసారంగా చేసిన పనులకు తామేందుకు బిల్లులు చెల్లించాలని సర్కారు ప్రశ్నిస్తున్నట్టు సమాచారం.