Quantum Valley
ఆంధ్రప్రదేశ్

Quantum Valley: అమెరికాలో సిలికాన్ వ్యాలీ.. అమరావతిలో క్వాంటం వ్యాలీ

Quantum Valley: ఆంధ్రుల కలల రాజధాని అమరావతి (Amaravati) పునర్నిర్మాణానికి శంకుస్థాపన వేళ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. క్వాంటం కంప్యూటింగ్‌లో రాష్ట్రాన్ని దేశంలోనే ఫస్ట్ ప్లేస్‌లో నిలపేందుకు పట్టుదలగా ఉన్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) తెలిపారు. 2026, జనవరి 1న అమరావతి కేంద్రంగా క్వాంటం కంప్యూటింగ్ కార్యకలాపాలు ప్రారంభించాలని నిర్ణయించినట్టు చెప్పారు. ఈ మేరకు శుక్రవారం ఉండవల్లిలోని సీఎం నివాసంలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), లార్సన్ అండ్ టూబ్రో (L & T), ఐబీఎం (IBM) సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం ఎంవోయూ కుదుర్చుకుంది. ఈ నిర్ణయంతో అమరావతిలో భారతదేశపు మొట్టమొదటి, అత్యాధునిక క్వాంటం వ్యాలీ టెక్ పార్క్ నిర్మాణం జరగనుంది.

రాష్ట్రానికి చారిత్రాత్మక రోజు

ఐబీఎం సంస్థ దేశంలోనే తొలిసారి అతిపెద్ద క్వాంటం కంప్యూటర్ 156 క్యూబిట్ హెరాన్ ప్రాసెసర్‌ కలిగిన క్వాంటం సిస్టం 2ను అమరావతిలో నెలకొల్పనుండడంపై సీఎం చంద్రబాబు సంతోషం వ్యక్తం చేశారు. ఎంవోయూ సందర్భంగా ఆయన మాట్లాడారు. 1990లలో దేశంలో ఐటీ విప్లవానికి ఆంధ్రప్రదేశ్ కీలకంగా నిలిచిందని గుర్తు చేశారు. ఇప్పుడు దేశంలో క్వాంటం విప్లవానికి కూడా నాయకత్వం వహిస్తున్నదని అన్నారు. ఐబీఎం, టీసీఎస్‌, ఎల్ అండ్ టీతో జరిగిన ఒప్పందం ఆంధ్రప్రదేశ్‌కే కాదు, దేశానికి కూడా చారిత్రాత్మకంగా అభివర్ణించారు. ‘‘క్వాంటం కంప్యూటింగ్ భవిష్యత్ పాలనకు, ఆవిష్కరణలకు పునాది అవుతుందని నమ్ముతున్నా. సాంకేతిక రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, క్వాంటం కంప్యూటింగ్ లాంటి కొత్త అవకాశాలు వస్తున్నాయి. అయితే, వీటిని అందిపుచ్చుకోవడం చాలా ముఖ్యం. భవిష్యత్ అవసరాలన్నీ క్వాంటం కంప్యూటింగ్‌‌పైనే ఆధారపడి ఉంటాయి. అందుకే రాజధాని అమరావతిని క్వాంటం వ్యాలీ చేయాలనుకుంటున్నాం’’ అని వివరించారు. సిలికాన్ వ్యాలీ తరహాలో క్వాంటం వ్యాలీగా తీర్చిదిద్దాలనేది ప్లాన్. దీనిపై ఐబీఎం, టీసీఎస్ సంస్థల ప్రతినిధులకు చంద్రబాబు పలు సూచనలు చేశారు. హైటెక్ సిటీని 15 నెలల్లో నిర్మించిన అనుభవాన్ని గుర్తు చేస్తూ, క్వాంటం వ్యాలీని కూడా తక్కువ సమయంలోనే నిర్మించవచ్చని తెలిపారు. ఇప్పటికే ఎల్ అండ్ టీకి స్థలాన్ని కేటాయించామని, మౌలిక వసతులను అత్యంత వేగంగా అభివృద్ధి చేయాలని ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. ఇందుకోసం రెండు ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. ఒక కమిటీ నిర్మాణం పురోగతిని పరిశీలిస్తే, ఇంకొకటి అభివృద్ధిపై దృష్టి సారిస్తుందని తెలిపారు.

క్వాంటం ప్రయాణానికి కీలక మలుపు

ఐబీఎం క్వాంటం వైస్ ప్రెసిడెంట్ జే గాంబెట్టా మాట్లాడుతూ, దేశంలో ఐబీఎం క్వాంటం సిస్టం 2 స్థాపన, దేశ క్వాంటం ప్రయాణానికి కీలక మలుపు కానున్నదని వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, టీసీఎస్‌తో కలిసి పని చేయడం వల్ల క్వాంటం అల్గోరిథం అభివృద్ధి వేగవంతం అవుతుందన్న నమ్మకాన్ని వెలిబుచ్చారు. క్వాంటం, క్లాసికల్ సిస్టమ్‌లను కలిపిన హైబ్రిడ్ కంప్యూటింగ్ ద్వారా జీవశాస్త్రం, మెటీరియల్స్, క్రిప్టోగ్రఫీ వంటి రంగాల్లో విప్లవాత్మక మార్పులు సాధించవచ్చని చెప్పారు. టీసీఎస్ సీటీవో డాక్టర్ హారిక్ విన్ మాట్లాడుతూ, ఇది ఒక కీలక ఘట్టమని అన్నారు. అలాగే, చంద్రబాబు నాయకత్వంలో టీసీఎస్ తొలిసారి రాష్ట్రంలో డిజిటల్ గవర్నెన్స్‌కు బీజం వేసిందని టీసీఎస్ ప్రతినిధులు రాజన్న, శ్రీధర్ వివరించారు. క్వాంటం వ్యాలీ ద్వారా పరిశోధన, అభివృద్ధి మరింత ముందుకు సాగుతాయని చెప్పారు. COIN నెట్‌వర్క్ ద్వారా 17 రాష్ట్రాల్లో 43 కేంద్రాలకు ప్రత్యక్షంగా లబ్ధి చేకూరుతుందని వివరించారు. క్వాంటం కంప్యూటింగ్ అనేది రెండో క్వాంటం విప్లవమని, ఈవీ బ్యాటరీల నుంచి ఆర్థిక వ్యవస్థ వరకు దీని ఉపయోగాలు విస్తృతంగా ఉంటాయని ఐబీఎం వైస్ ప్రెసిడెంట్ స్కాట్ క్రౌడర్ అన్నారు. తాజా ఒప్పందంతో అమరావతిలో క్వాంటం వ్యాలీ ఏర్పాటుకు తొలి అడుగు పడినట్టయ్యింది. క్వాంటం కంప్యూటింగ్ పరిశోధనలకు ఆంధ్రప్రదేశ్‌ను జాతీయ కేంద్రంగా మార్చడం ద్వారా పెద్దఎత్తున పెట్టుబడులను ఆకర్షించాలనేది రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నం.

Read Also- Amaravati Relaunch: కాసేపట్లో అమరావతి సభ.. ఏర్పాట్లలో గందరగోళం.. ప్రజలు ఫైర్!

Just In

01

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..

Khairatabad Ganesh 2025: గంగమ్మ ఒడికి.. ఖైరతాబాద్ మహా గణపతి.. భారీగా తరలివచ్చిన భక్తులు

Ponguleti Srinivasa Reddy: అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్