AP DSC Notification: ఏపీలో డీఎస్సీ కోలాహలం నెలకొంది. లక్షలాది మంది నిరుద్యోగులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న డీఎస్సీ నోటిఫికేషన్ (DSC Notification) ఇటీవలే విడుదలైంది. ఏప్రిల్ 20 నుంచి మే 15 మధ్య దరఖాస్తు చేసుకునే వెసులుబాటును సైతం కల్పించారు. దీంతో భారీ సంఖ్యలో నిరుద్యోగులు డీఎస్సీకి దరఖాస్తు చేసుకుంటున్నారు. అదే సమయంలో పరీక్షల కోసం సన్నద్దమవుతున్నారు. ఇదిలా ఉంటే డీఎస్సీ నోటిఫికేషన్ కు సంబంధించి ప్రభుత్వం తాజాగా మరో గుడ్ న్యూస్ చెప్పింది.
40 శాతానికి కుదింపు
ఆంధ్రప్రదేశ్ లో 16,347 పోస్టుల భర్తీకి గాను డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలైంది. ప్రస్తుతం దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతుండగా వెనకబడిన వర్గాల విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ అభ్యర్థులు డిగ్రీలో 40 శాతం మార్కులతోనే అప్లై చేసుకునేలా ఆదేశాలు జారీ చేసింది. నోటిఫికేషన్ జారీ సమయంలో డిగ్రీలో 45 శాతం మార్కులు వచ్చిన వారే డీఎస్సీ పరీక్షకు అర్హులని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే దీనిపై అభ్యర్థుల నుంచి అభ్యంతరాలు రావడంతో తాజాగా ఆ నిర్ణయాన్ని మార్చుకుంది.
అభ్యర్థుల సూచన మేరకు
వాస్తవానికి బీఈడీ, టెట్ పరీక్షలకు డిగ్రీలో 40శాతం మార్కులను అర్హతగా నిర్ణయించారు. అయితే తాజా డీఎస్సీ నోటిఫికేషన్ లో దానిని 45 శాతానికి పెంచడంపై అభ్యర్థులు పెద్ద ఎత్తున అసంతృప్తి వ్యక్తం చేశారు. మార్కుల శాతం పెంచడం వల్ల టీచర్ ఉద్యోగాలకు తాము దూరమైపోతున్నట్లు నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు. డీఎస్సీ నోటిఫికేషన్ కోసం ఇంతకాలం చూసిన ఎదురు చూపులు వృథా అయిపోయాయని వాపోతున్నారు. దీనిని పరిగణలోకి తీసుకున్న కూటమి ప్రభుత్వం.. వారి అభ్యర్థనను మన్నించి డిగ్రీ మార్కుల అర్హతను 40 శాతానికి తగ్గించింది.
Also Read: Vaibhav Suryavanshi: రికార్డ్ బ్రేక్ చేసిన 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ .. భారీ సెంచరీతో పరుగుల వర్షం
డీఎస్సీ షెడ్యూల్ ఇదే
ఇక డీఎస్సీ నోటిఫికేషన్ షెడ్యూల్ కు వస్తే.. ఏప్రిల్ 20- మే 15 మధ్య ఆన్‌లైన్ ద్వారా ఫీజుల చెల్లింపు, దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఉంటుంది. మే 20 నుంచి నమూనా పరీక్షలు, మే 30 నుంచి హాల్ టికెట్లు డౌన్ లోడ్, జూన్ 6 నుంచి జులై 6 వరకు పరీక్షలు జరగనున్నాయి. అన్ని పరీక్షలు పూర్తయిన రెండో రోజున ప్రాథమిక ‘కీ’ విడుదల చేస్తారు. తర్వాత 7 రోజులపాటు అభ్యంతరాల స్వీకరణకు అనుమతి ఇస్తారు. అభ్యంతరాల స్వీకరణ గడువు ముగిసిన మరో 7 రోజుల తర్వాత ఫైనల్ ‘కీ’ విడుదల ఉంటుంది. ఆ తర్వాత వారం రోజులకు మెరిట్ జాబితాను విడుదల చేస్తారు.