తెలంగాణ: Cyber Fraud: లాటరీలో 17లక్షలు గెలిచావని వృద్ధున్ని నమ్మించిన సైబర్ క్రిమినల్స్ 3.20 లక్షలు కొల్లగొట్టారు. వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ కు చెందిన 76 సంవత్సరాల వృద్ధుడు ఇటీవల ఫేస్ బుక్ బ్రౌజ్ చేస్తూ అందులో కనిపించిన కేరళ ప్రభుత్వ లాటరీకి సంబంధించిన ప్రకటనను చూసి దానిపై క్లిక్ చేశాడు.
ఆ తరువాత కొద్దిసేపటికి వాట్సాప్ ద్వారా ఓ వ్యక్తి కాల్ చేశాడు. లాటరీ టిక్కెట్లు కొంటే పెద్ద మొత్తంలో డబ్బు గెలుచుకోవచ్చని చెప్పాడు. దాంతో వృద్ధుడు రెండు టిక్కెట్లు (నెంబర్లు కేఎల్ 624831, కేఎల్ 784212) కొన్నాడు. ఆ తరువాత కొన్ని రోజులకు మొదటి టిక్కెట్టుకు 5లక్షలు, రెండో టిక్కెట్టుకు 12లక్షలు వచ్చాయంటూ వృద్దుని ఫోన్ కు మెసెజ్ వచ్చింది.
Also Read: Fraud In Kurnool district: అధిక వడ్డీ ఆశ.. 100 కోట్లకు పైగా మోసం.. ఎక్కడంటే?
ఆ తరువాత ఫోన్ చేసిన సైబర్ క్రిమినల్ రిఫండబుల్ టాక్స్ తోపాటు కొన్ని చెల్లింపులు చేయాలని వృద్దునికి చెప్పాడు. ఆ తరువాత లాటరీలో గెలిచిన మొత్తం ఖాతాకు బదిలీ అవుతుందన్నాడు. చెల్లించిన రిఫండబుల్ టాక్స్ తోపాటు ఇతర మొత్తాలు లాటరీలో గెలిచిన డబ్బుతో కలిసి వస్తాయన్నాడు.
ఇది నమ్మిన వృద్ధుడు పలు దఫాలుగా 3.20లక్షల రూపాయలను సైబర్ క్రిమినల్ చెప్పిన అకౌంట్లలోకి బదిలీ చేశాడు. అయినా, డబ్బు రాకపోవటంతో అనుమానం వచ్చి సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.