తెలంగాణ: Leaders are Confused: రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా అధికారంలోకి వచ్చేది బీజేపీయేనని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కూడా ఇదే తరహా కామెంట్స్ చేసిన కమలనాథులు కేవలం 8 స్థానాలకే పరిమితమయ్యారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా ఎదిగిన బీజేపీ ఎన్నికల నాటికి చతికిలపడింది. కానీ పార్లమెంట్ ఎన్నికల నాటికి తిరిగి పుంజుకుంది. ఆ తర్వాత ఒక గ్రాడ్యుయేట్, ఒక టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాన్ని కూడా కైవసం చేసుకుంది. కాగా ఇటీవల జరిగిన హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బలం లేకున్నా బరిలోకి దిగి ఓటమి చవిచూసింది.
అయితే ఇప్పటికీ తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా బీజేపీయే సర్కార్ ఏర్పాటుచేస్తుందని ధీమాతో ఉన్నారు. ఇప్పటి వరకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. పాంహౌజ్ కే పరిమితమయ్యారు. దీంతో కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా బీజేపీ అంతో కొంతో కనిపించింది. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు సున్నా రావడం కూడా కమలదళానికి కలిసొచ్చింది. కానీ బీఆర్ఎస్ రజతోత్సవ సభ వల్ల మాజీ సీఎం రంగంలోకి దిగడంతో కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా ఎదుగుతున్న బీజేపీ స్థానం పదిలమేనా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
పార్టీ రాష్ట్ర అధ్యక్ష నియామకం:
గత డిసెంబర్ వరకు బీజేపీ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసుకోవడంపైనే పార్టీ ఫోకస్ పెట్టింది. దాదాపు 45 లక్షలకు పైగా సభ్యత్వాలను నమోదు చేసుకుంది. సంస్థాగత పర్వం తర్వాత సంగ్రామ పర్వం మొదలవుతుందని హెచ్చరించిన కమలదళం ఇప్పటివరకు ఆ సంగ్రమాన్ని చేపట్టిన దాఖలాల్లేవు. కనీసం ప్రజా సమస్యలపై పోరాటాలు చేయడంలో కూడా కాషాయ పార్టీ తీవ్రంగా విఫలమమైందనే చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో జరుగుతోంది.
Also Read: Chamala Kiran Kumar: వందల కోట్లు ఎక్కడివి? బీఆర్‌ఎస్ సమాధానం చెప్పాలి.. ఎంపీ చామల
అసలు స్టేట్ చీఫ్ నియామకంపైనే స్పష్టత కరువైన తరుణంలో సంగ్రామమెలా సాధ్యమనే చర్చ సైతం జరుగుతోంది. పార్టీ రాష్ట్ర అధ్యక్ష నియామకం మరింత ఆలస్యమయ్యే అవకాశాలున్న నేపథ్యంలో ప్రజాక్షేత్రంలో బీజేపీ ఇప్పట్లో ముందకు వెళ్లే పరిస్థితి కూడా కనిపించడంలేదని చెబుతున్నారు. ఇటీవల ఎమ్మెల్సీలుగా ఎన్నికైన అంజిరెడ్డి, మల్క కొమురయ్య గెలుపును పురస్కరించుకుని విజయోత్సవ సభ నిర్వహించలేని స్థితిలో ఉండటమే కారణంగా చెప్పుకుంటున్నారు.
త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు:
తెలంగాణలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. ఈ తరుణంలో గులాబీ పార్టీ రజతోత్సవ సభ ఆ పార్టీకి కొంత ప్లసయ్యే అవకాశాలున్నాయి. తాను మళ్లీ యాక్టివ్ అవ్వబోతున్నాననే మెసేజ్ ను ఈ ఈ సిల్వర్ జూబ్లీ సభ ద్వారా కేసీఆర్ చెప్పకనే చెప్పారు. ఇక నుంచి తాను ఊరోబోయేదే లేదని, యాడిదాకైనా సరే తానొస్తానని నొక్కి చెప్పారు. అంతేకాకుండా కేంద్రంలో ఉన్న బీజేపీపై ఘాటు విమర్శలే చేశారు. బీజేపీ తీరు భభ్రాజమానం భజగోవిందంలా ఉందంటూ చురకలంటించారు. తెలంగాణకు కేంద్రం ఇచ్చిందేంటని ప్రశ్నిస్తూ శూన్యహస్తాలు శుష్క ప్రియాలేనని కౌంటర్లు ఇచ్చారు.
Also Read: Mahesh Kumar Goud: కవిత వ్యాపారాలు, కేసీఆర్ కుటుంబం.. పై మహేష్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు!
తల్లిని చంపి బిడ్డను బతికించారని ప్రధాని మోడీ ఎన్నోసార్లు అన్నారనే అంశాన్ని సైతం ఆయన గుర్తుచేశారు. ఆపరేషన్ కగార్ వెంటనే ఆపేయాలని, చత్తీస్ గఢ్ లో గిరిజనులపై ఊచకోత తగదని హెచ్చరించారు. ఇన్ని రోజులు ఫాంహౌజ్ కు పరిమితమైన కేసీఆర్.. మళ్లీ యాక్టివ్ అయితే బీజేపీ పరిస్థితేంటనేది సందిగ్ధంలో పడింది. గులాబీ పార్టీ గుబాళిస్తే.. కమలం పార్టీ ముందున్న వ్యూహమేంటనేది తెలియాల్సి ఉంది. ఇన్నిరోజులు స్తబ్ధుగా ఉన్న కాషాయదళం ఇప్పటికైనా సంగ్రామ పర్వం మొదలెడుతుందా? లేక చేతులెత్తేస్తుందా? అనేది చూడాలి.