Chamala Kiran Kumar: వరంగల్‌లో బీఆర్‌ఎస్ పార్టీ నిర్వహించనున్న రజతోత్సవ సభకు రాష్ట్ర నలుమూలల నుండి లక్షలాదిగా జనాలు తరలి వస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత మొదటిసారి బహిరంగ సభ నిర్వహిస్తుండటంతో ఎలా జరుగుతుందో అని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఈ సభను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు.
25 వార్షికోత్సవ సభ కావడంతో పార్టీ నేతలు సీరియస్ గా లీసుకుని దాదాపు 10 లక్షల మందిని తరలించేలా ఏర్పాట్లు చేశారు. ఈరోజు సాయంత్రం సభ ప్రారంభం కానున్న నేపథ్యంలో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ట్విట్టర్(X) వేదికగా ట్వీట్ చేశారు.
ఒక రాజకీయ పార్టీ ఒక మాదిరి సభ పెట్టాలంటేనే ఖర్చులు భరించలేక నాయకుల నరాలు తెగుతాయి. రూపాయి రూపాయి పోగేసి సభను సక్సెస్ చేస్తే చాలు.. హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకుంటారు. అందులోనూ ప్రతిపక్షంలో ఉండి సభ నిర్వహించాలంటే ఎంత నరకమో చెప్పనక్కర్లేదు కానీ, బీఆర్ఎస్ వరంగల్ సభ ఏర్పాట్లు చూస్తుంటే కళ్లు చెదురుతున్నాయి.
వందల కోట్లు ఖర్చు చేస్తే తప్ప ఆ రకంగా సభ పెట్టడం సాధ్యం కాదు. జనాన్ని ఎంత మందిని తీసుకొస్తారు, ఆ పనికి ఎంత ఖర్చు చేస్తారు అన్నది వేరే విషయం. సభ ఏర్పాటు తీరే కళ్లు బైర్లు కమ్మేలాగా ఉంది. ఆ వేదిక, హంగామా, ఆర్భాటం చూస్తుంటే ఊహకందనంత ఖర్చు అయ్యుంటుందని సామాన్యుడికి కూడా అర్థమవుతోంది అంటూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంత భారీ సభ నిర్వహించడానికి అంత డబ్బు ఎక్కడిదంటూ ప్రశ్నించారు.
Also read: Lady Aghori: లేడీ అఘోరీ తతంగం వెనుక పొలిటికల్ లీడర్? డబ్బంతా ఆయనదేనట..
కూలిన కాళేశ్వరం కమీషన్ సొమ్మా? మిషన్ భగీరథ పేరుతో పాత ట్యాంకులకు రంగులు వేసి, పాత తాగునీటి పథకాలను లింక్ చేసి దోచిన సొమ్మా? అంటూ ధ్వజమెత్తారు. హైదరాబాద్ బిల్డర్ల దగ్గర పర్మిషన్ల కోసం వసూలు చేసిన “అదనపు ఫ్లోర్ల” కమీషన్ సొమ్మా? అంటూ దుయ్యబట్టారు. లేకపోతే ఫార్ములా కార్ రేస్ పేరుతో ప్రైవేట్ కంపెనీల పేరుతో దోచిన సొమ్మా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.
ధరణి పేరుతో అర్ధరాత్రులు భూ హక్కులను మార్చేసి వేల ఎకరాల దోపిడీ సొమ్ముతో చేస్తున్నారా అని ట్విట్టర్(X) లో ట్వీట్ చేశారు. కానామెట్, నియోపోలీస్, కోకాపేట్ లలో వేల కోట్ల విలువ చేసే భూములను వేలం పేరుతో ఐనవారికి దోచిపెట్టడం ద్వారా సంపాదించిన సొమ్మా? పది సంవత్సరాలు దోచుకుని లక్షల కోట్ల విలువ చేసే ఔటర్ రింగ్ రోడ్డును కేవలం రూ.7000 కోట్లకు 33 ఏళ్ల పాటు ప్రైవేటు కంపెనీకి ధారాదత్తం చేయడం వల్ల వచ్చిన “కిక్ బ్యాక్” సొమ్ముతో చేస్తున్నారా? అంటూ ఫైర్ అయ్యారు.
రెండు గంటల సభ కోసం ఖర్చు చేస్తోన్న ఈ వందల కోట్ల ధన ప్రవాహం ఏ కమీషన్ల తాలుఖాదో తెలంగాణ సమాజానికి బీఆర్ఎస్ చెప్పాలని, మీరు చెప్పకపోయిన ప్రజలకు ఇప్పటికే అర్థం అయ్యిందని తెలిపారు.