Lady Aghori: లేడీ అఘోరీ గురించి రోజుకొక సంచలన విషయం వెలుగులోకి వస్తోంది. ఇటీవల ఓ మహిళను పూజల పేరుతో మోసం చేయడంతో పోలీసులు అరెస్టు చేసి ఇప్పటికే న్యాయస్థానం ఆదేశాల మేరకు జైలుకు తరలించారు. అయితే అఘోరి శ్రీనివాస్ కు ఓ రాజకీయ నాయకుడు సహకరించినట్లు ప్రచారం సాగుతుంది. ఇదే విషయంపై దృష్టి సారించిన పోలీసులు మొత్తం కూపీ లాగుతున్నట్లు సమాచారం.
లేడీ అఘోరి అంటే రెండు రాష్ట్రాలలో తెలియని వారు ఉండరు. ఎన్నో వివాదాలు, సంచలన కామెంట్స్ చేస్తూ నిత్యం వార్తల్లో నిలిచే లేడీ అఘోరి ఇటీవల జైలు పాలయ్యారు. మంగళగిరి కి చెందిన శ్రీ వర్షిణిని ముచ్చటగా మూడోసారి వివాహం చేసుకున్న లేడీ అఘోరి వార్తల్లో సంచలనంగా మారారు. శ్రీ వర్షిణి కుటుంబీకులు సంచలన ఆరోపణలు సైతం లేడీ అఘోరిపై చేశారు. ఈ క్రమంలోనే లేడీ అఘోరి తన భర్త అంటూ ఓ మహిళ తెరమీదకి వచ్చింది.
సనాతన ధర్మం పేరుతో వెలుగులోకి వచ్చిన లేడీ అఘోరి శ్రీనివాస్ ఉదంతం మరో మారు వివాదానికి దారి తీసింది. తనను పెళ్లి చేసుకుని మోసం చేసినట్లు ఆ మహిళ ఆరోపించడమే కాక పోలీసులకు సైతం ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలోనే మరో మహిళ తనను మంత్రాల పేరుతో మోసం చేసినట్లు తన వద్ద సుమారు పది లక్షల వరకు నగదు తీసుకున్నట్లు ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
అయితే ఉత్తరప్రదేశ్ లో ఉన్న లేడీ అఘోరి, శ్రీ వర్షిణి తాము ఇక తెలుగు రాష్ట్రాలకు రామంటూ వీడియో సైతం విడుదల చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి చివరికి ఉత్తరప్రదేశ్ కు వెళ్లి లేడీ అఘోరిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం న్యాయస్థానం ముందు హాజరపరచగా 14 రోజుల రిమాండ్ విధించడంతో పోలీసులు జైలుకు తరలించారు. లేడీ అఘోరి అరెస్ట్ అనంతరం ఓ సంచలన విషయం వెలుగులోకి వచ్చింది.
లేడీ అఘోరీ ఉపయోగిస్తున్న కారు లక్ష్మి కన్స్ట్రక్షన్స్ పేరు పై రిజిస్ట్రేషన్ అయినట్లు పోలీసులు గుర్తించారు. లేడీ అఘోరి శ్రీనివాస్ కు ఎన్ని రోజులు ఎవరు నిధులు సమకూర్చారన్న కోణంలో సైతం పోలీసులు ఆరాతీస్తున్నారు. కారు వివరాల ఆధారంగా అఘోరి శ్రీనివాస్ ఉపయోగిస్తున్న కారు లక్ష్మీ కన్స్ట్రక్షన్స్ పేరుపైన ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. తమిళనాడుకు చెందిన ఓ పార్టీ నాయకుడు గిఫ్ట్ కింద ఐ20 కారును అఘోరికి ఇచ్చారని, అలాగే నిధులను కూడా సమకూర్చింది ఇదే నాయకుడు అంటూ పోలీసులు అనుమానిస్తున్నారు.
Also Read: BRS Rajathotsavam: మాజీ సీఎం కేసీఆర్ మాటేంటి? అసలేం చెప్పబోతున్నారు?
పలు దఫాలు తమిళనాడు రాజకీయ నాయకుడితో ఫోన్లో మాట్లాడిన పోలీసులు పూర్తి వివరాలను వెలుగులోకి తెచ్చేందుకు దర్యాప్తు ముమ్మరం చేశారు. అంతేకాకుండా అఘోరి శ్రీనివాస్ కు అండగా ఉంటూ జైలు నుండి విడిపించేందుకు ఆ రాజకీయ నాయకుడు ప్రయత్నాలు చేస్తున్నట్లు సైతం పోలీసుల దృష్టికి వచ్చిందని తెలుస్తోంది. మొత్తం మీద లేడీ అఘోరికి నిధులు అందించిన విషయంలో తమిళనాడు రాజకీయ నాయకుడి పేరు రావడం సంచలనంగా మారింది.