తెలంగాణ: Minister Tummala Nageswara Rao: రాష్ట్ర పర్యటనకు జార్ఖండ్ వ్యవసాయశాఖ మంత్రి శిల్పి నేహా తెర్కే వచ్చారు.ఈ పర్యటనలో భాగంగాఎన్ఎంఆర్ఐ, ఫిష్ ఫార్మ్, ఎన్ఎఫ్డీబీ, ఐఐఎంఆర్ సమావేశాల్లో పాల్గొననున్నారు. హైదరాబాద్ లోని తాజ్ కృష్ణ హోటల్‌లో ఆదివారం తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ తుమ్మల నాగేశ్వర రావు ను మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఇరు మంత్రులు తమ తమ రాష్ట్రాల్లో రైతుల కోసం అమలు చేస్తున్న పథకాలపై సుధీర్ఘంగా చర్చించారు.
తెలంగాణలో అమలులో ఉన్న రైతు సంక్షేమ పథకాలు, ఆయిల్ పామ్ సాగు ప్రోత్సాహం, దీన్ని లాభదాయక పంటగా మార్చేందుకు తీసుకుంటున్న చర్యలను తమ్మల వివరించారు. వ్యవసాయ రంగంలో కొత్త పథకాలు, కృత్రిమ మేధస్సు వినియోగం, రైతులకు లాభదాయకంగా చేసే విధానాలపై తీసుకుంటున్న చర్యలపై వివరించారు. రైతుల ప్రయోజనార్థం అమలు చేస్తున్న వ్యవసాయ, హార్టికల్చర్ రంగాలలోని అభివృద్ధి చర్యలు, మార్కెటింగ్ పరిష్కారాలపై తుమ్మల వివరించారు. ఇరు రాష్ట్రాల వ్యవసాయ రంగ అభివృద్ధి, రైతుల సంక్షేమం కోసం ఇరు రాష్ట్రాలు సహకరించుకోవాలనికోరారు.
Also Read: Maoists in Karregutta: కర్రెగుట్ట ప్రాంత గ్రామాల్లో టెన్షన్ టెన్షన్.. హిడ్మా, దేవా లే టార్గెట్!
తెలంగాణలో రైతుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వివరించారు. రాష్ట్ర బడ్జెట్ లో సింహభాగం రైతుల కోసం కేటాయించి, దేశంలో ఎక్కడా జరగని విధంగా 2 లక్షల లోపు పంట రుణమాఫీని ఏకకాలంలో పూర్తిచేశామన్నారు. రూ.20,616 కోట్లను ఖర్చు చేసి 25,35,964 మంది రైతులను రుణవిముక్తులను చేసినట్టు వెల్లడించారు.
రైతుభరోసా పథకం ద్వారా రైతులకు పంట పెట్టుబడి సహాయాన్ని అందిస్తున్నామని, ప్రకృతి వైపరిత్యాల కారణంగా నష్టపోయిన రైతులకు నష్ట పరిహారం చెల్లిస్తున్నట్టు తెలిపారు. రైతులను ఆర్థికంగా బలోపేతం చేయడానికి అనేక పథకాలు అమలు చేస్తున్నామని, అందులో భాగంగానే రైతులు అధిక ఆదాయం పొందేలా మైక్రో ఇరిగేషన్ పథకాన్ని అమలు చేస్తున్నామని, అందుకోసం సబ్సిడీని అందిస్తున్నామని తెలిపారు.
గత 3, 4 ఏళ్లలోనే రాష్ట్రంలో దాదాపు 2 లక్షల ఎకరాలలో ఆయిల్ పామ్ ను సాగు చేసినట్టు తెలిపారు. రాష్ట్రంలో పామ్ ఆయిల్ ప్రాసెసింగ్ యూనిట్లను నెలకొలుపుతున్నామని అన్నారు. సన్నాలకు బోనస్ గా రూ.500 చెల్లిస్తున్నామని, తద్వారా సన్నాల సాగు పెరిగిందన్నారు. ప్రతి గింజను రైతులకు గిట్టుబాటు ధర చెల్లించి సివిల్ సప్లై శాఖ ద్వారా కొనుగోలు చేయడం జరిగిందన్నారు.
Also Read: CM Revanth Reddy Tweet: లక్ష్యం ఇదేనంటూ.. సీఎం రేవంత్ భావోద్వేగ ట్వీట్..
రైతు మార్కెట్ కమిటిలకు ఛైర్మన్, వైస్ చైర్మన్లతో పాటు పాలకవర్గాలను నియమించడం జరుగుతుందన్నారు. రాష్ట్రంలోని ఆయిల్ పామ్ నర్సరీలను సందర్శించాలని జార్ఖండ్ మంత్రిని కోరారు. ఈ సమావేశంలో వ్యవసాయశాఖ సెక్రటరీ రఘునందన్ రావు, డైరెక్టర్ హార్టికల్చర్ యాస్మిన్ పాషా పాల్గొన్నారు.