Game Changer: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), సంచలన దర్శకుడు శంకర్ (Shankar) కాంబినేషన్‌లో స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించిన ‘గేమ్ ఛేంజర్’ చిత్రంపై విడుదలకు ముందు ఆకాశమే అవధి అన్నట్లుగా అంచనాలున్నాయి. కానీ విడుదలైన తర్వాత మాత్రం కొందరు పాజిటివ్‌గా, మరికొందరు నెగిటివ్‌గా సినిమాపై కామెంట్స్ చేశారు. దీనికి తోడు హై క్వాలిటీ ప్రింట్‌ను సినిమా విడుదలైన రోజే యాంటీ ఫ్యాన్స్ కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో కర్ణుడి చావుకి కారణాలు అనేకం అన్న సామెత మాదిరిగా.. ‘గేమ్ ఛేంజర్’ ఫ్లాప్‌కి అనేక కారణాలు తోడయ్యాయి. వాస్తవానికి ఈ సినిమా 2024లోనే విడుదల కావాలి. డైరెక్టర్ శంకర్ కారణంగా సినిమా షూటింగ్ ఆలస్యం అవుతూ వచ్చింది.
Also Read- Suriya: అలాంటి టాటూలు వేసుకోవడాన్ని నేను అంగీకరించను.. చిరంజీవే స్ఫూర్తి!
కమల్ హాసన్ ‘ఇండియన్ 2’ సినిమా షూటింగ్ కూడా శంకర్ చేయాల్సి రావడంతో, రెండు సినిమాలను ఏకకాలంలో ఆయన షూట్ చేయాల్సి వచ్చింది. దీంతో అవుట్‌ఫుట్‌పై చాలా దెబ్బపడింది. తద్వారా రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. కాస్త ‘గేమ్ ఛేంజర్’ పర్లేదు కానీ, ‘ఇండియన్ 2’ అయితే మరీ దారుణం. శంకర్ కెరీర్‌లోనే భారీ ఫ్లాప్‌గా ఆ చిత్రం నిలిచింది. ఇక ‘గేమ్ ఛేంజర్’ విడుదలై, వచ్చిన టాక్ తర్వాత, ఆ సినిమా బోల్తా కొట్టడానికి అనేకానేక కారణాలు వినిపించాయి. ముఖ్యంగా నిర్మాత దిల్ రాజుకు ఈ సినిమా పరిస్థితి ముందే అర్థమైంది. అందుకే విడుదల తర్వాత ఒక్క మీడియా సమావేశం కూడా పెట్టలేదు. రామ్ చరణ్ కూడా ఈ సినిమాను పట్టించుకున్న దాఖలాలు కనిపించలేదు. అంటే ఫలితం ముందే వాళ్లకి తెలిసిపోయింది.
శంకర్‌కు ఎదురు చెప్పలేక, ఆయన ఏం చేస్తే అది ఓకే అనాల్సిన పరిస్థితి నెలకొందనేది దిల్ రాజు చర్యలను బట్టి అర్థమైంది. అదెలా అంటే, దిల్ రాజు నిర్మించిన ఏదైనా సినిమా విడుదలైతే, ఆ సినిమా ఎలా ఉన్నా, కచ్చితంగా మీడియా సమావేశం నిర్వహిస్తారు. థ్యాంక్స్ మీట్ ఏర్పాటు చేస్తారు. ‘గేమ్ ఛేంజర్’కు అలాంటిదేదీ జరగలేదు. ఈ సినిమా విషయంలో శంకర్ తన ఇష్టం వచ్చినట్లుగా చేశాడనేది అయితే స్పష్టమైంది. సినిమా విడుదల తర్వాత.. ఎడిటింగ్‌లో చాలా తీసేయాల్సి వచ్చిందని, ఇంకా రా కంటెంట్ చాలా ఉందని శంకర్ చెబితే, ఈ సినిమాకు కథ అందించిన కార్తీక్ సుబ్బరాజ్.. అసలు నేను చెప్పిన కథతో ఆ సినిమా తీయలేదని ఒకే ఒక్క స్టేట్‌మెంట్‌తో.. అక్కడ ఏం జరిగిందో క్లారిటీ ఇచ్చేశారు.
Also Read- Amrutha Pranay : సంచలన వీడియో రిలీజ్ చేసిన అమృత ప్రణయ్.. ఇక నుండి న్యూ లైఫ్ స్టార్ట్ అంటూ..
ప్రభుదేవా కంపోజ్ చేసిన సాంగ్, క్లారిటీ లేని ఫైట్స్.. ఇలా చెప్పుకుంటూ పోతే ‘గేమ్ ఛేంజర్’ సినిమా ఫ్లాప్‌కు కారణాలు చాలానే ఉన్నాయి. థియేటర్లలో రిజల్ట్ తేడా కొట్టినా, ఓటీటీలలో మంచి స్పందన రాబట్టుకున్న చిత్రాల జాబితాలోకి కూడా ఈ సినిమా చేరలేకపోయింది. ఇప్పుడు బుల్లితెరపైకి ఈ సినిమా వస్తుంది. ఏప్రిల్ 27, ఆదివారం సాయంత్రం 5.30 గంటలకు జీ తెలుగు ఛానల్‌లో ఈ సినిమా ప్రీమియర్ (Game Changer TV Premiere) పడుతోంది. మరి బిగ్ స్క్రీన్‌పై బోల్తా కొట్టిన ఈ సినిమా.. స్మాల్ స్ర్కీన్‌పై ఏ విధంగా పెర్ఫార్మ్ చేస్తుందో అని, మెగా ఫ్యాన్స్ అంతా ఎంతగానో వేచి చూస్తున్నారు. గతంలో రామ్ చరణ్ చేసిన ‘వినయ విధేయ రామ’ చిత్రం థియేటర్లలలో ఫెయిలైనా, బుల్లితెరపై మాత్రం పెద్ద హిట్‌గా నిలిచింది. ఎప్పుడు టెలికాస్ట్ అయినా, ఆ సినిమా మినిమమ్ 5కి తగ్గకుండా రేటింగ్ సాధిస్తుంది. ఆ జాబితాలోకి ఈ సినిమా కూడా చేరుతుందని ఫ్యాన్స్ ఆశపడుతున్నారు. చూద్దాం.. ఏం జరుగుతుందో?
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు