Visakhapatnam Crime: విశాఖ లో బాలిక అనుమానాస్పద మృతికేసుకు సంబంధించి మరో విషాద ఘటన చోటుచేసుకుంది. ఇటీవల బాలికను అనారోగ్యం కారణంగా ఓ ప్రార్థన మందిరం వద్దకు తీసుకెళ్లగా, ఆ తర్వాత బాలిక అనుమానాస్పద స్థితిలో చనిపోయిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి ప్రస్తుతం విచారణ జరుపుతున్న నేపథ్యంలో మరో విషాద ఘటన చోటుచేసుకుంది. బాలిక తల్లి, అమ్మమ్మలు బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడడంతో ప్రస్తుతం కేసు కొత్త మలుపుకు తిరిగిందని చెప్పవచ్చు.
పూర్తి వివరాలలోకి వెళితే..
విజయనగరం జిల్లా డెంకడాకు చెందిన 11 ఏళ్ల మైనర్ బాలిక ఇంటిలో విచిత్రంగా ప్రవర్తిస్తున్న నేపథ్యంలో బాలిక తల్లి, అమ్మమ్మ విశాఖలోని ఓ ప్రార్థన మందిరం వద్దకు బాలికను తీసుకువచ్చారు. అక్కడ ఏం జరిగిందో ఏమో కానీ బాలిక అనుమానాస్పస్థితిలో మృతి చెందింది. బాలిక ముఖానికి చున్ని చుట్టి, నోట్లో గుడ్లు కుక్కిన ఆనవాళ్లు ఉన్నట్లు ప్రచారం సాగింది. తనకు తెలియకుండానే తన కుమార్తెను చర్చికి తీసుకెళ్లారని తండ్రి చెప్పినట్లు సమాచారం. చివరికి బాలిక మృతి చెందడంతో పోలీసులు ఎంటర్ అయ్యారు.
పూర్తి వివరాలను ఆరా తీసిన విశాఖ ఐదవ పట్టణ పోలీస్ స్టేషన్ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ సందర్భంగానే బాలిక తల్లి, అమ్మమ్మను పిలిచి అసలేం జరిగిందని కోణంలో పోలీసులు విచారించారు. శనివారం ఇదే రీతిలో వారిని పిలిచి విచారించిన అనంతరం పోలీసులు పంపించి వేశారు. కేసులకు భయపడ్డారో ఏమో కానీ బావిలో దూకి ఆత్మహత్యకు వారు పాల్పడ్డారు. ఈ విషయాన్ని గమనించిన కుటుంబ సభ్యులు మృతదేహాలను బావిలో నుండి బయటకు తీసారు.
అయితే వీరు ఆత్మహత్యకు పాల్పడ్డారా? లేక మరే ఇతర కారణం ఉందా అన్నది పోలీసుల విచారణలో వెల్లడి కావాల్సి ఉంది. మొత్తం మీద ఆ కుటుంబం 11వేల బాలికతో పాటు, మరో ఇద్దరిని ఈ ఘటనతో కోల్పోయింది. బాలిక తల్లి, అమ్మమ్మ ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికంగా తెలియడంతో స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున వారి గృహం వద్దకు చేరుకున్నారు. అక్కడ విషాదఛాయలు అలుముకున్నాయి.