MLA Danam Nagender: మాజీ మంత్రి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ వ్యాఖ్యలు ఇప్పుడు పొలిటికల్ సర్కిళ్లలో దూమారం రేపాయి. కేసీఆర్ ను చూసేందుకు జనాలు ఆసక్తిగా ఉన్నారంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.అంతేగాక కేసీఆర్ నిర్వహించబోయే సభ విజయవంతం అవుతుందని సంతోషం వ్యక్తం చేశారు. ఇవే కాక ఏఐఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ రీ ట్వీట్ కు మద్ధతిస్తూ.. ఆమె వాస్తవం మాట్లాడరని ఆయన నొక్కి చెప్పారు.
ఈ కామెంట్లు రాజకీయ నేతల్లో చర్చకు దారి తీసింది. బీఆర్ ఎస్ రజతోత్సవ సంబురాలకు సరిగ్గా రెండు రోజుల ముందే దానం చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. దీంతో దానం మళ్లీ బీఆర్ ఎస్ కు వెళ్తారా? అనే చర్చ కూడా జరుగుతుంది. వరుసగా గులాబి పార్టీకి పాజిటివ్ కామెంట్లు ఇస్తున్న ఆయన..తన రాజకీయ భవిష్యత్ పై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఉత్కంఠగా మారింది.
గతంలోనూ ఓ టీవీ ఛానెల్ ఇంటర్వ్యూలో దానం కేసీఆర్ పై ప్రశంసలు కురిపించారు. హైడ్రా విషయంలోనూ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. మంత్రుల నుంచి రిప్లైలు రావడం లేదని సాక్షాత్తు అసెంబ్లీ సాక్షిగా ఆయన ప్రభుత్వాన్ని నిలదీశారు. వీటన్నింటినీ పరిశీలిస్తున్న రాజకీయ నేతలు..మళ్లీ ఆయన బీఆర్ ఎస్ కు వెళ్లే ఛాన్స్ ఉన్నదనే ప్రచారాన్ని తెర మీదకు తీసుకువచ్చారు. సుదీర్ఘకాలం రాజకీయ అనుభవం కలిగిన దానం నాగేందర్ ఎలాంటి స్టెప్ తీసుకుంటారనేది చర్చంశనీయమైనది.
కాంగ్రెస్ పవర్ లోకి రాగానే జంప్…?
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పవర్ లోకి వచ్చిన కొద్ది నెలల్లోనే దానం అధికార పార్టీలోకి జంప్ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు అప్పటి ఏఐసీసీ ఇన్ చార్జీ దీపాదాస్ మున్షి చేతుల మీదుగా ఆయన గాంధీభవన్ లో పార్టీ కండువా కప్పుకున్నారు. అప్పట్నుంచి కొంత కాలం కాంగ్రెస్, సీఎం తో బాగానే మూవ్ అయ్యారు. పార్లమెంట్ ఎన్నికల సమయంలో సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేయాలని పార్టీ ఆదేశించింది.
దీంతో దానం నాగేందర్ సికింద్రాబాద్ ఎంపీగా కాంగ్రెస్ బీ ఫామ్ పై ఫోటీ చేసి, ఓడిపోయారు. అయితే ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికైన పార్టీ కి రాజీనామా చేయకుండానే ఎంపీగా పోటీ చేయడం గమనార్హం. దీంతో టెక్నికల్ గా దానం చిక్కుల్లో పడ్డారని పొలిటికల్ ఎక్స్ పర్ట్స్ చెప్తూ వస్తున్నారు. మిగతా తొమ్మిది మంది ఎమ్మెల్యేలు కూడా బీఆర్ ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి చేరినా, ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ బీ ఫామ్ పై పోటీ చేయలేదు. దీంతో దానం ఒక్కరే చిక్కుల్లో పడ్డారనే చర్చ కూడా రాజకీయ నేతల్లో కలిగింది. అప్పట్నుంచి దానం నాగేందర్ కాంగ్రెస్ పై అసంతృప్తితోనే ఉన్నట్లు ఆయన సన్నిహితులు చెప్తున్నారు.
రెండు పార్టీల నడుమ సతమతం..?
పార్లమెంట్ ఎన్నికలు ముగిసినప్పటి నుంచి ఎమ్మెల్యే దానం నాగేందర్ ఇటు కాంగ్రెస్ తోనూ ఆశించిన స్థాయిలో సఖ్యతతో లేరనేది ఆయన అనుచరులు చెప్తున్న మాట. పార్టీ కూడా ఆయనకు తగిన స్థాయిలో ప్రయారిటీ ఇవ్వడం లేదనేది ఓపెన్ టాక్. మంత్రిగా, సీనియర్ ఎమ్మెల్యేగా పనిచేసిన దానంకు గ్రేటర్ హైదరాబాద్ లో మంచి పట్టు ఉన్నది. కానీ కాంగ్రెస్ ఆయన సేవలను వినియోగించుకోకపోవడమే కాకుండా, ప్రాధాన్యత కూడా ఇవ్వడం లేదని ఆయన సన్నిహితులే చెప్తున్నారు. ఇటు చేరిన పార్టీలో ఇమడలేక, గెలిచిన పార్టీకి వెనక్కి వెళ్లలేక దానం సతమతం అవుతున్నారు.
బీఆర్ ఎస్ , కాంగ్రెస్ కేడర్, లీడర్లలోనూ ఇదే చర్చ జరుగుతుంది. మరోవైపు ఇక తమ పార్టీ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్లిన ఎమ్మెల్యేలను ఎట్టి పరిస్థితుల్లో తిరిగి చేర్చుకోబోమని మాజీ మంత్రి కేటీఆర్ నొక్కి చెప్పారు. తాజాగా టీవీ ఇంటర్వ్యూల్లోనూ ఆయన ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎమ్మెల్యే దానం నాగేందర్ రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్ధకంగా మారిందని గాంధీభవన్ లో ని నేతలు వెల్లడిస్తున్నారు.
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/లింక్ క్లిక్ చేయగలరు