CM Revanth Reddy Japan Tour: తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం జపాన్ పర్యటన విజయవంతం గా ముగిసినట్లు ప్రభుత్వం ఓ ప్రకటనలో పేర్కొన్నది. ఈ నెల 16న జపాన్ కు వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని అధికారుల బృందం ఏడు రోజుల పర్యటన ముగిసింది. అయితే జపాన్ పర్యటనలో పెట్టుబడులతో పాటు తెలంగాణ ప్రభుత్వం సరి కొత్త లక్ష్యాలను చేరుకున్నట్లు సర్కార్ వెల్లడించింది. తెలంగాణలో ఉన్న అవకాశాలు, పారిశ్రామిక అనుకూల వాతావరణాన్ని మరోసారి ప్రపంచానికి చాటిచెప్పిందని వివరించారు.
అంతర్జాతీయ సంబంధాలు, పరస్పర సహకార సంప్రదింపులు జరపడంలో కొత్త అధ్యాయానికి తెర లేపినట్లు పేర్కొన్నారు. ఈ టూర్ లో జపాన్లో పేరొందిన కంపెనీలతో రూ.12062 కోట్ల పెట్టుబడుల ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు ప్రకటించారు.దీంతో దాదాపు 30,500 కొత్త ఉద్యోగాలు లభించనున్నాయి. మరోవైపు జనవరిలో దావోస్ లో జరిగిన వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సులో రూ.1.78 లక్షల కోట్ల పెట్టుబడులు..50 వేల ఉద్యోగాలు రాగా, అమెరికా, సౌత్ కొరియా, సింగపూర్ లో తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం పర్యటించి, రూ.14,900 కోట్ల పెట్టుబడులు సాధించింది.
ఇక గత ఏడాది 2024 దావోస్ పర్యటనలో రూ.40 వేల కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు ప్రభుత్వం వెల్లడించింది. దీంతో తెలంగాణలో ప్రజా ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి (2023 డిసెంబర్) నుంచి ఇప్పటివరకు రూ. 2,44,962 కోట్లు పెట్టుబడులు సాధించగా, 80,500 కొత్త ఉద్యోగాలను సృష్టించినట్లు ప్రభుత్వం తన ప్రకటనలో వివరించింది. ఇక గురువారం ఉదయం 11 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి కమాండ్ కంట్రోల్ సెంటర్ లో జరిగే భారత్ సమ్మిట్ ఏర్పాట్లపై ఉన్నతాధికారులతో రివ్యూ నిర్వహించనున్నారు.
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/లింక్ క్లిక్ చేయగలరు