Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. తన శాఖ పరిధిలో అలాంటి నిర్వాకాలు తన దృష్టికి వస్తే చాలు, ఎవ్వరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని పవన్ హెచ్చరించారు. ఏపీలో జరిగిన జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు.
ముందుగా పవన్ కళ్యాణ్ కు పంచాయతీరాజ్ అధికారులు ఘనస్వాగతం పలికారు. అనంతరం పంచాయతీరాజ్ శాఖ పరిధిలో విశిష్ట సేవలు అందిస్తున్న అధికారులను పవన్ అభినందించారు. ఎక్కడో కేరళలో విధులు నిర్వహిస్తూ రాష్ట్రానికి సేవ చేయాలన్న దృక్పథంతో ఐఏఎస్ కృష్ణ తేజ ఏపీకి రావడం అభినందించదగ్గ విషయమని, అలాగే మిగిలిన అధికారులు కూడా పంచాయతీరాజ్ శాఖకు వన్నెతెచ్చేందుకు కృషి చేస్తున్నారని కొనియాడారు.
ఇక పవన్ వార్నింగ్ ఏమిటంటే.. ఏపీలో జరిగిన ఎన్నికల అనంతరం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పంచాయతీరాజ్ శాఖ ను ఎంతో ఇష్టంగా ఎంచుకున్నట్లు పవన్ అన్నారు. గ్రామాలు దేశానికి పట్టుకొమ్మలని, గ్రామాలే స్వయం ప్రతిపత్తి కలిగి ఉండాలన్న లక్ష్యంతో మంచి ఆలోచనలతోపాటు, తనకు పూర్తిగా అవగాహన ఉందన్నారు.
పంచాయతీలకు నిధులు ఏ ఉద్దేశంతో కేటాయించబడ్డాయో వాటికే ఖర్చు చేయబడాలని తాను నిర్ణయించానన్నారు. ఈ నిర్ణయానికి ఐఏఎస్ శశిభూషణ్ సైతం మద్దతు పలికి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించేందుకు సహకరిస్తున్నట్లు పవన్ అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీరాజ్ పరిధిలోని రహదారులను అభివృద్ధి చేయడంతో పాటు, నీటి తొట్లు ఏర్పాటు చేయగలిగినట్లు పవన్ అన్నారు. ఎన్నో కీలక పనులను రాష్ట్రంలో పంచాయతీరాజ్ శాఖ ద్వారా చేయగలిగామని, అందుకు అధికారులు అందిస్తున్న సహకారం లేకుంటే ఈ విజయం తీరాలను చేరుకునే వారము కాదని ఆయన తెలిపారు.
పంచాయతీల్లో తీరుతెన్నులు చూస్తే తనకు బాధ వేసేదని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సీఎం చంద్రబాబు నాయుడు సహకారంతో పంచాయతీ వ్యవస్థను బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలిపారు. తనకు పరిపాలన అనుభవం లేనప్పటికీ మంచి చేయాలన్న చిత్తశుద్ధి ఉందని అందుకు అనుగుణంగా ముందుకు సాగుతున్నట్లు తెలిపారు.
Also Read: High Security In Tirumala: తిరుమలలో హైఅలర్ట్.. వాహనాల ముమ్మర తనిఖీలు.. ఎందుకంటే?
పంచాయతీరాజ్ లో డబ్బులు, సిఫార్సులు లేకుండా బదిలీలు జరిగేవి కాదని, ఈ విషయాలపై తన ఫేషికి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు పవన్ అన్నారు. ఎక్కడైనా ఒక్క చిన్నపాటి పైరవీ చేసినా ఆ అధికారి ఇక్కడ ఉండే ప్రసక్తే లేదని, చివరి శ్రామికుడి వరకు పంచాయతీరాజ్ ఫలితాలు అందాలంటే నిర్లక్ష్యం, పైరవీలు ఉండకూడదని పవన్ హెచ్చరించారు.