Faculty Members Protest: తెలంగాణ రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో తక్కువ వేతనాలతో ఉద్యోగ భద్రత లేకుండా శ్రమ దోపిడీకి గురవుతున్న పార్ట్ టైం అధ్యాపకులకి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ కాకతీయ యూనివర్సిటీలో పార్ట్ టైం అధ్యాపకులు పరిపాలన భవనం ముందు వరుసగా రెండవ రోజు వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. ప్రభుత్వం వెంటనే పార్ట్ టైం అధ్యాపకుల సమస్యల పరిష్కరించాలని నినాదాలు చేశారు.
ధర్నా కార్యక్రమంలో పార్ట్ టైం అధ్యాపకులు మహాత్మ జ్యోతిబాపూలే, సావిత్రిబాయి పూలే, అంబేద్కర్, భగత్ సింగ్, స్వామి వివేకానంద, పెరియర్ రామస్వామి లాంటి ఉద్యమకారుల ఫోటోలను ప్రదర్శిస్తూ వినూత్నంగా నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. కేయూ పార్ట్ టైం అధ్యాపకుల సంఘం అధ్యక్షులు డాక్టర్ వై. రాంబాబు మాట్లాడుతూ 15 నుండి 20 సంవత్సరాలుగా విశ్వవిద్యాలయాలలో తక్కువ వేతనాలకు పని చేస్తూ శ్రమదోపిడికి గురవుతున్న పార్ట్ టైం అధ్యాపకులకి మినిమం టైం స్కేల్ తో ఉద్యోగ భద్రత కల్పించి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినారు.
Also read: Ponguleti Srinivas Reddy: ప్రభుత్వ ఆలోచనల అనుగుణంగా పనిచేయాలి.. మంత్రి పొంగులేటి
ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన జీవో నెంబర్ 21 ని వెనుకకు తీసుకొని అధ్యాపక నియామకాలలో పార్ట్ టైం అధ్యాపకుల సర్వీసెస్ ని పరిగణలోకి తీసుకొని నియామకాలలో ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రధాన కార్యదర్శి డాక్టర్ నరేంద్రనాయక్ మాట్లాడుతూ పార్ట్ టైమ్ అధ్యాపకుల న్యాయమైన డిమాండ్ల సాధనకి రాష్ట్రవ్యాప్తంగా పార్ట్ టైం అధ్యాపకులు ఉద్యమిస్తున్నారని తెలియజేసినారు.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా పార్ట్ టైమ్ అధ్యాపకుల సమస్యలను పరిష్కరిస్తామని తమ మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు కాబట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పార్ట్ టైం అధ్యాపకుల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని అభిప్రాయపడినారు.