Medak District News: చిన్న పిల్లలతో అంత ఈజీ కాదని అందరికీ తెలిసిందే. ఒకసారి మెుండిపట్టు పట్టారంటే అసలు విడిచిపెట్టరు. అదే కావాలని భీష్మించుకొని కూర్చుంటారు. ముఖ్యంగా బొమ్మల విషయంలో పిల్లలు చాలా కచ్చితంగా ఉంటారు. ఇష్టమైన టాయ్ ను దక్కించుకునేందుకు ఎంతగానో మారం చేస్తారు. తల్లిదండ్రుల చేత దానిని కొనించుకునే వరకూ అసలు వెనక్కి తగ్గరు. మరి అంత ఇష్టంగా కొనుకున్న బొమ్మ పనిచేయకుంటే పోతే ఆ చిన్నారి పడే బాధ అంతా ఇంతా కాదు. అయితే ఓ చిన్నారి కేవలం బాధపడి ఊరుకోలేదు. తనకు జరిగిన అన్యాయంపై ఏకంగా పోలీసు స్టేషన్ మెట్లు ఎక్కాడు. ఆ కథ ఏంటో ఇప్పుడు చూద్దాం.
అవాక్కైన పోలీసులు
తెలంగాణలోని మెదక్ జిల్లాకు చెందిన వినయ్ రెడ్డి అనే బాలుడు… ఎంతో ఇష్టంగా హెలికాఫ్టర్ బొమ్మను కొనుగోలు చేశాడు. అయితే కొన్న కొద్దిసేపటికే అదే పనిచేయకుండా మెురాయించింది. దీంతో చిర్రెత్తుకొచ్చిన ఆ బుడ్డొడు.. నేరుగా పోలీసు స్టేషన్ కు వెళ్లాడు. కంగ్టి స్టేషన్ కు వెళ్లిన ఆ చిన్నారి.. పనికి రాని బొమ్మను విక్రయించిన షాపు యజమానిపై ఫిర్యాదు చేశాడు. ఒక చిన్న హెలికాఫ్టర్ బొమ్మ కోసం.. చిన్నారి పోలీసు స్టేషన్ కు రావడం చూసి అక్కడి పోలీసులు అవాక్కయ్యారు.
రూ.300 పెట్టి కొన్నాడట!
బొమ్మ గురించి చిన్నారి ఫిర్యాదు చేయడంపై ఆశ్చర్యపోయిన పోలీసులు.. అతడితో కొద్దిసేపు సరదాగా ముచ్చటించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలను అక్కడే ఉన్న మరో వ్యక్తి సెల్ ఫోన్ లో బంధించారు. అయితే ఆ బొమ్మను రూ.300 లకు కొనుగోలు చేసినట్లు బాలుడు పోలీసులకు తెలియజేశాడు. రిటర్న్ ఇచ్చేందుకు ప్రయత్నించగా షాపు యజమాని తీసుకోలేదని ఆరోపించాడు. ఇంకోసారి షాప్ వద్దకు రావద్దని తనను మందలించినట్లు బాలుడు చెప్పాడు. అందుకే కేసు పెట్టాలన్న ఉద్దేశ్యంతో పోలీసు స్టేషన్ కు వచ్చినట్లు చెప్పాడు.
Also Read: Raj Kasireddy Arrests: లిక్కర్ స్కామ్ కేసులో బిగ్ ట్విస్ట్.. ఎయిర్ పోర్టులో రాజ్ కసిరెడ్డి అరెస్ట్!
నెటిజన్ల ఫన్నీ రియాక్షన్
చిన్నారి పోలీసు కంప్లైంట్ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తున్నారు. పోలీసు వాళ్లు ఇంతకీ కొత్తది ఇప్పిస్తారో? లేదో? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. చిన్నారి ధైర్యానికి సెల్యూట్ అంటూ మరికొందరు ప్రశంసిస్తున్నారు. తనకు జరిగిన అన్యాయాన్ని బాలుడు ధైర్యంగా బహిర్గతం చేయడం మంచి లక్షణమని అభినందిస్తున్నారు. అటు నిత్యం ఒత్తిడిలో ఉండే పోలీసులకు బాలుడు వినయ్ రెడ్డి ద్వారా కాసేపు రిలీఫ్ లభించిందని అంటున్నారు.