AP Mega DSC 2025: ఏపీలో ఎప్పుడు ఎప్పుడు అంటూ మెగా డీఎస్సీ కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పేసింది. ఏప్రిల్ 20న ఉదయం 10 గంటలకు మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ను విడుదల చేస్తున్నట్లు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. అయితే ప్రభుత్వ అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా డీఎస్సీకి సంబంధించిన పూర్తి వివరాలను ప్రభుత్వం ప్రకటించడంతో అభ్యర్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
దరఖాస్తు వివరాలు..
ఏపీలో 16,347 ఉపాధ్యాయ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ఏపీ ప్రభుత్వం మెగా డీఎస్సీ నిర్వహించాలని నిర్ణయించింది. అయితే ఏప్రిల్ 20వ తేదీ నుండి మే 15వ తేదీ వరకు అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను సమర్పించవచ్చు. జూన్ 6వ తేదీ నుండి జూలై ఆరవ తేదీ వరకు సిబిటి విధానంలో ఈ పరీక్షలను నిర్వహిస్తారు. మెగా డీఎస్సీ 2025 కు సంబంధించిన పూర్తి సమాచారం సంబంధిత జీవోలు ఉపాధ్యాయ పోస్టులు వివరాలు పరీక్ష షెడ్యూలు సిలబస్ నోటిఫికేషన్ హెల్ప్ డెస్క్ వివరాలను 20వ తేదీ ఉదయం 10 గంటల నుండి పాఠశాల వెబ్సైట్ http://cse.ap.gov.in, http://apdsc.apcfss.in లలో అందుబాటులో ఉంచారు.
మెగా డీఎస్సీ 2025 పరీక్ష షెడ్యూల్..
20వ తేదీన నోటిఫికేషన్ జారీ, 20 నుండి 15వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా ఫీజులు చెల్లింపు, 20వ తేదీ నుండి 30వ తేదీ వరకు మాక్ టెక్స్ట్, అలాగే హాల్ టికెట్లు డౌన్లోడ్, పరీక్ష తేదీలు జూన్ 6 నుండి జులై 6 వరకు, ప్రాథమిక కీ అన్ని పరీక్షలు పూర్తయిన తర్వాత రెండో రోజున విడుదల చేస్తారు. అభ్యంతరాలను ప్రాథమిక కీ విడుదల చేసిన ఏడు రోజులు పాటు అభ్యంతరాలను స్వీకరిస్తారు. మెరిట్ జాబితాను తుది కీ విడుదల చేసిన 7 రోజుల తర్వాత జాబితా ప్రకటిస్తారు.
Also Read: Alekhya Chitti Pickles: అలేఖ్య చిట్టి మొదలెట్టిందిరా మళ్లీ.. పాటతో రెచ్చిపోయిందిగా.. వీడియో వైరల్
ఇక జిల్లాల వారీగా ఖాళీల వివరాలు..
శ్రీకాకుళం 458, విజయనగరం 446, విశాఖపట్నం 734, ఈస్ట్ గోదావరి 1241, వెస్ట్ గోదావరి 1035, కృష్ణ 1208, గుంటూరు 1143, ప్రకాశం 629, చిత్తూరు 1473, నెల్లూరు 668, కర్నూలు 2,645, వైయస్సార్ కడప 705, అనంతపురం 807, అలాగే ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలలో సైతం 881 పోస్టులు భర్తీ చేయనుండగా, జువైనల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ స్కూల్లలో 15 పోస్టులు భర్తీ చేయనున్నారు.
నారా లోకేష్ ట్వీట్..
ఏపీ మెగా డీఎస్సీకి సంబంధించి మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేశారు. ఏనాటి నుండో అభ్యర్థులు నోటిఫికేషన్ కోసం ఎదురుచూపుల్లో ఉన్నారని, అటువంటి వారి కోసమే కూటమి ప్రభుత్వం మాటకు కట్టుబడి నోటిఫికేషన్ విడుదల చేసిందన్నారు. అభ్యర్థులకు ఆల్ ది బెస్ట్ చెప్పిన లోకేష్, మీ ఓర్పుకు సలామ్ అంటూ ట్వీట్ చేశారు.