Women Constable Suicide: తెలంగాణలో లేడీ కానిస్టేబుళ్ల వరుస ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. తాజాగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఓ లేడీ కానిస్టేబుల్ సూసైడ్ చేసుకుంది. అర్చన అనే కానిస్టేబుల్ చీరతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన కాజీపేట్ దర్గా ప్రాంతంలో జరిగింది. 2022 లో వివాహం చేసుకున్న అర్చన భర్తతో మనస్పర్థల కారణంగా కొద్దిరోజులకే విడాకులు తీసుకుంది. అప్పటినుంచి మానసికంగా కుంగిపోయి వేదనకు గురవుతూ వచ్చిన అర్చన.. తాజాగా సూసైడ్ చేసుకుంది.
ఇదిలా ఉంటే కొద్దిరోజుల క్రితం పెళ్లి కావడం లేదని నీలిమ అనే మరో మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకుంది. ఈ రెండు సూసైడ్ ఘటనలు పోలీస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. సమాజంలో పోలీసులు అంటే భయంతో పాటు మర్యాద కూడా అదే స్థాయిలో ఉంటుంది. మనో ధైర్యాన్ని ఇచ్చే పోలీసులే ఇలా బలవన్మరణాలకు పాల్పడుతుండటం కలవరానికి గురిచేస్తుంది.
Also read: Suryapet Student Died: బీటెక్ హాస్టల్ లో షాకింగ్ ఘటన.. రక్తపు మడుగులో విద్యార్థిని.. ఏం జరిగింది?
ఒకవైపు దేశంలోనే తెలంగాణ పోలీస్ నెంబర్1 గా నిలిచినా.. ఇలాంటి సంఘటనలు రాష్ట్ర పోలీస్ శాఖను ఇబ్బంది పెట్టే అవకాశముంది. ఎంతో కష్టపడి, నిద్రహారాలు మాని సమాజానికి రక్షణ కల్పించే పోలీసులు ఇలా ఆత్మరక్షణలో పడి అనాలోచిత నిర్ణయాలు తీసుకోవడం సమంజసం కాదని నిపుణులు సూచిస్తున్నారు. సమాజానికి ధైర్యం ఇవ్వాల్సిన పోలీసులే ఇలా అధైర్యంతో ప్రాణాలు తీసుకుంటే ప్రజల పరిస్థితి ఏంటని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మున్ముందు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీను శాఖ అవగాహన సదస్సులను ఏర్పాటు చేసి మనో ధైర్యాన్ని ఇచ్చే కార్యక్రమాలు చేపట్టాలని పలువురు సూచిస్తున్నారు