Lotus Will Bloom BJP Party Every Where In Telangana
Politics

BJP: తెలంగాణ బీజేపీలో తెగని తండ్లాట

– పాత, కొత్త నేతల మధ్య సమన్వయ లోపం
– తోటి పార్టీ అభ్యర్థుల ఓటమికి వ్యూహాలు
– వలస నేతలకు టికెట్లపై ఆశావహుల అలక
– కార్పొరేట్ కల్చర్‌తో పార్టీకి కష్టాలేనంటున్న నేతలు
– సిట్టింగ్ సీట్లు దక్కితే గొప్ప అంటున్న పాత నేతలు

హైదరాబాద్, స్వేచ్ఛ: లోక్‌సభ ఎన్నికల వేళ తెలంగాణ ఎంపీ అభ్యర్థులు, నేతల వైఖరితో బీజేపీ హైకమాండ్ తలలు పట్టుకుంటోంది. నేతల మధ్య జరగుతున్న పోరుతో కొత్త సీట్ల సంగతి అలా పెడితే, ఉన్న సీట్లు కూడా గెలుచుకోవటం కష్టమేనని ఆ పార్టీ నేతలు భయపడుతున్నారు. అగ్రనాయకులంతా వర్గాలుగా విడిపోయి, ఈ లోక్‌సభ ఎన్నికల్లో తమ ప్రత్యర్థులను ఓడించే పనిలో పడటంతో ఎన్నడూ లేని ఈ మితిమీరిన వర్గపోరు ఎటు దారి తీస్తుందో అని పార్టీ అధిష్ఠానం బెంబేలెత్తుతోంది. అమిత్ షా హెచ్చరికలనూ లెక్కచేయకుండా కొందరు నేతలు రచిస్తున్న వ్యూహాలు.. మొదటికే మోసం తేనున్నాయనే వార్తలూ వినిపిస్తున్నాయి.

తెలంగాణ బీజేపీ నాయకులంతా ఇప్పుడు కొత్త, పాత నాయకులనే రెండు తరగతులుగా విడిపోయారు. పాత నాయకులంటే అనాదిగా పార్టీనే నమ్ముకుని ఉన్నవారు. వీరికి సంఘ నేపథ్యంతో బాటు జాతీయవాద భావజాలం, సామాజిక సమరసతా లక్ష్యాల వంటివాటితో బాటు గెలుపోటములతో సంబంధం లేకుండా పార్టీకి సేవలందించిన చరిత్ర ఉంది. ఇక.. కొత్త నాయకులు అంటే, వేరే పార్టీల నుంచి వలస వచ్చిన నేతలు. వీరిలో ఎక్కువ మంది కాంగ్రెస్, బీఆర్ఎస్, టీడీపీ వంటి పార్టీల నుంచి వచ్చినవారే. బీజేపీలో చేరిన ఈ నేతలకు అధిష్ఠానం అధిక ప్రాధాన్యం ఇవ్వటం పాతతరం నేతలకు కంటగింపుగా మారుతోంది. ఉదాహరణకు ఇటీవలి ఎన్నికల్లో నాగర్ కర్నూలు, జహీరాబాద్, వరంగల్, నల్గొండ, వరంగల్ వంటి సీట్లలో ప్రకటించిన అభ్యర్థులంతా వలస వచ్చినవారే. వీరిలో కొందరు పార్టీ మారిన మూడు రోజుల్లో టికెట్ కూడా సంపాదించగలిగారు. ఇది నచ్చని పాత నేతలు, కార్యకర్తలు వీరికి ఎన్నికల వేళ సహాయ నిరాకరణ చేస్తున్నారు. ఇక, డీకే అరుణ, ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి వంటి వారూ పాతతరం నేతల దృష్టిలో నేటికీ వలస పక్షులే. ప్రచారం జోరుగా చేయాల్సిన ఈ కీలక సమయంలో పాత నేతలెవరూ వీరికి మద్దతుగా నిలవటం లేదు.

Also Read: BJPఓవర్ కాన్ఫిడెన్స్..!?

బీసీ నేతగా బలమైన మార్పు తీసుకొచ్చాడనే పేరున్న బండి సంజయ్‌ను తప్పించటంలోనూ ఇలాంటి రాజకీయమే గతంలో పనిచేసింది. అప్పట్లో ఆయన అవలంబించిన దూకుడును, ఒంటెత్తుపోకడగా అభివర్ణిస్తూ బీసీ నేతలే ఆయనకు అండగా నిలవలేదు. ఈ విషయంలో బీసీ వర్సెస్ నాన్ బీసీ అనే ప్రాతిపదికన తెలంగాణ బీజేపీ విడిపోయింది. కిషన్ రెడ్డి నాయకత్వంలో ఈ రాజకీయం సాగినట్లు అప్పట్లో వార్తలూ వచ్చాయి. దీనికి తోడు బండి సంజయ్, ప్రొ. లక్ష్మన్, ధర్మపురి అరవింద్ వంటి వారంతా మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన వారే కావటంతో పెత్తనమంతా ఒకే బీసీ వర్గం చేస్తుందనే భావనా తెలంగాణ బీజేపీ నేతల్లో ఉంది. తర్వాత పార్టీలో చేరిన ఈటల రాజేందర్ వంటి ఇతర కులాల నేతలకు తగినంత గుర్తింపు రాకుండా మున్నూరు కాపు నేతలు ప్రయత్నించారనే ఆరోపణ కూడా ఉంది. దీంతో బీజేపీ సానుభూతి పరులైన ఇతర బీసీ కులాలు పార్టీకి దూరమయ్యే పరిస్థితి నెలకొంటోంది.

తాజా లోక్‌సభ ఎన్నికల వేళ.. ఒకే సామాజిక వర్గానికి చెందని నేతలు తోటి నేతల ఓటమికి అంతర్గతంగా పనిచేస్తున్నారనే మాటా ప్రస్తుతం వినిపిస్తోంది. కేంద్రంలో కేంద్ర పదవి దక్కే అవకాశం వస్తే.. తమ వర్గానికి చెందిన నేతలు పోటీవస్తారనే భయంతోనే వీరు తోటి అభ్యర్థుల ఓటమికి కుట్రలు చేస్తున్నారని, కొందరు నేతలు ఇంకొక అడుగు ముందుకు వేసి ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులకు సాయం అందిస్తున్నారనే వార్తలూ వినిపిస్తున్నాయి. మరోవైపు డబ్బు, పరపతి, వ్యాపారాలున్న నేతలకు పార్టీలో ఎక్కువ విలువ దక్కుతోందని, అనేక విషయాల్లో వారి మాటే చెల్లుబాటవుతోందని పాత తరం నేతలు లోలోపల వాపోతున్నారు. ఇలాంటి వలస నేతలు పార్టీ కష్టకాలంలో అలవోకగా తమ సొంత పార్టీలకు తిరిగెళ్లి పోతారని, కనుక ఇలాంటి కార్పొరేట్ ధోరణులు పార్టీకి చేటు చేస్తున్నాయనేది వారి వాదన.

Also Read: Phone Tapping : డేంజర్‌లో ప్రభాకర్ రావు.. ప్రాణానికి ముప్పు ఉందా..?

తెలంగాణలో మొత్తం 17 లోక్‌సభ సీట్లుండగా వాటిలో సగానికి పైగా వలస నేతలే టికెట్లు దక్కించుకోవటం, వారితో బాటే వారి అనుచరులూ పార్టీలో చేరి పెత్తనం చెలాయించటం కూడా ఎన్నికల వేళ కొత్త సమస్యలు తెచ్చిపెడుతోంది. దీనివల్ల పాత, కొత్త నేతల మధ్య సమన్వయం లోపించి, ఎవరికి వారుగా వ్యవహరిస్తున్నారు. దీనివల్ల ముందునుంచీ సాగుతోన్న ఎన్నికల ప్రచార కార్యక్రమాలన్నీ మూలనపడ్డాయి. ఈ విషయాలను పార్టీ ఇన్‌ఛార్జ్‌లు ఢిల్లీలోని పెద్దలకు చెప్పినా పరిస్థితిలో ఏ మార్పూలేదని, నిన్నటి దాకా అధికార పార్టీపై ఉన్న వ్యతిరేకతను ఓటు బ్యాంకుగా మార్చుకోవటానికి ప్రయత్నించిన తమ పార్టీ, కీలకమైన లోక్‌సభ ఎన్నికల వేళ నష్ట నివారణ చర్యలకు దిగాల్సి రావటం దురదృష్టమని ఆ పార్టీ అభిమానులు ఆక్రోశిస్తున్నారు.

Just In

01

CCI Cotton Procurement: పత్తి కొనుగోళ్లలో అవకతవకలు జరగొద్దు.. పినపాక ఎమ్మెల్యే

Kavitha Janam Bata: కేసీఆర్‌కు ఆ అవసరం లేదు.. నిజామాబాద్ ప్రెస్‌మీట్‌లో కవిత ఆసక్తికర వ్యాఖ్యలు

Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో ట్విస్ట్.. చనిపోయిన వ్యక్తిపై కేసు.. ఏం జరగబోతోంది?

Drinking Culture: మందు బాబులు మద్యం సేవించిన తర్వాత ఎందుకు ఎక్కువగా తింటారో తెలుసా?

Bigg Boss Telugu 9: సంజన నోటికి లాక్.. క్లౌడ్ గేమ్ షురూ.. మేఘం వర్షిస్తేనే సేఫ్, లేదంటే?