– నగరానికి రాకుండా అడ్డుకుంటున్న సుప్రీం వర్గం
– ప్రభాకర్ వస్తేనే బెయిల్ వస్తుందన్న ఆశలో నిందితులు
– రెండు వర్గాలుగా విడిపోయిన పెత్తనం చేసిన రావులు
– దుబాయ్‌కి వచ్చి ఎక్కడికి వెళ్లారనే దానిపై లేని స్పష్టత
– క్యాన్సర్ సాకు చూపి ముందస్తు బెయిల్‌కి ప్రిపరేషన్
– విచారణ చేస్తే అందరికీ ముప్పేననుకుంటున్న సుప్రీం వర్గం
– రాకుంటే కేసు మరింత జఠిలం అవుతుందంటున్న ఆఫీసర్స్
– ప్రభాకర్ రావు ప్రాణానికే ముప్పు ఉందని అనుమనాలు
– పైరవీల్లో బిజీగా మాజీ మంత్రులు, పేపర్, ఛానల్ ఓనర్స్
– ఫోన్ ట్యాంపిగ్ కేసులో కొత్త చర్చ
దేవేందర్ రెడ్డి, 9848070809
Prabhakar Rao in Danger : ‘స్వేచ్ఛ’ ఇన్వెస్టిగేషన్ టీం: రాజమౌళి సినిమాల్లోని ఎలివేషన్స్. ఆర్జీవీ మాదిరి టేకింగ్. బోయపాటి ఊర మాస్ క్యారెక్టర్స్. ఫోన్ ట్యాపింగ్ కేసులో ట్విస్టులు చూస్తుంటే గనక, సినిమా తీస్తే రికార్డుల మోత మోగడం ఖాయమనే టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు చుట్టూ కథంతా నడుస్తున్నా, ఆయన అమెరికా, దుబాయ్ అంటూ చక్కర్లు కొడుతున్నారు. హైదరాబాద్ వస్తారా? వస్తే ఏం జరుగుతుంది? ఇలా అనేక డౌట్స్ నడుమ తాజాగా ఆసక్తికర చర్చ ఒకటి జరుగుతోంది.
రెండు వర్గాలుగా విడిపోయిన రావులు
అన్నిటికీ సెంట్రల్ పాయింట్‌గా మారిన ప్రభాకర్ రావు నగరానికి వచ్చేది లేనిదీ తెలియడం లేదు. కానీ, ఆయనపై అనేక ఒత్తిళ్లు ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. విచారణకు హాజరుకావాలా వద్దా? అంటూ ఆనాడు అధికారంలో పెత్తనం చెలాయించిన వారు రెండు వర్గాలుగా విడిపోయారు. ఇటీవల ఓ వర్గం దుబాయ్‌కి వెళ్లి సంప్రదింపులు జరిపినట్లు చర్చ జరుగుతోంది. అప్పటి ప్రభుత్వ సుప్రీం చెప్పినట్లు దేశానికి రావాల్సిన అవసరం లేదని తెల్చి చెప్పారట. ఎంత ఖర్చైనా తామే బరిస్తామని చెప్పారట. దీంతో దుబాయ్ నుంచి ప్రభాకర్ రావు ఎక్కడికి వెళ్లారనే సస్పెన్స్ కొనసాగుతోంది. మరోవైపు అరెస్ట్ అయిన ఆఫీసర్స్ ప్రభాకర్ రావు వస్తేనే తమపై ఒత్తిడి తగ్గుతుందని కుటుంబసభ్యులకు సమాచారం చేరవేస్తున్నారు. బెయిల్ రావాలంటే ప్రభాకర్ రావు పోలీసులకు సహకరించాలని కోరుతున్నారు. ఆయనను విచారించకుంటే తమకు ఇప్పట్లో బెయిల్ రాదని, ఎలాగైనా వచ్చేలా చేయాలని తెలిసిన పెద్దలతో పైరవీలు జరుపుతున్నారు. ఆయన వస్తేనే బెటర్ అనే ఫీలింగ్‌ను ప్రభాకర్ రావు ఫ్యామిలీకి కల్పిస్తున్నారు. డ్యూటీలో భాగంగా చేసినందన తొందరగానే బెయిల్ వస్తుందని మచ్చిక చేసుకుంటున్నారు.
క్యాన్సర్ సాకుతో ముందస్తు బెయిల్ పిటిషన్?
ప్రభాకర్ రావు 15 ఏండ్లుగా క్యాన్సర్‌తో సఫర్ అవుతున్నారు. నేరం చేయకముందే రోగం ఉందని తెలుసు. అంతా తెలిసే చేశారు. కానీ, ఇప్పుడు బెయిల్ పిటిషన్ కోసం తన ఆరోగ్యం సహకరించడం లేదని, ముందస్తు బెయిల్ ఇస్తే పోలీసులకు సహకరించేందుకు ప్రిపరేషన్స్ చేసుకుంటున్నట్టు సమాచారం. సుప్రీం అనుచరులు రావొద్దని చెప్పడంతో ఎలా ముందుకు వెళ్లాలో కొద్ది రోజులు వేచి చూడాలని ప్రభాకర్ రావు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
మాజీ మంత్రుల పైరవీలు
హైదరాబాద్ సీపీ కేసు విచారణలో సాక్ష్యాధారాలతో ముందుకు వెళ్తున్నారు. మాజీ మంత్రులైన దయాకర్ రావు, హారీష్ రావు, శ్రీనివాస్ గౌడ్‌ల పేర్లు ట్యాపింగ్ కేసులో వినిపిస్తున్నాయి. మరో ఎమ్మెల్సీతో పాటు గుమాస్తా తెలంగాణ పేపర్ ఓనర్, ఇప్పటికే విదేశాలకు వెళ్లిన ఐ న్యూస్ ఓనర్ శ్రావణ్ రావులు వారి వారికి అనుకూలంగా పైరవీలు మొదలు పెట్టారు. సెంట్రల్‌లో బీజేపీని కూడా వదలకుండా సంప్రదింపులు జరుపుతున్నారు. కొందరు కాంగ్రెస్ పెద్దలతో టచ్‌లో ఉన్నారు. ఏప్పుడంటే అప్పుడు కాంగ్రెస్ చీఫ్ ఖర్గేతో టచ్‌లో ఉండే ఓ మాజీ మంత్రి తనను రక్షించాలని వేడుకున్నట్టు సమాచారం. బీజేపీ అధిష్టానంతో టచ్‌లోకి వెళ్లిన తెలంగాణ పేపర్, ఐ న్యూస్ ఛానల్ ఓనర్స్ మీరే కాపాడాలని అందుకు ఏ పని చెప్పినా చేస్తామని చెప్పి హామీ తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇలా పైరవీలతో ఎవరికి వారు కేసు నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తోంది.
ప్రభాకర్ రావు ప్రాణాలకు హాని ఉందా?
కులం కోసం మెడ కోసుకున్న ప్రభాకర్ రావు ప్రాణాలకు హాని ఉందని అత్యంత సన్నిహితులు భయపడుతున్నారు. మాజీ సీఎం కేసీఆర్ ఈమధ్య మీడియా ముందుకు వచ్చి ఫోన్ ట్యాపింగ్‌పై మాట్లాడుతామని అన్నారు. అంతకు ముందు అన్నీ ప్రభాకర్ రావుకే తెలుసు అంటూ అరెస్ట్ అయినవాళ్లు స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఇదే క్రమంలో పొలిటికల్ లింకులు బయటపడుతుండడంతో, అసలు సూత్రధారులు బయటపడకుండా ప్రభాకర్ రావుపై కుట్ర జరిగే ఛాన్స్ ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జాగ్రత్తగా పోలీసుల ముందు ఆయన్ను హాజరుపర్చాలని అభిమాన అధికారులు కోరుకుంటున్నారు. కొంతమంది న్యాయవాదులు ప్రభాకర్ రావుని సేఫ్‌గా హైదరాబాద్ తీసుకొచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టులో కేసు వేసేందుకు సిద్ధమయ్యారు.