Qutbullapur Crime: కన్నతల్లి కసాయి తల్లిలా మారింది. అలా ఎందుకు చేసిందో కానీ, ఈ ఘటన ప్రస్తుతం సంచలనంగా మారింది. నవ మాసాలు మోసిన తల్లి ఇంతటి దారుణానికి ఎందుకు పాల్పడిందోనన్న కారణాలను స్థానికులు అన్వేషిస్తున్నారు. అంతేకాదు తన పిల్లల ప్రాణాలు తీయడంతో పాటు, తన ప్రాణం కూడా తీసుకుంది ఆ తల్లి. కారణం ఏమో కానీ ఈ ఘటన ప్రస్తుతం మేడ్చల్ జిల్లా పరిధిలో సంచలనంగా మారింది.
మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్, జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని గాజుల రామారంలో గురువారం దారుణ ఘటన జరిగింది. ఈ విషయం తెలిసిన స్థానికులు హుటాహుటిన ఘటనా స్థలాన్ని చేరుకుని కన్నీటి పర్యంతమయ్యారు. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో గల తేజస్విని రెడ్డి అనే మహిళ తన ఇద్దరు పిల్లలైన అర్షిత్ రెడ్డి, ఆశిష్ రెడ్డిలతో కలిసి నివసిస్తోంది. ఇద్దరి ఆలనా పాలనా చూసుకున్న తల్లి, ఒకరికి ఏడు సంవత్సరాలు, మరొకరికి ఐదు సంవత్సరాలు వయసు వచ్చేంతవరకు పెంచి పోషించింది. ఏం జరిగిందో కానీ ఒక్కసారిగా గురువారం ఇద్దరు కొడుకులను వేట కొడవలితో అమానుషంగా చంపేసింది. అంతేకాదు ఇద్దరు పిల్లలను చంపడమే కాక తాను సైతం భవనం పై నుండి దూకి తేజస్విని రెడ్డి కూడా ఆత్మహత్య చేసుకుంది.
Also Read: Nalgonda Murder Case: డిటెక్టివ్ స్టైల్ హత్య.. మామ-కూతురి ప్లాన్‌కు పోలీసులు చెక్!
ఈ ఘటన జరిగిన వెంటనే స్థానికులు హుటాహుటిన స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆశ్చర్యపోయిన పరిస్థితి. అభం శుభం తెలియని పిల్లలను ఆ తల్లి ఎందుకు చంపిందోనన్న కారణాలను పోలీసులు అన్వేషిస్తున్నారు. ఇద్దరు చిన్నారులు రక్తపు మడుగులో పడి ఉండడం, అలాగే భవనం పై నుండి సదరు మహిళ జోకి చనిపోవడంతో అసలేం జరిగిందనే కోణంలో పోలీసులు వివరాలు ఆరాతీస్తున్నారు. మొత్తం మీద ఈ ఘటన ప్రస్తుతం మేడ్చల్ జిల్లా పరిధిలో సంచలనంగా మారింది. తల్లి తన బిడ్డలను చంపడానికి గల కారణాలు, అలాగే తాను చనిపోయేందుకు గల కారణాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడి కావాల్సి ఉంది.