Cricket Stadium Amaravati: ఆంధ్రప్రదేశ్ లోని అమరావతి (Amaravati) వేదికగా అద్బుతమైన రాజధాని రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అమరావతిని పరిశ్రమలతో పాటు క్రీడలకు కేంద్రంగా చేయాలని చంద్రబాబు నేతృత్వంలోనే కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా కొత్త రాజధానిలో స్పోర్ట్స్ సిటీ (Sports City)ని సైతం నిర్మించాలని సంకల్పించింది. ప్రస్తుతం అంతర్జాతీయంగా క్రికెట్ కు ప్రాధాన్యం పెరిగిన నేపథ్యంలో అమరావతిలో ఓ భారీ క్రికెట్ స్టేడియాన్ని సైతం నిర్మించాలని భావిస్తోంది. అయితే దీనిపై గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా బీసీసీఐ (BCCI) దీనిపై స్పందించింది. అంతేకాదు చంద్రబాబు ప్రభుత్వానికి ఓ గుడ్ న్యూస్ సైతం చెప్పింది.
బీసీసీఐ గ్రీన్ సిగ్నల్
అమరావతిలో క్రికెట్ స్టేడియం నిర్మాణానికి అవసరమైన పూర్తి సహకారం అందించేందుకు బీసీసీఐ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు క్రీడా వర్గాలు పేర్కొన్నాయి. ఇప్పటివరకూ గుజరాత్ లోని నరేంద్ర మోదీ స్టేడియమే దేశంలో అతిపెద్ద క్రికెట్ గ్రౌండ్ గా ఉంది. అయితే దానిని తలదన్నేలా ఒక లక్షా 32 వేల సీట్ల సామర్థ్యంతో మరింత పెద్దదైన క్రికెట్ స్టేడియాన్ని నిర్మించేందుకు అంగీకారం తెలిపినట్లు సమాచారం. అంతేకాదు స్టేడియం నిర్మాణానికి అవసరమైన నిధుల్లో 60% చెల్లించేందుకు బీసీసీఐ ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. అదే విధంగా ఏడాదిలో కనీసం 10 అంతర్జాతీయ మ్యాచ్ లు ఈ స్టేడియంలో జరిగేలా హామీ సైతం ఇచ్చినట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. అదే నిజమైతే ఏపీ కొత్త రాజధాని అమరావతి.. క్రికెట్ కు కేంద్రంగా మారే ఛాన్స్ ఉందని క్రీడా వర్గాలు అంచనా వేస్తున్నాయి.
స్పోర్ట్స్ సిటీలోనే నిర్మాణం
అమరావతిలో నిర్మించే ఈ స్పోర్ట్స్ సిటీలోనే అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో క్రికెట్ స్టేడియం నిర్మించనున్నారు. రాష్ట్రంలో రెండు క్రికెట్ అకాడమీలను ఏర్పాటు చేయనున్నట్లు టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని (Kesineni Chinni) ఇటీవల ప్రకటించారు. ఇప్పటికే విశాఖ కేంద్రంగా ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (Andhra Cricket Association) పనిచేస్తోంది. ఈ నేపథ్యంలో విజయనగరం జిల్లా మూలపాడులో రెండో క్రికెట్ అకాడమీని పెట్టనున్నట్లు ఆయన వివరించారు. అటు విశాఖ పట్నంలోని ఏసీఏ-వీడీసీఏ (ACA – VDCA) స్టేడియాన్ని సైతం అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు.
Also Read: Hyderabad Rain Alert: హైదరాబాద్ లో జోరు వర్షం.. మరికొద్ది గంటల్లోనే..
అమరావతిలోనే ఫైనల్ మ్యాచ్ లు!
ప్రస్తుతం గుజరాత్ లోని అహ్మదాబాద్ స్టేడియం.. దేశంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియంగా ఉంది. ఇందులో ఒకేసారి లక్ష మంది కూర్చొని మ్యాచ్ ను వీక్షించవచ్చు. ప్రధాని మోదీకి అంకింతమిస్తూ ఈ స్టేడియానికి నరేంద్ర మోదీ స్టేడియం (Narendra Modi Stadium) అని పేరు పెట్టారు. అత్యధిక సీట్ల సామర్థ్యాన్ని కలిగి ఉండటంతో ఈ స్టేడియంలోనే అత్యంత కీలకమైన మ్యాచ్ లను బీసీసీఐ నిర్వహిస్తోంది. వరల్డ్ కప్, ఐపీఎల్ ఫైనల్స్ సైతం గతంలో ఈ స్టేడియంలోనే జరిగాయి. అమరావతి స్టేడియం అందుబాటులోకి వస్తే క్రికెట్ అభిమానులకు ఇక పండగే అని చెప్పవచ్చు. పక్క రాష్ట్రాలకు వెళ్లి కీలక మైన పోరు చూసే బదులు సొంత రాష్ట్రంలోనే ఫైనల్స్ మ్యాచ్ ను వీక్షించే అవకాశం ఏర్పడుతుంది.