BRS Cadre in Rangareddy (imagecredit:twitter)
రంగారెడ్డి

BRS Cadre in Rangareddy: గులాబీ వనంలో మౌనరాగం!.. దిక్కుతోచని స్థితిలో క్యాడర్‌!

రంగారెడ్డి బ్యూరో స్వేచ్చ: BRS Cadre in Rangareddy: ఒకప్పుడు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కంచుకోటగా ఉన్న బీఆర్‌ఎస్ పార్టీ సైలెంట్‌ మోడ్‌లోకి వెళ్లిపోయింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారాన్ని చేజిక్కించుకున్నప్పటికీ ఉమ్మడి జిల్లాలో అత్యధిక స్థానాలను గెలుచుకుని సత్తా చాటిన బీఆర్‌ఎస్ పార్టీని నేడు నిస్తేజం ఆవరించింది. పార్లమెంట్‌ ఎన్నికల్లో ఓటమి పాలవ్వడం బీఆర్‌ఎస్ నుంచి గెలిచిన కొంతమంది నేతలు పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరడం వంటివి బీఆర్‌ఎస్ డీలా పడిపోవడానికి ఓ కారణమేనన్న చర్చ జరుగుతోంది. అయితే ప్రతిపక్ష పార్టీగా ప్రజలతో మమేకమై వారికి భరోసా కల్పించే దిశగా పార్టీ నేతలు ముందుకు సాగకపోవడమే ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది.

నిరాశ పరిస్థితుల నుంచి బయటపడేలా అధినాయకత్వం ఎలాంటి కార్యాచరణ తీసుకోకపోవడం, సరైన రీతిలో గళం విప్పకుండా మౌనంగా ఉండడం పట్ల కేడర్‌ లో ఒకింత అసంతృప్తి నెలకొని ఉంది. జిల్లాల అధ్యక్షులు తమ సొంత నియోజకవర్గాలకే పరిమితం కావడం..త్వరలోనే స్థానిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తమ భవిష్యత్‌ ఏంటన్న ఆందోళన ద్వితీయ శ్రేణి నాయకుల్లో కనిపిస్తోంది.

బలహీనపడ్డ బీఆర్‌ఎస్:

గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో బీఆర్‌ఎస్ పార్టీ అత్యధిక స్థానాలను గెలుచుకుంది. కొడంగల్‌, కల్వకుర్తి నియోజకవర్గాలు మినహాయిస్తే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఉన్న 15 అసెంబ్లీ స్థానాలకు గాను బీఆర్‌ఎస్ పార్టీ 10 స్థానాల్లో విజయభేరీ మోగించింది. కాంగ్రెస్ పార్టీ కేవలం ఐదు స్థానాలతోనే సరిపెట్టుకుంది. అయితే ఆతర్వాత రాజకీయ పరిణామాలు బీఆర్‌ఎస్ ను బలహీనపడేలా చేశాయి. లోక్‌సభ ఎన్నికలకు ముందు చేవెళ్ల మాజీ ఎంపి రంజిత్‌ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, ఆయన కోడలు జడ్పీ ఛైర్‌ పర్సన్‌ తీగల అనితా రెడ్డిలు బీఆర్‌ఎస్ ను వీడి కాంగ్రెస్ గూటికి చేరారు.

బీఆర్‌ఎస్ నుంచి గెలుపొందిన చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ, రాజేంద్ర నగర్‌ ఎమ్మెల్యే ప్రకాష్‌ గౌడ్‌లు సైతం అధికార కాంగ్రెస్ లో చేరారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్ పార్టీ అధికారం కోల్పోవడం, కీలక నేతలు సైతం పార్టీని వీడడంతో ఉమ్మడి జిల్లాలో బీఆర్‌ఎస్ పార్టీ మరింతగా బలహీనపడింది. ఆతర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లోనూ బీఆర్‌ఎస్ పార్టీ చేవెళ్ల సిట్టింగ్‌ స్థానాన్ని కోల్పోవడం పార్టీ శ్రేణులను మరింతగా నైరాశ్యానికి గురిచేసింది.

కాడి వదిలేసిన బీఆర్‌ఎస్:

ప్రతిపక్షంగా కీలకపాత్ర పోషించాల్సిన తరుణంలో రాష్ట్రంలోనే కాకుండా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోనూ బీఆర్‌ఎస్ పార్టీ కాడి వదిలేసిందన్న విమర్శలు విన్పిస్తున్నాయి. అధికార పార్టీ కాంగ్రెస్ ను తిట్టడం మినహాయిస్తే ప్రజా సమస్యలపై సరైన రీతిలో పోరాడడం లేదన్న అసంతృప్తి పార్టీ క్యాడర్‌ నుంచీ వ్యక్తమవుతోంది. బీఆర్‌ఎస్ ప్రత్యేకించి ప్రజా సమస్యలపై కార్యాచరణను ప్రకటించకపోవడం వారి పక్షాన భరోసానిచ్చే కార్యక్రమాలు చేపట్టకపోవడం పట్ల పార్టీలోనే చర్చనీయాంశమవుతోంది.

ప్రజలే స్వచ్చందంగా రోడ్లపైకి వచ్చి సమస్యలపై పోరాటం చేస్తుండగా వారికి మద్దతు తెలపడం తప్పితే బీఆర్‌ఎస్ పార్టీయే ప్రత్యేకించి ఎందుకు కార్యక్రమాలను చేపట్టడం లేదన్న అభిప్రాయాన్ని పలు వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. కేటీఆర్‌, హరీష్‌రావు వంటి నేతలు జిల్లాలో పర్యటించిన సందర్భాల్లోనే నేతలు కనిపించి ఆతర్వాత ముఖం చాటేస్తున్నారన్న విమర్శలు సైతం విన్పిస్తున్నాయి. రంగారెడ్డి జిల్లా అధ్యక్షునిగా ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌ రెడ్డి వ్యవహరిస్తున్నారు. వికారాబాద్‌ జిల్లా అధ్యక్షునిగా వికారాబాద్‌ మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌, మేడ్చల్‌ జిల్లా అధ్యక్షునిగా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ శంభీపూర్‌ రాజు కొనసాగుతున్నారు.

Also Read: Shiva Rudra on Aghori: నిజమైన అఘోరాలు ఎంటర్.. లేడీ అఘోరీ ఇక పరార్?

వీరంతా సొంత నియోజకవర్గాలకే పరిమితమవుతున్నారు. మేడ్చల్‌ జిల్లాలో మాజీ మంత్రి మల్లారెడ్డి అంతంత మాత్రంగానే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఒక్క మహేశ్వరం ఎమ్మెల్యే, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాత్రమే నిత్యం నియోజకవర్గంతోపాటు ఉమ్మడి జిల్లాకు సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొంటూ కాస్త యాక్టివ్‌గా కనిపిస్తున్నారు. జిల్లా అధ్యక్షుల నియామకం తప్ప ప్రధాన కార్యదర్శులు, ఉపాధ్యక్షులు, ఇతర కార్యవర్గాన్ని అధిష్టానం నియమించలేదు. వీటితోపాటు అనుబంధ సంఘాల కమిటీలు, మండల కమిటీలను ఏర్పాటు చేయలేదు.

రజతోత్సవం తర్వాతైనా జోష్‌ వచ్చేనా:

త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతుండగా గ్రామ స్థాయిలో అభ్యర్థులను నిలిపి ప్రచారం చేయడంతోపాటు గెలుపుకోసం వ్యూహ రచన చేసే పార్టీ జిల్లా, మండలం, గ్రామ అధ్యక్షులు లేకపోవడం కేడర్‌లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఎన్నికల్లో క్యాడర్‌కు ఎన్నికల ఖర్చులను సర్దుబాటు చేసే నేతలు లేకపోవడంతో ద్వితీయ శ్రేణి నేతలు దిగులు చెందుతున్నారు. ప్రస్తుత ఈ పరిస్థితులే పార్టీ క్యాడర్‌ను సైలెంట్‌ మూడ్‌లోకి వెళ్లేలా చేస్తున్నాయి.

ఈ నేపథ్యంలోనే గులాబీ అధినేత క్యాడర్‌ను గాడీలో పెట్టేందుకు రెడీ అవుతున్నారు. ఇందుకు ఈనెలలో జరిగే పార్టీ రజతోత్సవ సభను వేదికగా చేసుకుంటున్నారు. సభ సక్సెస్ కోసం నెల రోజుల ముందు నుంచే సభకు విస్తృత ప్రచారం కల్పించే రీతిలో సభలు, సమావేశాలు నిర్వహించి క్యాడర్‌లో జోష్‌ నింపే ప్రయత్నం చేస్తున్నారు. రజతోత్సవ సభ తర్వాతైనా పార్టీ శ్రేణుల్లో డోస్ పెరిగేనా! అని పార్టీవర్గాలు చర్చించుకుంటున్నాయి.

Also Read: స్వేచ్ఛ Eపేపర్ కోసం ఈ లింక్ ని క్లిక్ చేయండి https://epaper.swetchadaily.com/

Just In

01

CM Revanth Reddy: నిమజ్జనానికి సింపుల్ గా సీఎం.. ఏమైనా ఇబ్బందులున్నాయా?

Leaves denied: బ్రదర్ పెళ్లికి లీవ్స్ ఇవ్వలేదని ఓ మహిళా ఉద్యోగి తీసుకున్న నిర్ణయం ఇదీ

Students Protest: మా సార్ మాకు కావాలి.. నిరసనకు దిగిన విద్యార్థులు

Dhanush: మరో తెలుగు డైరెక్టర్‌కి ధనుష్ గ్రీన్ సిగ్నల్.. ఆ దర్శకుడెవరో తెలుసా?

Gaddam Prasad Kumar: మహిళల ఆర్థిక అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం.. గడ్డం ప్రసాద్ కీలక వ్యాఖ్యలు