AP Cabinet – CM Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఈనెల 17వ తేదీ నుండి విదేశీ పర్యటన సాగించనున్నారు. ఐదు రోజులపాటు ఈ పర్యటన సాగుతుందని సమాచారం. ఈనెల 20వ తేదీన సీఎం చంద్రబాబు 75వ జన్మదిన వేడుకలను నిర్వహించుకోనున్నారు. వజ్రోత్సవ జన్మదినోత్సవం సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి విదేశాలకు చంద్రబాబు వెళ్లానున్నారు. అయితే ఈ పర్యటనకు సంబంధించి విషయాలను గోప్యంగా ఉంచినట్లు తెలుస్తోంది. వ్యక్తిగత పర్యటన కావడంతో పర్యటనకు సంబంధించిన విషయాలు బయటకు వెల్లడి కాలేదు. కాగా అప్పుడే తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తమ పార్టీ అధినాయకుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపేందుకు భారీ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.
ఏపీ కేబినెట్ సమావేశం నిర్ణయాలు ఇవే..
ఏపీ కేబినెట్ సమావేశాన్ని సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంగళవారం నిర్వహించారు. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరై, ఆ తర్వాత కాస్త అనారోగ్యంగా ఉండడంతో సమావేశం మధ్యలోనే వెళ్లిపోయారు. కాగా క్యాబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను మంత్రివర్గం ఆమోదించింది. ఎస్సీ వర్గీకరణ ముసాయిదా ఆర్డినెన్స్ కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
రూ.617 కోట్లతో అసెంబ్లీ, రూ.786 కోట్లతో హైకోర్టు భవన నిర్మాణాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. నిర్మాణ పనులను ఎల్1 బిడ్డర్ కు అప్పగించాలని నిర్ణయించింది. స్టేట్ సెంటర్ ఫర్ క్లైమేట్ ఇన్ సిటీస్ వ్యవస్థల ఏర్పాటును ఆమోదించింది. పట్టణ ప్రాంతాల్లో వరద నిర్వహణకు ప్రత్యేక వ్యవస్థలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. విశాఖలోని ఐటీహిల్ -3 పైన టీసీఎస్కి 21.66 ఎకరాలు, ఉరుస క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కు 3.5 ఎకరాలు కేటాయిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది.
Also Read: Ganta Srinivasa Rao tweet: ఆంధ్రా టు ఆంధ్రా వయా తెలంగాణ.. టిడిపి ఎమ్మెల్యే సంచలన ట్వీట్
ఉరుస క్లస్టర్ కు కాపులుప్పాడలో 56 ఎకరాల భూమిని కేటాయించడం, బలిమెల, జోలాపుట్ రిజర్వాయర్ల వద్ద చేపట్టాల్సిన హైడల్ ప్రాజెక్టులకు సంబంధించిన నిర్మాణాలపై ఒడిశా పవర్ కన్సార్టియమ్ కు కూడా రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. 30 మెగావాట్ల సామర్థ్యంతో 2 హైడల్ ప్రాజెక్టుల నిర్మాణం కోసం జలవనరుల శాఖ చేసిన ప్రతిపాదనలను కేబినెట్ ఆమోదించగా, వివిధ ప్రాంతాల్లో పవన విద్యుత్, సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు కేబినెట్ నిర్ణయించింది. అసెంబ్లీ, హైకోర్టు భవన నిర్మాణ ప్రతిపాదనలకు ఆమోదం తెలపగా, రూ.617 కోట్లతో అసెంబ్లీ, రూ.786 కోట్లతో హైకోర్టు భవన నిర్మాణం చేపట్టనున్నారు. మొత్తం మీద విదేశీ పర్యటనకు ముందు సీఎం చంద్రబాబు నిర్వహించిన కేబినెట్ సమావేశం కావడంతో మంత్రులు పూర్తి స్థాయిలో హాజరయ్యారు. అలాగే ముందస్తుగా సీఎం చంద్రబాబుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.