Bhu Bharati Act: భూ భారతి చట్టం 2025 ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు ఉచితంగా లీగల్ సౌకర్యం కల్పించారు. మహిళలు, వికలాంగులకు సైతం ఈ వెసులుబాటు ఉన్నది. ఈ మేరకు భూ భారతి యాక్ట్ 2025 యాక్ట్ రూల్స్ విడుదల చేశారు. భూ సమస్య పరిష్కారంలో అధికారుల నిర్ణయాలపై అసంతృప్తి నెలకొంటే, ఫస్ట్, సెకండ్ అప్పీల్స్ చేసుకునే అవకాశం ఉన్నది. ఈ అప్పీల్స్‌ను ఉన్నత స్థాయి అధికారులు నేరుగా పరిశీలించే అవకాశం కూడా ఉన్నది.
ఇక తెలంగాణలోని భూమి రికార్డులు, యాజమాన్య హక్కులు, లావాదేవీల సమస్యలను సులభతరం చేసేందుకు ప్రజల సౌకర్యార్ధం, ఈజీ ప్రాసెస్‌ను అమలు చేసేందుకు క్రమంగా మరిన్ని రూల్స్‌ను కూడా తయారు చేయనున్నారు. అన్ని గ్రామాల్లో వ్యవసాయ, వ్యవసాయేతర, అబాదీ భూములు రికార్డులను రికార్డింగ్ అథారిటీ తయారు చేసి భూ భారతి పోర్టల్లో అందుబాటులో ఉంచుతుంది. భూమి సర్వే, సబ్ డివిజన్ మ్యాప్‌లను లైసెన్స్‌డ్ సర్వేయర్లు తయారు చేయనున్నారు.
Also Read: CM Revanth Reddy: గుడ్ న్యూస్.. ఇకపై సీఎం కనుసన్నల్లో ప్రజావాణి.. కష్టాలు తీరినట్లే!
తప్పులు, వివాదాలకు ప్రత్యేక గడువు ఆధారంగా పరిష్కరించబడతాయి. ఇక, గ్రామ స్థాయిలో భూ రికార్డులను భూ భారతి పోర్టల్ ద్వారా ఎలక్ట్రానిక్‌గా అప్డేట్ చేస్తారు. ఇందుకోసం ఐదు రిజిస్టర్లను మెయింటెయిన్ చేయనున్నారు. గ్రామ స్థాయిలో విలేజ్ అకౌంట్స్ కూడా డిజిటల్‌గా నిర్వహిస్తారు. ఇందులో పహణీ, ప్రభుత్వ భూముల రిజిస్టర్, ట్రాన్స్‌ఫర్ రిజిస్టర్, ఇరిగేషన్ రిజిస్టర్ వంటివి ఉంటాయి. మ్యుటేషన్ జరిగినప్పుడల్లా ఈ రికార్డులను అప్డేట్ చేస్తారు. ప్రతి డిసెంబర్ 31న స్నాప్ షాట్ తీస్తారు. దీనివల్ల రికార్డులు సురక్షితంగా ఉంటాయి. సర్టిఫైడ్ కాపీలు రూ.10కి అందుబాటులో ఉంటాయని మార్గదర్శకాల్లో ప్రభుత్వం పేర్కొన్నది.
అప్పీల్స్ ఎలా అంటే?
భూ రికార్డుల సవరణ, రిజిస్ట్రేషన్, మ్యుటేషన్, భూధార్ కార్డ్, పట్టాదార్ పాస్‌బుక్, నమోదు కాని లావాదేవీలు వంటి విషయాల్లో అధికారుల నిర్ణయాలపై అసంతృప్తి ఉంటే అప్పీల్ చేయవచ్చు. తహసీల్దార్ ఆర్డర్‌పై రికార్డ్ సవరణ విషయంలో ఆర్డీఓకు 30 రోజుల్లో అప్పీల్ చేయవచ్చు. ఆర్డీఓ నిర్ణయంపై జిల్లా కలెక్టర్‌కు, కలెక్టర్ ఆర్డర్‌పై ల్యాండ్ ట్రైబ్యునల్‌కు 30 రోజుల్లో అప్పీల్ చేయవచ్చు.
రిజిస్ట్రేషన్, మ్యుటేషన్, భూధార్, పాస్ బుక్ వంటి విషయాల్లో తహసీల్దార్ నిర్ణయంపై ఆర్డీఓకు 60 రోజులు, నమోదు కాని లావాదేవీలు లేదా ఇతర మ్యుటేషన్‌లపై ఆర్డీఓ నిర్ణయంపై కలెక్టర్‌కి 60 రోజుల్లో చేసే వెసులుబాటు ఉన్నది. ఇక సెకండ్ అప్పీల్‌లో ఆర్డీఓ ఆర్డర్‌పై జిల్లా కలెక్టర్‌కు, కలెక్టర్ నిర్ణయంపై ల్యాండ్ ట్రైబ్యునల్‌కు 30 రోజుల గడువులో అప్పీల్ చేయవచ్చు. అన్ని అప్పీల్స్ భూ భారతి పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో రూ.1,000 ఫీజుతో సమర్పించాలి.
Also Read: Telangana Gig workers: ఇక పై ఆ ఉద్యోగులకు ప్రత్యేక చట్టం.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
ముఖ్యమైన అంశాలు
– వ్యవసాయ, అవ్యవసాయ, అబాదీ భూముల రికార్డులు భూ భారతి పోర్టల్లో అందుబాటులో ఉంటాయి
– సర్వే, మ్యాప్‌లను లైసెన్స్‌డ్ సర్వేయర్లు తయారు చేస్తారు
– రికార్డ్ ఆఫ్ రైట్స్‌లో తప్పులను సవరించడానికి ఒక సంవత్సరం గడువులో ఆన్‌లైన్ దరఖాస్తు చేయవచ్చు. 60 రోజుల్లో పరిష్కారం లభిస్తుంది.
– కొనుగోలు, గిఫ్ట్, తాకట్టు వంటివి పోర్టల్ ద్వారా రిజిస్టర్ చేసుకోవచ్చు. తహసీల్దార్ కొత్త పట్టాదార్ పాస్‌బుక్ జారీ చేస్తారు.
– 2014కి ముందటి నమోదు కాని లావాదేవీలను సన్నకారు రైతులు 90 రోజుల్లో రెగ్యులరైజ్ చేయవచ్చు
– విల్ అండ్ వారసత్వం: మ్యుటేషన్ కోసం 30 రోజుల్లో ఆర్డర్, లేదా ఆటోమేటిక్ మ్యుటేషన్ జరుగుతుంది
– వివాదాలు లేని భూములకు తాత్కాలిక/పర్మినెంట్ భూధార్ కార్డ్, యూనిక్ ఐడీతో ఇవ్వనున్నారు
– భూ భారతి యాక్ట్ 2025 ప్రకారం మ్యుటేషన్ ఎకరానికి రూ.2,500
– రికార్డ్ సవరణ/అప్పీల్: రూ.1,000
– పాస్‌బుక్ రూ.300
– సర్టిఫైడ్ కాపీ రూ.10
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/ లింక్ క్లిక్ చేయగలరు