CM Revanth Reddy: ప్రజావాణి కార్యక్రమం విజయవంతంగా సాగుతోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. వారంలో రెండు రోజులు మహాత్మజ్యోతిభా ఫూలే ప్రజా భవన్ లో కొనసాగుతున్న ప్రజావాణి కార్యక్రమంలో తాజాగా సీఎం సమీక్షించారు. ప్రజలు ఇప్పటివరకు సమర్పించిన అర్జీలు, వాటిలో ఎన్ని పరిష్కారమయ్యాయి.. అర్జీల పరిష్కారానికి అధికారులు అనుసరిస్తున్న విధానాలపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు.
68% సమస్యలు పరిష్కారం
ప్రజల అర్జీలను పరిష్కరించడంలో విజయవంతంగా సాగుతున్న ప్రజావాణి కార్యక్రమంలో మరింత పారదర్శకమైన విధానాలను అమలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. జిల్లా కేంద్రాల్లో జరుగుతున్న ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రజాభవన్‌లో కొనసాగుతున్న ప్రజావాణి డ్యాష్ బోర్డుతో అనుసంధానం చేయాలని చెప్పారు. 2023 డిసెంబర్ నుంచి ఇప్పటివరకు 117 సార్లు ప్రజావాణి నిర్వహించగా, అందులో 54619 అర్జీలను ప్రజలు నమోదు చేసుకున్నారు. వీటిలో 68.4 శాతం (37384) అర్జీలు పరిష్కారమయ్యాయని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.
యాక్సెస్ కోరిన సీఎం
ప్రజావాణి డ్యాష్ బోర్డు యాక్సెస్ ను తనకు అందించాలని, ముఖ్యమంత్రికి లైవ్ యాక్సెస్ ఉండేలా ఏర్పాటు చేయాలని ఈ సమీక్షలో సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు. దీంతో తాను ఎక్కడ ఉన్నా ప్రజావాణి అర్జీల పరిష్కారం తీరును, ప్రజల నుంచి ఎలాంటి విజ్ఞప్తులు వస్తున్నాయో తెలుసుకునే వీలుంటుందని అన్నారు. అర్జీల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత అధికారులకు దిశా నిర్దేశం చేయటం వేగవంతమవుతుందని అన్నారు.
Also Read: Case Against Aghori: లేడీ అఘోరీ ఆ పూజ చేస్తోందా? మహిళ ఫిర్యాదు.. కేసు నమోదు..
గోప్యత అవసరం
అర్జీల వివరాలతో పాటు ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాల సమాచారాన్ని ఆన్ లైన్ లో పారదర్శకంగా అందుబాటులో ఉంచాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు, వాటి అమలు పురోగతి పారదర్శకంగా అందరూ తెలుసుకునేందుకు వీలుగా ఉండేలా ఈ పోర్టల్ రూపొందించాలని సూచించారు. ప్రజల వ్యక్తిగత భద్రతకు ఇబ్బంది లేకుండా అమల్లో ఉన్న చట్టాల ప్రకారం ఏయే సమాచారాన్ని గోప్యంగా ఉంచాలి.. వేటిని ప్రజలకు అందుబాటులో ఉంచాలనేది ముందుగా సమీక్షించుకోవాలన్నారు. అధికారుల స్థాయిలో కమిటీ వేసి అందుకు సంబంధించిన మార్గదర్శకాలు రూపొందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.