Warangal Crime: మానవత్వం నేటి సమాజానికి బహుదూరం అనేలా జరిగిన ఈ ఘటన ప్రస్తుతం సంచలనంగా మారింది. ఔను.. వయస్సు పైబడితే చాలు ఈ బ్రతుకెందుకు అనే స్థాయికి వృద్ధులు ఎందుకు వస్తున్నారో తెలియని పరిస్థితి. కొందరు వృద్ధులు మానసిక ఆందోళనతో ఆత్మహత్యకు పాల్పడుతున్న పరిస్థితి. మానవ సంబంధాలు, మానవతా విలువలు కనుమరుగయ్యే పరిస్థితి వచ్చిందని చెప్పేందుకు ఇలాంటి ఘటనలే ఉదాహరణ.
కనిపెంచిన తల్లిదండ్రులు భారమయ్యే పరిస్థితులు ఎందుకు వచ్చాయో తెలియదు. నాడు భుజాలపైకి ఎక్కించుకొని అమ్మా నాన్న మురిసిన రోజులు ఎక్కడికి వెళ్లాయో తెలియదు. కానీ కాస్త వృద్ధాప్యం రాగానే, కన్న తల్లిదండ్రులు భారమవుతున్న పరిస్థితులు మనకు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొందరు ఈ మానవ జీవితం ఎందుకు అంటూ ఆత్మహత్యకు పాల్పడుతూ బ్రతికే ఛాన్స్ ఉన్నా, ప్రాణాలు వదులుతున్నారు. అలాంటి ఘటనే ఇది. ఈ ఘటన తెలంగాణలోని వరంగల్ జిల్లాలో జరిగింది.
బాపు సినిమాలో ఓ తండ్రి, ఓ కుమారుడి మధ్య జరిగిన సన్నివేశాలు గుర్తుండే ఉంటాయి. తండ్రి భారమయ్యాడని సూటిపోటి మాటలు ఆ సినిమాలో రక్తి కట్టించాయి. ఆ సినిమాలో కొడుకు మాటలు తట్టుకోలేక తండ్రి ఆత్మహత్యకు పాల్పడడం మనం రీల్ లో చూసే ఉంటాం. కానీ ఇక్కడ రియల్ గా అలాంటి ఘటన జరిగిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అసలేం జరిగిందంటే..
వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం కడారిగూడెంలో మల్లేశం అనే వృద్ధుడు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఏకంగా గడ్డి మందు తాగి మల్లేశం ఆత్మహత్యకు పాల్పడడంతో మల్లేశం కుమార్తె విజయ అక్కడికి చేరుకుంది. కళ్ల ముందు తన తండ్రి విగతజీవిలా చనిపోయి ఉండడాన్ని చూసి తీవ్రంగా రోదించింది. ఆ తర్వాత ఏకంగా పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. ఇంతకు ఆమె ఫిర్యాదులో ఏం చెప్పిందంటే..
Also Read: Lady Aghori: లేడీ అఘోరీ అరెస్ట్ తప్పదా? ఏపీ పోలీసులా? తెలంగాణనా?
ఆస్తి కోసం తన తండ్రిని కుమారుడు, కోడలు వేధించారని, నువ్వు ఉండి ఏం ప్రయోజనం లేదు , చచ్చిపో అంటూ చెప్పేవారని ఆమె తెలిపింది. మందు తాగి చనిపో మామ అంటూ కోడలు చెప్పిన మాటను విని, తన తండ్రి ఆత్మహత్య చేసుకున్నట్లు ఆమె వాపోయింది. పోలీసులకు ఫిర్యాదు అందిన నేపథ్యంలో కేసు నమోదు చేసి దర్యాప్తు సాగిస్తున్నారు. వృద్ధాప్యంలో అండగా నిలవాల్సిన కొడుకు, కోడలు చనిపో అంటూ మాటలు అనడంతోనే మల్లేశం చనిపోయినట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు. అయితే అసలు విషయం మాత్రం పోలీసుల దర్యాప్తులో బయటకు రావాల్సి ఉంది.