TDP Alliance Govt(image credit:X)
ఆంధ్రప్రదేశ్

TDP Alliance Govt: సీఎం చేతిలో అవినీతి చిట్టా.. ఆ నాయకుల పని పడతారా?

TDP Alliance Govt: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా ప్రతినిధులు, మంత్రుల పరిస్థితి ఎలా ఉంది? ఎంత మంది ఎమ్మెల్యేలు ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు? ఏయే విషయాల్లో ఇలా జరుగుతోంది? అని ఓ ప్రముఖ సర్వే సంస్థ ఐఐటీ నిపుణులతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సర్వే చేయించింది. సదరు సంస్థ రిలీజ్ చేసిన నివేదికలో నివ్వెరపోయే విషయాలు వెలుగుచూడటం గమనార్హం. ఇప్పుడీ సర్వేపై మీడియా, సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తునే చర్చ జరుగుతోంది. కేవలం 10 నెలల పాలన పూర్తి చేసుకుంటున్న కూటమి పార్టీల్లోని ప్రజా ప్రతినిధులపై ఏకంగా 70 శాతం వ్యతిరేకత ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల సంఖ్య అక్షరాలా 71 ఉండటమే.

ఈ సర్వేతో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల అధినేతలు, అగ్రనేతలు కంగుతిన్నారట. మరోవైపు నివేదిక చూసిన సదరు ఎమ్మెల్యేలు, మిగిలిన శాసన సభ్యులు, మంత్రులు సైతం వణికిపోతున్నారట. వాళ్లు సరే తమ పరిస్థితి ఎప్పుడెలా ఉంటుంది? ఇప్పుడీ ఎమ్మెల్యేలపై ఆయా పార్టీల అధిపతులు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? అని కార్యకర్తలు, ఆయా పార్టీ శ్రేణుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

సర్వేలో ఏముంది?

71 మంది ఎమ్మెల్యేలు, కొందరు మంత్రులు నేరుగా మ‌ద్యం, ఇసుక, ల్యాండ్, రియ‌ల్ ఎస్టేట్ మాఫియాలుగా అవతారం ఎత్తారని ఆ సర్వేలో తేటతెల్లమైంది. నియోజ‌క‌వ‌ర్గాల్లో వివిధ సంస్థలు, వ్యక్తుల నుంచి భారీ మొత్తంలో లంచం రూపంలో డ‌బ్బు గుంజుతున్నారని మరో ప్రధాన ఆరోపణ. దీంతో పాటుగా మైనింగ్ మాఫియా, కాంట్రాక్టర్ల నుంచి ముక్కు పిండి మ‌రీ వ‌సూళ్లకు పాల్పడుతున్నారని సర్వే స్పష్టం చేసింది. ఇవన్నీ ఒకెత్తయితే ఆఖరికి చిన్నచిన్న వ్యాపార‌స్తులు, ప్రభుత్వ ఉద్యోగుల నుంచి కూడా డ‌బ్బు దోస్తున్నారని నివేదికలో ఉండటం ఎంత విచిత్రమో కదా?

మరోవైపు కొందరు ఎమ్మెల్యేలు కేడర్‌కు అస్సలు అందుబాటులో ఉండటం లేదని, కనీసం ఫోన్లు కూడా లిఫ్ట్ చేయట్లేదని కార్యకర్తలు ఆరోపిస్తున్నారని నివేదికలో ఆ సంస్థ పేర్కొన్నది. ఇక ప్రజా సమస్యలు అంటారా? అబ్బే మనకెందుకులే అన్నట్లుగా స‌మ‌స్యలన్నింటినీ గాలికి వ‌దిలేశారని తేలిపోయింది. కాగా, 2024 సార్వత్రిక ఎన్నికల్లో 164 అసెంబ్లీ సీట్లను గెలిచిన ఎన్డీఏ కూటమి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే అధికారంలోకి వచ్చి పట్టుమని 10 నెలలు కూడా కాకమునుపే ఈ రేంజిలో ప్రజా వ్యతిరేకత రావడంతో అటు మీడియాలో, ఇటు సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరుగుతోంది. వైసీపీ కార్యకర్తలు ఈ సర్వేను తెగ వైరల్ చేస్తున్నారు.

ఆ ఎమ్మెల్యేలు వీళ్లే..

70 శాతం వ్యతిరేకత, 30 శాతం మాత్రమే పాజిటివిటీ ఉన్న 73 మంది ఎమ్మెల్యేలు వివరాలు ఉమ్మడి జిల్లాల వారీగా ఇలా ఉన్నాయి. శ్రీ‌కాకుళం జిల్లాలో శ్రీ‌కాకుళం, ఎచ్చెర్ల, పాల‌కొండ (ఎస్టీ), ప‌లాస‌, పాత‌ప‌ట్నం; విజ‌య‌న‌గ‌రం జిల్లాలో గ‌జ‌ప‌తిన‌గ‌రం, నెల్లిమ‌ర్ల, సాలూరు (ఎస్టీ), పార్వతీపురం (ఎస్సీ), కురుపాం (ఎస్టీ); విశాఖ‌ప‌ట్నం జిల్లాలో య‌ల‌మంచిలి, పెందుర్తి, విశాఖ‌ప‌ట్నం (సౌత్‌), న‌ర్సీప‌ట్నం, అన‌కాప‌ల్లి; తూర్పు గోదావ‌రి జిల్లాలో తుని, రాజాన‌గ‌రం, పి.గ‌న్నవ‌రం (ఎస్సీ), కాకినాడ రూర‌ల్, రంప‌చోడ‌వ‌రం (ఎస్టీ), రాజోలు (ఎస్సీ), కొత్తపేట‌, రామ‌చంద్రాపురం; పశ్చిమ గోదావ‌రి జిల్లాలో తాడేప‌ల్లిగూడెం, న‌ర‌సాపురం, ఉంగ‌టూరు, నిడ‌ద‌వోలు, పోల‌వ‌రం (ఎస్టీ), చింత‌ల‌పూడి (ఎస్సీ); కృష్ణా జిల్లాలో విజ‌య‌వాడ పశ్చిమ, తిరువూరు (ఎస్సీ), కైక‌లూరు, నూజివీడు, నందిగామ (ఎస్సీ)

గుంటూరు జిల్లాలో పెద‌కూర‌పాడు, న‌ర్సారావుపేట‌, గుంటూరు వెస్ట్ , తెనాలి, బాప‌ట్ల, గుర‌జాల‌; ప్రకాశం జిల్లాలో కందుకూరు, మార్కాపురం, చీరాల‌, గిద్దలూరు; నెల్లూరు జిల్లాలో కావ‌లి, స‌ర్వేప‌ల్లి, సూళ్లూరుపేట (ఎస్సీ), ఉద‌య‌గిరి; ఇక రాయలసీమ విషయానికొస్తే.. వైఎస్సార్ క‌డ‌ప జిల్లాలో క‌డ‌ప‌ సిటీ, రాయ‌చోటి, కోడూరు (ఎస్సీ); క‌ర్నూలు జిల్లాలో ప‌త్తికొండ‌, ఆళ్లగ‌డ్డ, పాణ్యం, ఆదోని, క‌ర్నూలు, డోన్‌, నందికొట్కూరు (ఎస్సీ); అనంత‌పురం జిల్లాలో మ‌డ‌క‌సిర (ఎస్సీ), పెనుగొండ‌, క‌దిరి, గుంత‌క‌ల్‌, అనంత‌పురం అర్బన్‌, శింగ‌న‌మ‌ల (ఎస్సీ), క‌ల్యాణ‌దుర్గం; చిత్తూరు జిల్లాలో శ్రీ‌కాళ‌హ‌స్తి, తిరుప‌తి, చంద్రగిరి, న‌గరి, గంగాధ‌ర‌నెల్లూరు (ఎస్సీ), స‌త్యవేడు (ఎస్సీ) నియోజ‌క‌వ‌ర్గాల్లో కూట‌మి ప్రజాప్రతినిధులు 70 శాతం ప్రజావ్యతిరేక‌త క‌లిగివున్నారని సర్వేలో తేలడం పెను సంచలనమైంది.

మిగిలినోళ్లు, మంత్రులేం తక్కువ కాదే!

పోనీ ఈ 71 మంది కాకుండా మిగిలిన ఎమ్మెల్యేలు, మంత్రులుగా ఉన్న వారిపై ఎలాంటి వ్యతిరేకత లేదా? ప్రజాదరణ బాగుందా? అంటే వారిపైనా ఉందని సర్వేలో తేలింది. 30-40 శాతం మ‌ధ్య ప్రజాద‌ర‌ణ ఉండి, 60 నుంచి 70 శాతం లోపు వ్యతిరేక‌త క‌లిగిన ప్రజాప్రతినిధులు కూడా చాలా మంది ఉన్నట్టు సర్వే నిర్వాహకులు స్పష్టం చేశారు. అయితే ఈ సర్వేపై ఇంతవరకూ కూటమి నేతలు ఒక్కరంటే ఒక్కరూ స్పందించలేదు. ఏదైనా ఆదిలోనే ఇలాంటి ప్రజాప్రతినిధులను సీరియస్‌గా తీసుకొని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇన్నాళ్లు జరిగిందేదో జరిగిపోయిందని ఇకపైన రిపీట్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఆయా పార్టీల అధిపతులు, ప్రభుత్వ పెద్దలపై ఉంది.

Also read: Gorantla Madhav: గోరంట్ల మాధవ్ కు ఫోన్ ఇచ్చిందెవరు? అనుమానం ఎవరిపై?

వాస్తవానికి పలువురు ఎమ్మెల్యేలు, మంత్రుల తీరుపై ప్రజల్లో వ్యతిరేకత రావడం కేబినెట్ ఏర్పాటు తర్వాతే మొదలైందన్నది జగమెరిగిన సత్యమే. దీనికి తోడు సోషల్ మీడియా వేదికగా కొందరు ఆధారాలతో సహా నిరూపించిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. మరోవైపు ఇసుక విషయంలో ఒకర్ని మించి మరొకరు ఇష్టానుసారం తరలింపులు చేస్తున్నారని, పార్టీ నేతల మధ్య గొడవలు కూడా జరిగాయి. పోనీ ఈ సర్వేను నమ్మడానికి లేదా? ఇందులో ఏమైనా అవాస్తవాలు ఉన్నాయా? అంటే అదేమీ లేదు. ఇదే సంస్థే 2019 ఎన్నికల్లో వైసీపీకి సుమారు 140 నుంచి 148 వరకూ అసెంబ్లీ స్థానాలు వస్తాయని, గెలుపు ఊహించని రీతిలో ఉంటుందని చెప్పింది. దీంతో ఆ ఐఐటీ నిపుణులను, సర్వే సంస్థను కూడా విమర్శించడానికి కూటమి నేతలకు మార్గం లేకుండా పోయిందనే చర్చ జరుగుతోంది.

సీబీఎన్‌ ముందే పసిగట్టారా?

వాస్తవానికి కొందరు ఎమ్మెల్యేలు, మంత్రుల పట్ల సీఎం చంద్రబాబు తీవ్ర అసంతృప్తి రగిలిపోతున్నారన్నది అక్షరాలా నిజమే. ఎందుకంటే బహిరంగంగా, సమీక్షా సమావేశాల్లో ప్రజా ప్రతినిధులు, మంత్రులను ముఖ్యమంత్రి హెచ్చరిస్తూనే వస్తున్నారు. ప్రతిసారీ వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తీరు మార్చుకోకపోతే పరిస్థితి వేరేలా ఉంటుందని కూడా వార్నింగ్ ఇచ్చిన సందర్భాలు చాలానే ఉన్నాయి. కొందర్ని సీఎంవోకి పిలిపించి మరీ క్లాస్ తీసుకున్న రోజులూ ఉన్నాయి. అయినప్పటికీ ఆ శాసన సభ్యుల్లో ఇసుమంత కూడా మార్పు రాలేదని తాజా సర్వేతో తేలిపోయింది. అంటే ఇవన్నీ చంద్రబాబు ముందుగానే పసిగట్టి, హెచ్చరించినా సరే ఎమ్మెల్యేలు ఏ మాత్రం మారలేదన్న మాట.

ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యేలను సీఎం ఏం చేయబోతున్నారు? జనసేన ఎమ్మెల్యేలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? బీజేపీ శాసన సభ్యులను రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి ఏం చేస్తారు? అనేదానిపై ఆయా పార్టీల శ్రేణుల్లో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మరోవైపు ఇన్నాళ్లు చూసీచూడనట్లుగానే వ్యవహరించిన చంద్రబాబు ఇప్పుడిక ఊహించని రీతిలో నిర్ణయాలు తీసుకోబోతున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక మంత్రులపైనా ఇప్పటికిప్పుడు చర్యలు తీసుకుంటే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లొచ్చని, అందుకే తీరు మార్చుకోవాలని హెచ్చరికలతోనే ఇన్నాళ్లు సరిపెట్టుకున్నారని టీడీపీ శ్రేణులు చెప్పుకుంటున్నాయి. దీన్ని బట్టి చూస్తే ఏడాది తర్వాత ఆయా ప్రజా ప్రతినిధులకు అసలు సినిమా ఉండబోతుందన్న మాట.

Just In

01

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..

Khairatabad Ganesh 2025: గంగమ్మ ఒడికి.. ఖైరతాబాద్ మహా గణపతి.. భారీగా తరలివచ్చిన భక్తులు

Ponguleti Srinivasa Reddy: అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి