Gorantla Madhav: వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఫోన్ మాట్లాడిన వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం నివేదిక కోరింది. కోర్టుకు హాజరుపరిచిన సమయంలో గోరంట్ల ఫోన్‌లో మాట్లాడటం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. దీంతో కస్టడీలో ఉన్నప్పుడు మాధవ్‌కు మొబైల్ ఇచ్చిందెవరు? అని పోలీసులను ఉన్నతాధికారులు వివరణ కోరారు. మరోవైపు చేబ్రోలు కిరణ్ ఉన్న అడ్రస్‌ను గోరంట్లకు కొంతమంది పోలీసులు చెప్పారని ఉన్నతాధికారులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు.
అంతేకాదు, అరెస్టు చేసి మీడియా ముందు ప్రవేశపెట్టే సమయంలోనూ మాజీ ఎంపీ ఓవరాక్షన్ చేశారు. ఈ మొత్తం వ్యవహారంలో ఐదు నుంచి ఆరుగురు పోలీసులపై వేటు పడే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే పూర్తి వివరాలతో ఉన్నతాధికారులు నివేదిక సిద్ధం చేశారు. ఒకట్రెండు రోజుల్లో పోలీసులపై చర్యలు తప్పవని తెలుస్తున్నది. కాగా, కిరణ్ ఆచూకీ చెప్పడం, ఫోన్ ఇవ్వడం ఈ రెండు అంశాలు తీవ్ర విమర్శలకు తావిస్తున్నాయి. దీంతో, రంగంలోకి దిగిన ఉన్నతాధికారులు శరవేగంగా చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతున్నారు.