Malla Reddy Joins TDP: తెలుగు రాజకీయాల్లో తనకుంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నేతల్లో బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి మల్లారెడ్డి (Chamakura Malla Reddy) ఒకరు. తన చేతలు, మాటలతో తనకుంటూ సెపరేట్ క్రేజ్ ను ఆయన సంపాదించుకున్నారు. రాజకీయాలకు అతీతంగా ఆయన్ను చాలా మంది ఇష్టపడుతుంటారు. గత బీఆర్ఎస్ (BRS) పాలనలో డ్యాన్స్ లు, పంచ్ డైలాగ్స్ తో తరుచూ వార్తల్లో నిలిచిన మల్లారెడ్డి.. గత కొన్ని రోజులుగా సైలెంట్ అయిపోయారు. ఎక్కడా కనిపించడం లేదు. దీంతో మల్లారెడ్డి ఎక్కడికి వెళ్లారు? అని రాజకీయ వర్గాలు చర్చించుకుంటుండగా ఆయన జపాన్ లో దర్శనమిచ్చారు.
బుల్లెట్ ట్రైన్ తో ఫోజులు
బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి మల్లారెడ్డి ప్రస్తుతం జపాన్ పర్యటన (Malla Reddy Japan Tour)లో ఉన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి అక్కడి పర్యాటక ప్రాంతాలను ఆస్వాదిస్తున్నారు. ఈ క్రమంలో అత్యంత వేగంగా దూసుకెళ్లె బుల్లెట్ ట్రైన్ ను ఎక్కి ఆయన ఎంతో సరదాగా గడిపారు. ట్రైన్ జర్నీకి ముందుకు బుల్లెట్ ట్రైన్ తో దిగిన ఫొటోను మల్లారెడ్డి.. తన సోషల్ మీడియాలో పంచుకున్నారు. ‘జపాన్ దేశంలో బుల్లెట్ ట్రైన్ ప్రయాణం’ అంటూ ఆ పోస్టుకు మల్లారెడ్డి క్యాప్షన్ ఇచ్చారు.
టీడీపీలోకి వెళ్తారా?
అయితే మల్లారెడ్డి పోస్ట్ చేసిన తాజాగా ఫొటో.. రాజకీయ వర్గాల్లో కొత్త ప్రశ్నలను రేకెత్తించాయి. ఈ ఫోటోలో మల్లారెడ్డి చేతిని పరిశీలిస్తే ఆయన చంద్రబాబు తరహాలో రెండు చేతి వేళ్లను చూపిస్తూ కనిపించారు. దీంతో మల్లారెడ్డి టీడీపీలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారన్న ఊహాగానాలు.. తెలంగాణ రాజకీయాల్లో మెుదలయ్యాయి. విక్టరీ సింబల్ చూపిస్తూ.. పార్టీ మారేందుకు బాటలు వేసుకుంటున్నారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. దీనికితోడు గత కొన్ని రోజులుగా ఆయన పార్టీ మారతారన్న చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే.
కాంగ్రెస్ లోకి నో ఎంట్రీ!
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ (Congress Party) అధికారంలోకి వచ్చాక ఒక్కసారిగా రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పదే పదే రేవంత్ (CM Revanth Reddy) ను టార్గెట్ చేస్తూ వచ్చిన మల్లారెడ్డి.. ప్రభుత్వం మారిన తర్వాత తన దూకుడు పూర్తిగా తగ్గించేశారు. ఓ దశలో సీఎం రేవంత్ రెడ్డి ఇంట్లో సైతం ఆయన ప్రత్యక్షమయ్యారు. అప్పటికే కాంగ్రెస్ లో చేరతారన్న ప్రచారం జోరుగా జరుగుతుండటంతో మల్లారెడ్డి పార్టీ మారడం ఖాయమని అంతా అనుకున్నారు. అయితే దాని తర్వాత పార్టీలో చేరికపై ఎలాంటి ఊసే బయటకురాలేదు. తన ఆస్తులు, వ్యాపారాలు కాపాడుకోవడం కోసమే ఆయన అధికార కాంగ్రెస్ లో చేరాలని ప్రయత్నించారని అప్పట్లో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.
Also Read: ITDP Kiran Arrested: చేబ్రోల్ కిరణ్ కు బిగ్ షాక్.. ఈడ్చుకెళ్లిన పోలీసులు.. ఆపై అరెస్టు!
ఆక్రమణలపై రేవంత్ ఫైర్
భూములను ఆక్రమించి కాలేజీలు నిర్మించారని మల్లారెడ్డిపై అప్పట్లో రేవంత్ చేసిన ఆరోపణలు రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీశాయి. దీంతో ఈ ఇద్దరి నేతల మధ్య సవాళ్ల పర్వం కొనసాగింది. ఓ దశలో స్టేజీ పైన నిలబడి రేవంత్ రెడ్డికి తొడగొట్టి మరి మల్లారెడ్డి సవాలు విసిరారు. అయితే రేవంత్ అధికారంలోకి వచ్చాక.. ఆక్రమించుకొని నిర్మించిన మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డికి సంబంధించిన కాలేజీ భవనాలను అధికారులు కూల్చివేశారు. దీంతో రేవంత్ వద్దకు ఆయన పలు మార్లు ఆయన కాళ్లబేరానికి వెళ్లారని పెద్దఎత్తున వార్తలు వచ్చాయి.