Rahul gandhi news today(Political news telugu): కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ తాము ప్రకటించిన పథకాలు క్షేత్రస్థాయిలో మార్పులు తెస్తున్నాయని పేర్కొన్నారు. దేశ భవితవ్యాన్ని రూపొందించడంలో మహాలక్ష్మీ పథకం విప్లవాత్మక చర్యగా మారుతుందనే తన విశ్వాసం నిజం అవుతున్నదని తెలిపారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకానికి సంబంధించి ఓ సక్సెస్ స్టోరీ వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని రాహుల్ గాంధీ ప్రస్తావిస్తూ తన విశ్వాసం నిజం అవుతున్నదని పేర్కొన్నారు.
తెలంగాణలో మహాలక్ష్మీ పథకం కింద ప్రతి మహిళకు రూ. 2,500 అందిస్తామని కాంగ్రెస్ ప్రకటించిన సంగతి తెలిసిందే. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ పథకాన్ని ఇంకా అమలు చేయాల్సి ఉన్నది. కర్ణాటకలో ఇదే పథకం గృహలక్ష్మీ పథకం పేరుతో అమలు అవుతున్నది. కర్ణాటకలో గృహలక్ష్మీ పథకం కింద రూ. 2,000 నగదు అందిస్తున్నారు. ఈ పథకం కింద వచ్చిన డబ్బుతో ఓ మహిళ తన కొడుకును చదివించింది. ఆమె కొడుకు వేదాంత్ పీయూసీ పరీక్షలో ఈ రోజు రాష్ట్రంల రెండవ ర్యాంక్ తెచ్చుకున్నాడు.
Also Read: మనుషులన్నాక తప్పు చేస్తారు.. అందుకు బాధపడాల్సిందే మరీ!!
వేదాంత సక్సెస్ స్టోరీ భారత స్త్రీల తపస్సుకు, పైసా పైసా పొగుచేసి ఇంటిని పటిష్టం చేయాలనే సంకల్పానికి సజీవ ఉదాహరణ అని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. మహాలక్ష్మి యోజనా ద్వారా దేశవ్యాప్తంగా పేద కుటుంబాలకు చెందిన మహిళలకు ప్రతి సంవత్సరం రూ. 1 లక్ష లభిస్తే.. ఎంత మంది వేదాంత్‌లు తమ ప్రతిభతో కుటుంబ భవిష్యత్‌ను పురోగతిలోకి తీసుకెళ్లుతారో ఎవరికి తెలుసు అని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ చారిత్రాత్మక పథకం పేద కుటుంబాల కలలను సాకారం చేస్తున్నదని తెలిపారు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య పోస్టు చేసిన వీడియోను రాహుల్ గాంధీ రీట్వీట్ చేస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ పార్టీ ఇటీవలే లోక్ సభ ఎన్నికల కోసం మ్యానిఫెస్టోను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ మ్యానిఫెస్టోలో పాంచ్ న్యాయ్, పచ్చీస్ గ్యారంటీలు ఉన్నాయి. ఈ ఐదు పాంచ్ న్యాయ్‌లలో ఒకటి మహిళలకు ఇచ్చిన న్యాయ్ ఉన్నది. ఇందులో పేర్కొన్న ఐదు గ్యారంటీల్లో పేద కుటుంబాల్లోని మహిళకు ప్రతి యేటా రూ. 1 లక్ష అందిస్తామని హామీ ఇచ్చింది. ఈ హామీని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.