Supreme court on Patanjali ads case(Telugu breaking news): యోగా గురువు బాబా రాందేవ్‌కు దేశవ్యాప్తంగా ఫాలోవర్స్ ఉన్నారు. ఆయన యోగా ఆసనాలతో ప్రజలకు చేరువయ్యారు. కొంత ఆధ్యాత్మిక చింతన కూడా కలిగి ఉండి బాబా అవతారంలో ఉండటంతో సాధారణంగానే ప్రజలు ఆయన మాటను విశ్వసిస్తారు. పైగా ఆయన జాతీయవాదాన్ని ఉటంకిస్తూ దేశీయ ఉత్పత్తుల గురించి గంభీరంగా ఉపన్యాసాలు దంచేస్తుంటారు. ముందుగా తనకంటూ ఒక నెరేటివ్ తయారు చేసుకుని అందుకు అనుగుణంగానే వ్యాపార కార్యకలాపాలను ప్రారంభించారు. అందులో సక్సెస్ అయ్యారు. వారు ఔషధరంగంలోనూ అడుగుపెట్టారు. కరోనా కాలంలో ఆధునిక ఔషధాల (అల్లోపతి)పై ఆరోపణలు చేస్తూ పతంజలి ప్రవేశపెట్టి కొరొనిల్, స్వసరిని ప్రమోట్ చేసుకున్నారు. ఇదే ఇప్పుడు పతంజలి ఆయుర్వేద సంస్థ వ్యవస్థాపకుడు బాబా రాందేవ్, ఆ సంస్థ ఎండీ బాలకృష్ణలను చిక్కుల్లో పడేసింది.
కరోనా ఆపత్కాలంలో ప్రాణాలను కాపాడుకోవడానికి తినే ఆహారంపై శ్రద్ధ పెరిగింది. అప్పుడు కిచెన్‌లో లభించే దినుసులు, ధాన్యాల ప్రాధాన్యతపై చర్చ పెరిగింది. ఆ విపత్కర పరిస్థితుల్లో ఏది వాస్తవం.. ఏది అవాస్తవం అనే నిర్దారణ అసాధ్యంగా కనిపించింది. అలాంటి సమయంలోనే పతంజలి కొరోనిల్‌ను బాగా ప్రచారం చేసింది. ఆధునిక వైద్యం ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆరోపణలు చేశారు. తమ మందులు సమర్థవంతంగా పని చేస్తాయని ఆచార్య బాలకృష్ణ అన్నారు. టీకాలపైనా దుష్ప్రచారం జరుగుతున్న సమయంలో పతంజలి కూడా ఆధునిక వైద్యంపై తీవ్ర ఆరోపణలు చేయడం పరిస్థితులను జటిలం చేశాయి. అధికార యంత్రాంగం, ప్రభుత్వ పెద్దలు అందరూ టీకాలు వేసుకోవాలని ప్రోత్సహిస్తుంటే మరోవైపు అందుకు వ్యతిరేకంగా దుష్ప్రచారం సమాజంలో సాగింది. ఈ వదంతుల వ్యాప్తి, దుష్ప్రచారం కరోనాపై పోరాటానికి పెద్ద సవాలుగా మారింది.
Also Read: అక్రమాల.. కింగ్ పిన్..!!
పతంజలి ప్రకటనలపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. కోర్టు కూడా పతంజలిని మందలించింది. దీంతో తాము ఆధునిక వైద్యంపై ఆరోపణలు చేయబోమని పతంజలి కోర్టుకు తెలిపింది. కానీ, ఆ తర్వాత షరామామూలే. మళ్లీ పతంజలి తన వితండవాదాన్ని కొనసాగించింది. దీంతో అత్యున్నత న్యాయస్థానం సీరియస్ అయ్యింది. ఫిబ్రవరి నెలలో నోటీసులు పంపింది. దీంతో కోర్టుకు క్షమాపణలు చెబుతూ వారు అఫిడవిట్ దాఖలు చేశారు. అందులో ఓ చట్టాన్ని ప్రస్తావించారు. సుప్రీంకోర్టు వారి క్షమాపణలు తిరస్కరిస్తూ మరో అవకాశం ఇచ్చింది. మళ్లీ బాబా రామ్‌దేవ్, బాలకృష్ణలు సంపూర్ణ క్షమాపణలు చెబుతూ అఫిడవిట్ వేశారు. మనుషులు అన్నాక తప్పు చేస్తారు అంటూ పతంజలి తరఫు న్యాయవాది ముకుల్ రోహత్గీ కోర్టుకు నచ్చజెప్పే ధోరణిలో మాట్లాడారు. అలాగైతే.. అందుకు వారు బాధపడాల్సిందే. ఈ కేసులో ఉదారంగా వ్యవహరించబోమని సుప్రీంకోర్టు నిక్కచ్చిగా చెప్పేసింది.
‘క్షమాపణలు కేవలం కాగితం మీదే ఉన్నాయి. వారి ఆలోచనల్లో మార్పు కనిపించడం లేదు. గతంలో తప్పుదోవ పట్టించే ప్రకటనలు చేయబోమని కోర్టుకు తెలిపి మరీ అదే బాట పట్టారు. ఇప్పుడు మాత్రం క్షమాపణలు చెప్పి దాటవేయరని ఎలా అనుకోగలం? క్షమాపణల అఫిడవిట్‌ను కోర్టు కంటే ముందుగా మీడియాకు అందించారు. కోర్టు కన్నా వారికి ప్రచారం ముఖ్యం’ అని సుప్రీంకోర్టు సీరియస్ అయింది.