Appi Reddy on Jagan: రాప్తాడు నియోజకవర్గంలోని రామగిరిలో మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటనలో భద్రతా వైఫల్యాలు కొట్టొచ్చినట్టు కనపడ్డాయని ఎమ్మెల్సీ, వైసీపీ నేత లేళ్ల అప్పిరెడ్డి ఆరోపించారు. మాజీ సీఎం జగన్ ప్రయాణించిన హెలికాప్టర్ విండ్ షీల్డ్ విరిగిపోయిందని, దీనిపై అనుమానాలు ఉన్నాయని ఆయన సందేహం వ్యక్తం చేశారు.
ఇది ప్రభుత్వ వైఫల్యం కాదా అని ఆయన ప్రశ్నించారు. హెలీకాప్టర్ విండ్ షీల్డ్ దెబ్బతినడంపై చాలా అనుమానాలు ఉన్నాయని పేర్కొన్నారు. జగన్‌కు భద్రత కల్పించే విషయంలో చంద్రబాబు ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందో తాజా ఘటనే ప్రత్యక్ష సాక్ష్యమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో రోజురోజుకీ శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయని, జగన్ పర్యటన సమాచారాన్ని రెండు రోజుల ముందుగానే అందించామని, అయినప్పటికీ భద్రతా లోపాలు చోటుచేసుకోవడం ప్రభుత్వం వైఫల్యానికి నిదర్శనమని ఆయన మండిపడ్డారు. ఈ మేరకు తాడేపల్లిలోని వైసీపీ ప్రధాన కార్యాలయం లేళ్ల అప్పిరెడ్డి మీడియా మాట్లాడారు.
Also read: Police SI Arrested: ఏసీబీ వలకి చిక్కిన ఎస్సై .. ఎక్కడంటే?
అత్యంత ప్రజాధరణ కలిగిన నేత జగన్‌కు పోలీసులు కనీస భద్రత కల్పించడంలో విఫలమయ్యారని ఆయన ఆరోపించారు. కూటమి సర్కారు ఏర్పడ్డాక జగన్ భద్రతను తగ్గించారని, ఆయన నివాసం వద్ద భద్రత కుదించారని పేర్కొన్నారు. కూటమి నేతల ఆదేశాలకు అనుగుణంగానే పోలీసులు వ్యవహరిస్తున్నారని అప్పిరెడ్డి ఆరోపించారు.
ప్రభుత్వాలు వస్తుంటాయి, పోతుంటాయి, కానీ వ్యవస్థలు సక్రమంగా పనిచేయాలని సూచించారు. రాష్ట్రంలో తిరిగి కచ్చితంగా వైసీపీ ప్రభుత్వం వస్తుందని, కూటమి నేతల మాటలు విని తప్పులు చేసే పోలీసు అధికారులను విడిచిపెట్టబోమని ఆయన హెచ్చరించారు.