Modi on Pawan Kalayn’s Son: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ కు సింగపూర్ అగ్నిప్రమాదంలో తీవ్ర గాయాలైన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని తెలుసుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేరుగా పవన్ కళ్యాణ్ తో ఫోన్లో మాట్లాడారు. అసలేం జరిగిందనే కోణంలో ప్రధాని ఆరా తీసినట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.
అడవి తల్లి యాత్ర పేరిట పవన్ కళ్యాణ్ ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో రెండు రోజులుగా పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో గిరిజనులతో మాట్లాడి వారి యొక్క సమస్యలను అడిగి తెలుసుకుంటూ తన పర్యటన సాగిస్తున్న క్రమంలో, పవన్ కళ్యాణ్ కుమారుడికి గాయాలైనట్లు సమాచారం అందింది. పవన్ కళ్యాణ్, అన్నా లెజినోవా సుపుత్రుడు మార్క్ శంకర్ సింగపూర్ లో విద్యాభ్యాసం కొనసాగిస్తున్నారు.
మార్క్ శంకర్ చదువుతున్న పాఠశాలలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, 15 మందికి గాయాలయ్యాయి. కాగా మార్క్ శంకర్ కు సైతం గాయాలు కాగా సమాచారం అందుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అల్లూరి సీతారామరాజు జిల్లాలో పర్యటించిన అనంతరం సింగపూర్ కు తరలి వెళ్లారు. ప్రస్తుతం మార్క్ శంకర్ కు స్థానిక వైద్యశాలలో చికిత్స కొనసాగుతోంది.
ప్రమాదం జరిగినట్లు తెలుసుకున్న ప్రధాని మోడీ నేరుగా పవన్ కళ్యాణ్ కు ఫోన్ చేసి, మార్క్ శంకర్ ఆరోగ్య స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. మార్క్ శంకర్ ను కాపాడిన సిబ్బందిని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం అవసరమైన సాయం అందిస్తామని మోడీ చెప్పినట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. అలాగే మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితిపై స్పందిస్తూ అవసరమైన సహకారం అందించవలసిందిగా స్థానిక హై-కమిషనర్ కు ప్రధాని ఆదేశాలు సైతం జారీ చేశారు.
Also Read: Deputy CM Pawan Kalyan: అరకు అందాలు ఆస్వాదించండి.. నాశనం చేయవద్దు.. పవన్ కళ్యాణ్
పవన్ కళ్యాణ్ కుమారుడికి పెను ప్రమాదం తప్పిందని తెలుసుకున్న అన్ని రాజకీయ పార్టీల నాయకులు సోషల్ మీడియా ద్వారా శంకర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. అలాగే జనసైనికులు పలు జిల్లాలలో పూజలు నిర్వహిస్తూ మార్క్ శంకర్ సాధ్యమైనంత త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.