Nara Lokesh: సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉండే రాజకీయ నేతల్లో నారా లోకేష్ (Nara Lokesh) ముందు వరుసలో ఉంటారు. ఈ నేపథ్యంలో ఆయన వద్దకు వెళ్లి నేరుగా సమస్యను చెప్పుకోలేని వారు.. నెట్టింట లోకేష్ ను ట్యాగ్ చేస్తూ తమ గోడును వెల్లబుచ్చుకుంటూ ఉంటారు. దానిపై లోకేష్ సైతం వెంటనే స్పందిస్తూ సమస్య పరిష్కారానికి కృషి చేస్తుంటారు. ఈ తరహా ఘటనలు ఇటీవల తరుచూ చూస్తూనే ఉన్నాం. తాజాగా ఇలాంటి ఘటనే మరొకటి చోటుచేసుకుంది. కష్టమంటూ వచ్చిన మహిళలకు లోకేష్ తనదైన శైలిలో భరోసా కల్పించారు.
భద్రతకు హామీ
వైసీపీ నేతల నుంచి తనను రక్షించాలని కోరుతూ తిరుపతికి చెందిన ఓ మహిళ ఇటీవల ఓ వీడియోను విడుదల చేసింది. వైసీపీ గుండాల బారి నుంచి తనను రక్షించాలని కన్నీరు పెట్టుకుంటూ ఏపీ సీఎం చంద్రబాబుకు విజ్ఞప్తి చేసింది. ఈ వీడియోపై మంత్రి నారా లోకేష్ తాజాగా స్పందించారు. తాను ఉన్నానంటూ భరోసా ఇచ్చారు. ఈ వ్యవహారం తాను చూసుకుంటానని.. ఇకపై మీ వద్దకు వచ్చే సాహసం ఎవరూ చేయరని ఎక్స్ (Twitter) వేదికగా భరోసా కల్పించారు. దీంతో బాధితురాలికి కొండత భరోసా లభించినట్లైందని ఆమె బంధువులు, నెటిజన్లు చెబుతున్నారు.
We will take care of you Amma! No one will ever dare to come to you again. Don't worry!! https://t.co/F6YBWWe0k3
— Lokesh Nara (@naralokesh) April 7, 2025
ఆమెకు వచ్చిన కష్టం ఇదే!
తిరుపతిలోని శ్రీనివాస నగర్ కు చెందిన బాధితురాలు శ్రీదేవి.. ఇటీవల ఓ సెల్ఫీ వీడియోను విడుదల చేశారు. తన ఇంటిని భూమన అభినయ్ రెడ్డి స్నేహితుడు కృష్ణ చైతన్య యాదవ్ బలవంతంగా రాయించుకున్నాడని కన్నీటిపర్యంతమయ్యారు. ఆపై దానిని మురళి రెడ్డి అనే మరో వ్యక్తికి సైతం విక్రయించారని తెలిపారు. తన ఇంటి కోసం 2021 నుంచి న్యాయ పోరాటం చేస్తున్నట్లు శ్రీదేవి చెప్పారు. మురళీరెడ్డి, కృష్ణ చైతన్య తన ఇంటిపైకి గుండాలతో వచ్చి దాడి చేశారంటూ సీసీటీవీ ఫుటేజీలను సైతం ఆమె విడుదల చేశారు. ఈ మేరకు సీఎం చంద్రబాబు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.