Guntur Tragedy: గుంటూరు పట్టణంలోని స్వర్ణభారతి నగర్‌లో దారుణం జరిగింది. నాగరాజు, రాణి దంపతుల నాలుగేళ్ల బాలుడు గోపి ఐజాక్‌పై వీధి కుక్క దాడిచేసింది. బాలుడి మెడపై కొరకడంతో తీవ్రంగా గాయపడిన గోపిని హుటాహుటిన స్థానికంగా ఉన్న గుంటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఐజాక్ మృతిచెందాడు. కుమారుడి మరణంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. బాలుడి తల్లి ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లి పడిపోయింది.
ఈ ఘటనతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి. ఇప్పటికైనా గుంటూరు మున్సిపల్ అధికారులు కళ్లు తెరవాలని, వెంటనే వీధి కుక్కలను నియంత్రించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. బాలుడి తల్లిదండ్రులకు న్యాయం చేయాలని కోరుతున్నారు. అయితే బాలుడికి పోస్టుమార్టం చేయాలని అధికారులు ప్రయత్నించగా, ఆ ప్రక్రియ వద్దని బంధువుల ఆందోళనకు దిగారు.
ఆపరేషన్లు చేస్తున్నాం కానీ..
వీధి కుక్కల దాడిలో చనిపోయిన ఐజాక్ కుటుంబ సభ్యులను గుంటూరు మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసులు పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ వీధి కుక్కల నియంత్రణ కోసం ప్రభుత్వం తరఫున కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేస్తున్నామని వెల్లడించారు. ‘ ఈ ఆపరేషన్లు సరిగ్గా జరగకుండా జంతు ప్రేమికులు అడ్డుకుంటున్నారు. జంతు ప్రేమికుల చర్యలు వల్లే వీధి కుక్కల నియంత్రణ జరగట్లేదు. రానున్న రోజుల్లో ఇలాంటి పరిస్థితులు జరగకుండా చర్యలు చేపడతాం.
వీధి కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసి వాటి సంతాన ఉత్పత్తి జరగకుండా చేస్తాం. చట్టపరంగా ఇబ్బందులు ఉండటంతోనే వీధి కుక్కల నియంత్రణ అనేది సరిగ్గా జరగట్లేదు. సంఘటన జరిగిన ప్రాంతంలో వీధి కుక్కల దాడి జరిగిందని ఫిర్యాదు వచ్చినా, సిబ్బంది నిర్లక్ష్యం వహించారని నా దృష్టికి వచ్చింది.
Also read: Laddu Adulteration Case: లడ్డూ ప్రసాదం కల్తీ కేసులో కీలక అప్‌డేట్.. వారికి శిక్ష తప్పదా?
నిర్లక్ష్యం వహించిన సిబ్బందిపై కఠినమైన చర్యలు తీసుకుంటాం. స్వర్ణ భారతి నగర్‌లో వీధి కుక్కలకు సంబంధించి పిచ్చి కుక్కలు ఏమైనా ఉన్నాయా? అనే దానిపై దృష్టి పెడతాం’ అని కమిషనర్ తెలిపారు.
అండగా ఉంటాం..
చిన్నారి మృతిపై మంత్రులు నారాయణ, కందుల దుర్గేష్ విచారం వ్యక్తం చేశారు. ఘటనకు గల కారణాలపై జిల్లా ఇన్‌ఛార్జీ కలెక్టర్ భార్గవ తేజ, జీఎంసీ కమిషనర్‌తో నారాయణ ఫోన్‌లో మాట్లాడారు. మంత్రి ఆదేశాలతో గుంటూరు జీజీహెచ్‌లో ఉన్న గోపీ తల్లిదండ్రులను కమిషనర్ శ్రీనివాసులు పరామర్శించారు.
ప్రభుత్వం తరపున కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ వీధి కుక్కల దాడిలో బాలుడు మృతి చెందడం బాధాకరమన్నారు. ప్రభుత్వం తరఫున బాలుడి కుటుంబానికి అండగా ఉంటామని వెల్లడించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు.