మహబూబాబాద్ స్వేచ్ఛ: fake seeds: వర్షాలు పడుతున్నాయి. తొలకరి జల్లులతో రైతులు వ్యవసాయం చేసేందుకు దుక్కులను రెడీ చేసుకుంటున్నారు. ఇదే విత్తన మోసగాళ్ల సీజన్ అధికారులు నకిలీ విత్తనాల విక్రయాలను అరికట్టాల్సిన సమయం. కానీ, రాత్రి వేళల్లో పక్క ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం గుంటూరు, విజయవాడ వంటి జిల్లాల నుండి మహబూబాబాద్ జిల్లాలోని మరిపెడ మండలం గుండెపుడి, బుర్హాన్ పురం గ్రామాల్లో ఆంధ్ర విత్తన మోసగాళ్లు ఆయా గ్రామాల్లో డంపు చేసి అమాయక రైతులకు బీటీ 3 క్యాన్సర్ కారక విత్తనాలను మోసపూరిత వాగ్దానాలతో అంటగడుతున్నారు.
అధిక దిగుబడి వస్తుందని సేద్యం చేస్తున్న రైతులు
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం లోని మారుమూల ప్రాంతాలైన గుండెపుడి, బుర్హాన్ పురం గ్రామాల రైతులు ఆంధ్ర విత్తన మోసగాళ్లు చెప్పే మాటలకు మోసపోయి బీటీ3 పత్తి విత్తనాలను వ్యవసాయం చేస్తున్నారు. అధిక దిగుబడి వస్తుందని మాయమాటలు చెప్పి విత్తన మోసగాళ్లు అమాయక రైతులకు క్యాన్సర్ కారకమైన పత్తి విత్తనాలను అంటగడుతున్నారు. రైతులు ఈ విషయాన్ని గమనించి చేస్తున్నారు గమనించక చేస్తున్నారో తెలియదు కానీ అధిక దిగుబడి వస్తుందని నమ్మకంతో సేద్యం చేసి క్యాన్సర్ కారకానికి బాధితులు అవుతున్నారు.
ప్రతి ఏటా ఇదే సమయానికి ఆంధ్ర నుంచి బీటీ3 పత్తి విత్తన మోసగాళ్లు ఆ రెండు గ్రామాలపైనే ఫోకస్ పెట్టి మరి విక్రయాలు జరుగుతుండడం గమనార్హం. ఈ విషయం మరిపెడ మండల అధికారుల అందరికీ తెలిసిన విషయమే. కానీ అక్కడ మాత్రం ఆంధ్ర విత్తన మోసగాళ్ల దందా పరిపాటిగానే సాగుతోంది.
కేజీ విత్తనాలు రూ.1500 నుంచి రూ.2000 వరకు అమ్మకాలు
ఆంధ్రా నుంచి బట్ట సంచుల్లో తీసుకొచ్చిన క్యాన్సర్ కారక బిటి3 పత్తి విత్తనాలను ఒక్కో కేజీ రూ.1500 నుండి రూ.2000 వరకు విక్రయిస్తున్నారు. అదే బిటి2 విత్తనాలు మంచి బ్రాండ్ ఉన్న కంపెనీలు అయితే రూ.750 నుంచి రూ.1000 వరకే లభ్యమవుతాయి. అయితే ఇక్కడ ఆంధ్ర విత్తన మోసగాళ్లు రైతులను ఎన్నో రకాల మాయమాటలు చెప్పి తమ క్యాన్సర్ కారక విత్తనాలను అంటగడుతూ రైతులు, కూలీల ప్రాణాలకు హాని కలిగించేలా బీటీ3 విత్తనాలను పంపిణీ చేస్తున్నారు.
దాదాపు 30 వేల నుంచి 40,000 వరకు bt3 విత్తనాలతో సాగు
వ్యవసాయం చేస్తే అధిక లాభాలు ఉండాలని ఆలోచన చేసే రైతులు ఆంధ్ర విత్తన మోసగాళ్లు చెప్పే మాటలకు మోసపోయి వారి నుంచి బీటీ3 విత్తనాలను కొనుగోలు చేసి వ్యవసాయం చేస్తున్నారు. గుండెపూడి, బుర్హాన్ పురం గ్రామాల్లో దాదాపు 30 వేల ఎకరాల నుంచి 40 వేల ఎకరాల వరకు కేవలం బీటీ3 పత్తి విత్తనాలతో సేద్యం చేస్తున్నారు. ఆంధ్ర విత్తన మోసగాళ్లు గత రెండు రోజులుగా ప్రత్యేకమైన కార్లలో తీసుకొచ్చి గుండెపూడిబుర్హాన్ పురం గ్రామాల్లోని రైతులకు అంటగడుతున్నట్లు సమాచారం.
రెండు గ్రామాల్లోని 6000 మంది రైతులకు కూలీలకు క్యాన్సర్ సోకే ప్రమాదం
బీటీ విత్తనం అంటేనే అతి ప్రమాద కారకమైందని అనేక ల్యాబ్లలో నాణ్యత పరీక్షల్లో ఎప్పుడో రుజువైంది. అలాంటిది బీటీ పత్తి విత్తనం సేద్యం చేయకుండా బీటీ2 విత్తనం వరకు రైతులు వెళ్లిపోయారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో బీటీ2 పత్తి విత్తనాలను మాత్రమే వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు విత్తనాల పంపిణీ కార్యక్రమాలు చేపడుతున్నారు. అయితే గుండెపూడి, బుర్హాన్ పురం గ్రామాల్లో మాత్రం ఇందుకు విరుద్ధంగా రైతులను మోసగించి ఆంధ్ర విత్తన మోసగాళ్లు బిటి3 విత్తనాలను అంటగడుతున్నారు.
దీంతో వ్యవసాయం చేసే రైతు కుటుంబాలు, కూలీ పనులకు వెళ్లే వారి కుటుంబాలు సైతం క్యాన్సర్ కారకానికి గురవుతున్నట్లు అక్కడి ప్రజల ద్వారానే తెలుస్తుంది. మొక్క మొలసినప్పుడు, పూత దశ వచ్చినప్పుడు, ఖాతా దశలో, అదేవిధంగా పత్తి పూర్తిస్థాయిలో తయారైన తర్వాత తీసే దశలోనూ వచ్చే పరిమళంతో వ్యవసాయ పనులు చేసే వారందరికీ క్యాన్సర్ సోకే అవకాశాలు ఉన్నాయని ఎన్నో పరీక్షల ద్వారా నిపుణులు నిర్ధారించి హెచ్చరికలు సైతం జారీ చేశారు.