Ambati Rambabu on Lokesh: రాష్ట్ర ఐటీ, విద్య శాఖల మంత్రి నారా లోకేష్‌పై మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు మరోసారి విమర్శల దాడికి దిగారు. జగన్ విమర్శించే అర్హత మంత్రి నారా లోకేష్‌కు లేదని అన్నారు. అధికార గర్వంతో లోకేష్ పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. వాపును చూసి తన బలుపుగా నారా లోకేష్ భ్రమపడుతున్నారని ఎద్దేవా చేశారు. ఎనలేని ప్రజాధరణ ఉన్న నాయకుడు జగన్ అని, ఆయనను విమర్శించే అర్హత లోకేష్‌కు లేదని మండిపడ్డారు.
జగన్ గురించి లోకేష్ ఇష్టారీతిన మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రకాశంజిల్లా కనిగిరిలో రిలయన్స్ సీబీజీ ప్రారంభసభలో, గురువారం మంగళగిరిలో పట్టాల పంపిణీ కార్యక్రమంలో లోకేష్ మాట్లాడిన మాటలను బట్టి చూస్తే, కళ్లు నెత్తికెక్కి, అహంకారంతో మాట్లాడుతున్నట్లుగా స్పష్టమవుతోందని విమర్శించారు. ఈ మేరకు గుంటూరు క్యాంప్ కార్యాలయంలో అంబటి రాంబాబు ఈ మేరకు మీడియాతో మాట్లాడారు.
మంత్రి లోకేష్ తన స్థాయిని తెలుసుకుని మాట్లాడాలని, గత టీడీపీ ప్రభుత్వ హయాంలో అడ్డదారిలో ఎమ్మెల్సీగా వచ్చి పంచాయతీరాజ్‌శాఖ మంత్రిగా పనిచేశారని అంబటి రాంబాబు విమర్శించారు. ‘‘ అప్పుడు ఆ శాఖను భ్రష్టు పట్టించారు. ఆ తర్వాత మంగళగిరిలో పోటీ చేసి లోకేష్ ఘోరంగా ఓడిపోయారు. 2019లో టీడీపీ ఓడిపోవడానికి లోకేష్ అనుసరించిన విధానమే కారణమంటూ ఆ పార్టీ నేతలు విమర్శించారు. రాష్ట్రం అంతా 163 సీట్లలో కూటమి అభ్యర్థులు గెలిస్తే, అందులో ఒకరుగా చిట్టి రాజా లోకేష్ విజయం సాధించారు.
2019లో 23 మంది టీడీపీ అభ్యర్థులు గెలిచినప్పుడు లోకేష్ దారుణంగా ఓడారు. దీనిని బట్టి లోకేష్ సత్తా ఏంటో అర్థం చేసుకోవాలి. అలాంటి వ్యక్తి కూడా జగన్ గురించి మాట్లాడటం హాస్యాస్పదమని, సీబీజీ ప్లాంట్‌ను తీసుకువచ్చింది వైసీపీ ప్రభుత్వమే అని అన్నారు. వైసీపీ సర్కారు 2024 ఫిబ్రవరి 14న రిలయన్స్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది. నేడు ఆ ప్లాంట్‌ను ఆయన తీసుకువచ్చినట్టుగా లోకేష్ గొప్పలు చెప్పుకుంటున్నారు. వాస్తవాలు ఒప్పుకునే ధైర్యం లోకేష్‌కు లేదు. అంత సత్తా ఉంటే దావోస్‌కు వెళ్లి ఏం తీసుకువచ్చారో ప్రజలకు చెప్పాలి కదా, సీబీజీని అడ్డుకుంటున్నారని లోకేష్ బీరాలు పలుకుతున్నారు. అడ్డుకున్నవారి పేర్లు రెడ్‌బుక్‌లో ఎక్కిస్తానంటూ హెచ్చరికలు చేస్తున్నారు’’ అంటూ అంబటి రాంబాబు విమర్శల దాడి చేశారు.