షాద్ నగర్ స్వేచ్ఛ: Goats killed: షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలోని సోలిపూర్ రైల్వే బ్రిడ్జి వద్ద మేకలను రైలు ఢీ కొట్టిన ఘటనలో 18 మేకలు మృత్యువాత పడిన ఘటన గురువారం ఆలస్యంగా వెలుగు చూసింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. సోలిపూర్ గ్రామానికి చెందిన గడ్డం కృష్ణయ్య యాదవ్ మేకల పెంపకాన్ని జీవన ఆధారంగా చేసుకుని కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు.
ఈ క్రమంలో రోజు మాదిరిగానే బుధవారం ఉదయం మేకలను మేత కోసం బయటికి తీసుకెళ్లగా.. సోలిపూర్ గ్రామ శివారు వ్యవసాయ పొలాల్లో మేకలు మేత మేస్తున్నాయి. ఈ క్రమంలో రైతు ఓ చెట్టు కింద సేదతీరుతూ కునుకుపట్టాడు. రైలు పట్టాల సమీపంలో మేకలు మేత మేస్తుండగా రైలు వేగంగా వచ్చింది.
ఆ రైలు శబ్దానికి మేకలు భయంతో చెల్లాచెదురుగా అటు ఇటు పరుగులు పెట్టిన క్రమంలో ప్రమాదానికి గురై అక్కడికక్కడే 18 మేకలు మృత్యువాత పడ్డాయి. రైతు దూరంగా గమనిస్తుండగానే.. మేకలు విగత జీవులుగా చల్లాచెదరై పడి పోయాయి.
మేకల పోషణతోనే జీవనం సాగిస్తున్న సదరు రైతు రెండు లక్షల విలువైన 18 మేకలు మృతి చెందడంతో జీవనోపాధిని కోల్పోయానని బోరున విలిపిస్తున్నాడు. ప్రభుత్వము, మానవతావాదులు సహృదయంతో స్పందించి ఆర్థికంగా ఆదుకోవాలని కోరుతున్నాడు.