AP Cabinet Meeting: ఏపీ సీఎం చంద్రబాబు (CM Chandrababu) అధ్యక్షతన జరిగిన కేబినేట్ మీటింగ్ ముగిసింది. ఈ సమావేశంలో కీలక అంశాలపై చర్చించిన మంత్రివర్గం.. అనంతరం పలు అంశాలకు ఆమోదం తెలిపింది. ప్రధానంగా తొమ్మిది అంశాలపై చర్చ జరగ్గా.. వాటిని ఆమోదిస్తూ కేబినేట్ నిర్ణయం తీసుకుంది. మరోవైపు రాష్ట్రంలో సంచలనం సృష్టించిన పాస్టర్ ప్రవీణ్ (Pastor Praveen) మృతి అంశం కూడా కేబినేట్ లో ప్రస్తావనకు వచ్చింది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు.. మంత్రులకు కీలక సూచనలు చేశారు.
‘అపోహలు తొలగించండి’
పాస్టర్ ప్రవీణ్ పగడాల (Pastor Praveen Pagadala) మృతి కేసు.. ఏపీలో ఏ స్థాయిలో చర్చనీయాంశంగా మారిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అతడిది హత్య అంటూ పలు క్రైస్తవ సంఘాలు ఆందోళనకు దిగాయి. అటు విపక్ష వైసీపీ అధినేత జగన్ సైతం ఈ అంశంపై స్పందించడంతో దీనిపై రాజకీయ దుమారం రేపింది. అయితే ప్రవీణ్ ది హత్య కాదని, యాక్సిడెంట్ లో అతడు చనిపోయాడని పోస్టు మార్టం రిపోర్టు ఆధారంగా ఇటీవల ఏలూరు రేంజ్ డీజీఐ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో తాజా కేబినేట్ సమావేశంలో ఈ విషయాన్ని ప్రస్తావించిన సీఎం చంద్రబాబు.. వాస్తవ పరిస్థితులను ప్రజలకు తెలియజేయాలని సూచించారు. ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించాలని దిశా నిర్దేశం చేశారు.
Also Read: To-let to YCP office: దుకాణం సర్దేసిన జగన్.. పార్టీ ఆఫీసుకి టూ లెట్ బోర్డ్.. హాలీడేస్ ప్రకటించారా?
ఆమోదం తెలిపిన అంశాలు
మరోవైపు తొమ్మిది కీలక అంశాలకు ఏపీ కేబినేట్ ఆమోదం తెలిపింది. అనకాపల్లి జిల్లాలోని క్యాపిటివ్ పోర్టు ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే త్రీ స్టార్, ఆ పైబడిన హోటళ్లకు బార్ లైసెన్స్ ఫీజుల కుదింపునకు అంగీకరించింది. అలాగే బార్ లైసెన్స్‌ల ఫీజును రూ.25లక్షలకు కుదించేందుకు కేబినేట్ ఆమోదం చెప్పింది. రూ.710కోట్ల హడ్కో రుణానికి ప్రభుత్వం గ్యారంటీ, ఏపీ మీడియా అక్రిడేషన్ నిబంధనలు-2025, నాగార్జునసాగర్ లెఫ్ట్ బ్రాంచ్ కెనాల్ రిటైనింగ్ వాల్ నిర్మాణ ప్రతిపాదన, జలహారతి కార్పొరేషన్ ఏర్పాటు, దాని ద్వారా పోలవరం-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు రూపకల్పన వంటి 9 అంశాలకు కేబినేట్ ఆమోదముద్ర వేసింది.