Sri Sathya Sai district Crime: యూట్యూబ్ ద్వారా ఓ మహిళ హత్యకు ప్లాన్ వేశాడు ఈ దుర్మార్గుడు. తన ఆర్థిక అవసరాల కోసం, ఆ మహిళకు మాయమాటలు చెప్పి తుదముట్టించాడు. ఈ ఘటన శ్రీ సత్యసాయి జిల్లాలో చోటు చేసుకుంది. పూర్తి వివరాలలోకి వెళితే..
నమ్మి వెంటవచ్చిన మహిళను ఓ కిరాతకుడు ఆర్థిక అవసరాలు తీర్చుకోవడానికి హత్య చేసి పూడ్చిపెట్టిన ఘటన శ్రీ సత్యసాయి జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జిల్లాలోని మడకశిర మండలం ఉగ్రేపల్లి గ్రామం వద్ద అటవీ ప్రాంత వంకలో 15 రోజుల క్రితం గుర్తుతెలియని ఓ మహిళ శవం లభ్యమైంది. పాతి పెట్టిన శవాన్ని వీధి కుక్కలు బయటకు లాగగా పుర్రె బయటపడింది. దీంతో అక్కడ దుర్వాసన రావడంతో స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో శిక్షణ డీఎస్పీ ఉదయపావని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. శవం యొక్క ఆచూకీ కోసం చుట్టుపక్కల పోలీసు స్టేషన్లలో మిస్సింగ్ కేసుల వివరాలు ఆరా తీశారు.
కర్ణాటకలోని పావగడ తాలూకా అరసికెర పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన బాధితులకు మడకశిర పోలీసులు శవం ఆనవాళ్లు చూపించగా ఆ శవం ఉమాదేవిగా వారి తల్లిదండ్రులు గుర్తించారు. పోలీసులు ఎట్టకేలకు కేసు ఛేదించి ఆ పుర్రె కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఉమాదేవి(29)గా గుర్తించి హత్యకు గురైనట్లు తేల్చారు. అనంతరం ఉమాదేవి తల్లిదండ్రుల నుంచి పోలీసులు వివరాలు సేకరించారు. వారిచ్చిన సమాచారం ప్రకారం మడకశిర మండలం కదిరేపల్లి గ్రామానికి చెందిన పి. నరసింహమూర్తి అనే నిందితుడిని అరెస్టు చేసి విచారించగా నిజాలు బయటపడ్డాయి.
అసలు నిజం ఇదే..
మడకశిర మండలం కదిరేపల్లికి చెందిన పి. నరసింహమూర్తి పావగడ తాలుకా అరసికెరకు చెందిన ఉమాదేవితో బెంగళూరులో పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. గత ఏడాది నవంబరు 16న అతను ఆర్థిక అవసరాలను తీర్చుకునేందుకు ఆమె దగ్గర ఉన్న బంగారు నగలను కాజేయాలనుకున్నాడు. యూట్యూబ్‌లో చూసి హత్యకు ప్లాన్ వేసుకున్నాడు. స్వగ్రామం అరసికెరలో ఉన్న ఉమాదేవికి ఫోన్ చేసి నిన్ను కలవాలని కోరగా, ఆమె పావగడకు రావడంతో అక్కడి నుంచి ద్విచక్రవాహనంలో మడకశిర మండలం ఉగ్రేపల్లి అటవీ ప్రాంతానికి తీసుకెళ్లాడు. ఈ క్రమంలో అక్కడ ఆమె గొంతుకు తాడు బిగించి హత్య చేసి అక్కడే ఇసుకలో పూడ్చిపెట్టాడు.
విచారణ ప్రారంభించగా కర్ణాటకలోని అరసికెర పోలీస్ స్టేషన్‌లో అదృశ్యం కేసు నమోదు కావడంతో ఆ కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. తల్లి, ఇద్దరు అక్కలు మడకశిర పోలీస్ స్టేషన్‌కు చేరుకుని తమ కుమార్తె మృతదేహంగా నిర్ధారించారు. వారు ఇచ్చిన సమాచారం ఆధారంగా నరసింహమూర్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. తన ఆర్థిక అవసరాలు తీర్చుకోవడానికే ఆమెను హత్య చేసినట్లు నేరం అంగీకరించాడు. దీంతో అతన్ని మడకశిర కోర్టులో హాజరు పరిచి రిమాండుకు తరలించినట్లు డీఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు.