TG Cabinet Expansion: మంత్రివర్గ విస్తరణ మొదటి కొచ్చిందా, ఇప్పట్లో తేలటం కష్టమేనా.. అనే అనుమానాలు రాజకీయ వర్గాల్లో హాట్ హాట్ గా సాగుతున్నాయి. ఇప్పటిదాకా ప్రచారంలో ఉన్న ఏప్రిల్ 3 న మంత్రివర్గం విస్తరణ ముహూర్తం తేలిపోవటంతో తాజా చర్చ మొదలైంది. ఆశావహులందరూ ఊసురు మంటున్నారు. అసలు అధిష్టానం మదిలో ఏముందో తెలియక ప్రధాన నేతలు కూడా తలలు పట్టుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇన్నిసార్లు ఢిల్లీ పిలిపించి, అభిప్రాయ సేకరణలు చేసిన పార్టీ పెద్దలు విస్తరణ దిశగా ఓ స్థిరమైన నిర్ణయం తీసుకోకుండా, నాన్చివేత ధోరణిలో ఉండటం కాంగ్రెస్ నేతలకు అస్సలు మింగుడుపడటం లేదు. ఈ విస్తరణ ఎపిసోడ్ ఎన్నాళ్లు కొనసాగుతుంది, ఇప్పట్లో ముగింపు ఉందా లేదా అన్న ప్రశ్నలకు ప్రస్తుతానికి ఎవరి దగ్గరా సమాధానం ఉన్నట్లు కనిపించటం లేదు. తాజా గడువు శ్రీరామనవమి తర్వాత ఉండొచ్చనే ప్రచారం జరుగుతోంది.
మొత్తం మీద క్యాబినెట్ విస్తరణ విషయంలో కావాల్సిన దానికంటే ఎక్కువ రచ్చ మాత్రం జరిగిందనే చర్చ జోరుగా సాగుతోంది. ఇప్పటిదాకా ప్రచారంలో ఉన్న పేర్లు పక్కకుపోయి కొత్త అభ్యర్థులు, ఆశావహుల పేర్లు తెరపైకి వస్తున్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు క్యాబినెట్ లో చోటు కల్పించండి అంటూ అధిష్టానానికి సీనియర్ నేత జానారెడ్డి రాసిన లేఖ మాత్రం కలకలం రేపుతోంది. సహజంగా గుంభనంగా ఉండే జానారెడ్డి లేఖ రాయటమే సంచలనం అంటే, అది బయటకు కూడా రావటం అనేక అనుమానాలకు తావిస్తోందని కాంగ్రెస్ నేతలు చర్చించుకుంటున్నారు.
తనకు అధిష్టానం అస్యూరెన్స్ ఉంది, అల్రెడీ మంత్రివర్గంలో చోటు ఖాయం, తాను హొమ్ మంత్రి కావాలని అందరూ కోరుకుంటున్నారు అని అసెంబ్లీ లాబీల్లో చెప్పిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని అడ్డుకునేందుకు కొందరు కాంగ్రెస్ నేతలే ప్రయత్నం చేస్తున్నారన్న చర్చ జోరందుకుంది. ఇక వివేక్ వెంకటస్వామి విషయంలోనూ అనేక రకాల చర్చ సాగుతోంది. వారి కుటుంబానికి ఇప్పటికే తగిన ప్రాధాన్యత దక్కిందనేది కొందరి వాదన. అదే సమయంలో కొందరు నేతల బహిరంగంగానే కొత్త డిమాండ్లను తెరపైకి తెస్తున్నారు. ప్రస్తుత క్యాబినెట్ లో చోటు లేని ఉమ్మడి జిల్లాలకు మొదటి విస్తరణలో ప్రాతినిధ్యం కల్పించాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది. హైదరాబాద్, రంగారెడ్డి, నిజామాబాద్, అదిలాబాద్ లకు ప్రస్తుత మంత్రివర్గంలో చోటులేదు. ముందుగా ఈ జిల్లాలకు అవకాశం ఇచ్చిన తర్వాత, ఇప్పటికే మంత్రులు ఉన్న జిల్లాలకు మరో దఫా అవకాశం ఇవ్వొచ్చనే చర్చ జరుగుతోంది. ఇక సామాజిక వర్గాల పరంగా కూడా మాదిగలు మాకు మరింత ప్రాతనిధ్యం కావాలంటున్నారు, అటు ఎస్టీల్లో ప్రధాన వర్గమైన లంబాడాలు క్యాబినెట్ లో చోటుపై ఆశలుపెట్టుకున్నారు.
Also Read: SVSN Varma To Join YCP: పవన్ కు ఊహించని దెబ్బ.. వైసీపీలోకి వర్మ.. పిఠాపురంలో ఏం జరుగుతోంది?
అదే మాదిరిగా మైనారిటీ మంత్రి కచ్చితంగా మంత్రివర్గంలో ఉండాలి, ఇప్పటికే ఆలస్యమైందని వారి ప్రతినిధులు కోరుతున్నారు. ఇక ఇప్పటిదాకా ఆశావహుల లిస్ట్ లో ఉండి, తమకు చోటు ఖాయం అనుకున్న నేతల్లో టెన్షన్ మాత్రం వర్ణణాతీతం. సుదర్శన్ రెడ్డి, ప్రేమసాగర్ రావు, వాకిటి శ్రీహరి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వివేక్, ఫహీమ్ ఖురేషీ, బాలూ నాయక్ లాంటి నేతలు ఇంకా తెలవారదేమీ ఈ విస్తరణ రేయి అని వైరాగ్యంగా పాడుకుంటున్న పరిస్థితి. అదే సమయంలో విస్తరణ అంటూ జరిగితే తమ పదవులు ఉంటాయా, ఒక వేళ ఉన్నా.. ప్రస్తుత శాఖలు కొనసాగుతాయా, మారుతాయా అనే చర్చ ప్రస్తుత మంత్రుల్లో కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.
మొత్తం ఎపిసోడ్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మనస్సులో ఏముంది, ఆయన ఎవరిని కోరుకుంటున్నారు. ఆయన ఆలోచనలకు ఎవరైనా సీనియర్లు అడ్డుతగులుతున్నారా, అధిష్టానం ఏమనుకుంటోంది అన్న చర్చ కాంగ్రెస్ పార్టీలో, ప్రభుత్వంలో విపరీతంగా కొనసాగుతోంది.