SVSN Varma To Join YCP: పిఠాపురం కేరాఫ్ ఎస్వీఎస్‌ఎన్ వర్మ (SVSN) టీడీపీకి గుడ్ బై చెప్పనున్నారా? వైసీపీ తీర్థం పుచ్చుకోవడానికి రంగం సిద్ధం చేసుకున్నారా? త్వరలోనే ప్రకటన చేయడానికి ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నారా? అంటే వైసీపీ వర్గాలు నిజమేనని సమాధానమిస్తున్నాయి. వర్మ త్వరలో పార్టీ మారనున్నారన్న చర్చ వైసీపీ సోషల్ మీడియా పెద్ద ఎత్తున సాగుతోంది. అయితే ఈ చర్చకు ఆజ్యం పోసిన అంశాలేంటి? వర్మ అసంతృప్తి కారణమేంటి? ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
అసంతృప్తికి కారణమిదేనా?
పిఠాపురం టీడీపీ ముఖ్యనేత ఎస్వీఎస్‌ఎన్ వర్మ ప్రస్తుతం తీవ్ర అసహనంతో ఉన్నట్లు గత కొన్నిరోజులుగా ప్రచారం జరుగుతోంది. పవన్ కు సీటు త్యాగం చేస్తే ఎమ్మెల్సీ స్థానం ఇస్తానంటూ గతంలో చంద్రబాబు వర్మకు హామీ ఇచ్చినట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికలు జరగ్గా వర్మకు టీడీపీ నుంచి ఎలాంటి సీటు లభించలేదు. మరోవైపు పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజు జనసేన నేత నాగబాబు చేసిన కామెంట్స్ సైతం వర్మను మరింత అసంతృప్తికి గురిచేసినట్లు రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నారు. టీడీపీ, జనసేన రెండు పార్టీలు వర్మకు తగిన గుర్తింపు ఇవ్వకపోవడం ఆయన అనుచరులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది.
వైసీపీ విస్తృత ప్రచారం
వర్మ అసంతృప్తిగా ఉన్నారన్న వార్తలు పెద్ద ఎత్తున బయటకి రావడంతో విపక్ష వైసీపీ రంగంలోకి దిగింది. దీనిపై ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం కార్యకర్తలు పోస్టులు పెడుతున్నారు. వర్మ వైసీపీలోకి రావడం ఖాయమని, ముహూర్తం కూడా ఫిక్స్ అయ్యిందంటూ నెట్టంట ప్రచారం చేస్తున్నారు. అంతేకాదు పిఠాపురం వైసీపీ సీటు వంగా గీతను కాదని వర్మకు ఇవ్వబోతున్నరాంటూ ప్రచారం చేస్తున్నారు. వంగా గీతకు రాజమండ్రి లేదా కాకినాడ ఎంపీ టికెట్ ఇస్తారని చర్చించుకుంటున్నారు. అయితే వైసీపీ చేరతారన్న ప్రచారం విస్తృతంగా జరుగుతున్నా వర్మ గానీ, ఆయన అనుచర వర్గం గానీ ఇంతవరకూ ఖండించకపోవడం ఆసక్తికరంగా మారింది.
Also Read: Hyderabad Crime: అమానుషం.. లిఫ్ట్ ఇస్తామని చెప్పి.. విదేశీ మహిళపై గ్యాంగ్ రేప్
పవన్‌ను టార్గెట్ చేశారా?
మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. పిఠాపురం నియోజకవర్గ నేతలను పట్టించుకోవడం లేదన్న ప్రచారం స్థానికంగా జరుగుతోంది. పిఠాపురం ముఖ్య నేతలకో సంబంధం లేకుండా ఆయన చెక్కుల పంపిణీ, సీఎం రిలీఫ్ ఫండ్ విడుదల, ప్రభుత్వ కార్యక్రమాలను నిర్వహిస్తుండటంతో జనసేనకు చెందిన కొందరు నేతలు అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో వర్మ పార్టీ మారితే అతడితో వారు చేతులు కలిపే అవకాశం కూడా లేకపోలేదని పిఠాపురంలో చర్చ మెుదలైంది. తద్వారా వర్మ పంచన చేరి పవన్ ను అప్రతిష్టపాటు చేయాలని స్థానిక నేతలు కొందరు భావిస్తున్నట్లు కూడా ప్రచారం ఊపందుకుంది.
పవన్ ఆత్మీయ లేఖ
నియోజకవర్గంలో వ్యతిరేక పవనాలు వీస్తుండటాన్ని గ్రహించే.. డిప్యూటీ సీఎం పవన్.. ఉగాది రోజున పిఠాపురం ప్రజలు ఆత్మీయ లేఖ రాశారని చర్చించుకుంటున్నారు. మరోవైపు జనసేన నేత క్రాంతి (ముద్రగడ కుమార్తె).. వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఇటీవల వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. అందుకే ఆమెకు పదవులు దక్కడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. పిఠాపురంలో పవన్ తర్వాత ఆ స్థాయి క్రేజ్ ఉన్న ఇద్దరు నేతలకు వైసీపీతో సంబంధాలు ఉన్నట్లు వార్తలు రావడం ఇది పవన్ కు షాకిచ్చే అంశమేనని పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.