Madhurawada Crime: విశాఖపట్నంలో యువతిపై ప్రేమోన్మాది దాడి ఘటనకు సంబంధించి విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. అసలు ప్రేమోన్మాది లక్ష్యం ఏమిటో కానీ, మొత్తం మీద ఘాతుకానికి పాల్పడి, తన అక్కసు తీర్చుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించి దీపిక బంధువు స్పందించారు. ఆయన చెప్పిన వాస్తవాలు ఇవే.
విశాఖలోని మధురవాడ పోలీస్‌స్టేషన్ పరిధిలో దారుణం జరిగిన విషయం తెలిసిందే. స్వయంకృషి నగర్‌లో ఓ అమ్మాయి, ఆమె తల్లిపై ప్రేమోన్మాది దాడి చేయగా.. తల్లి మృతి చెందగా, కుమార్తెకు తీవ్రగాయలయ్యాయి. మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో ఓ యువకుడు బాధితురాలు దీపిక ఇంట్లోకి చొరబడి యువతి, ఆమె తల్లిపై కిరాతంగా కత్తితో దాడి చేసి పరారు కాగా, ఘటనలో తల్లి లక్ష్మి(43) అక్కడికక్కడే మృతి చెందగా.. తీవ్ర గాయాలైన దీపికను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. యువతిని ప్రేమించిన నవీన్ అనే వ్యక్తి దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి సీఎం చంద్రబాబు, హోమ్ మంత్రి వంగలపూడి అనిత స్పందించారు.
విశాఖపట్నంలో యువతిపై ప్రేమోన్మాది దాడిలో ఒకరు ప్రాణాలు కోల్పోవడం, మరొకరు ప్రాణాపాయ స్థితిలో ఉండటంపై ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దాడిని అడ్డుకునే ప్రయత్నంలో నిందితుడి చేతిలో యువతి తల్లి నక్కా లక్ష్మి ప్రాణాలు కోల్పోవడం విచారకరం అన్నారు. ఈ ఘటనపై సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్న యువతి ఆరోగ్య పరిస్థితిపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. బాధిత యువతికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు సూచించారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.
దీపిక బంధు బాబురావు తెలిపిన వాస్తవాలు ఇవే..
దీపికకు నవీన్ కు ఆరు సంవత్సరాల నుంచి ప్రేమ ఉంది. దీపిక ప్రేమ విషయాన్ని తల్లిదండ్రులు మాకు మూడు సంవత్సరాల క్రితమే చెప్పారు. చదువు పూర్తి కాకపోవడం వల్ల పెళ్లికి కొంత సమయం కావాలని కోరామని బాబూరావు తెలిపారు. ఇద్దరం చదువుకున్న వాళ్లమే మాకు పెళ్లి చేయండని దీపిక అడగడంతో దీపిక తల్లిదండ్రులు పెళ్లికి అంగీకరించినట్లు తెలిపారు. గత కొన్ని రోజులుగా నవీన్ ప్రవర్తనలో మార్పు గమనించిన దీపిక కాస్త వెనుకంజ వేసే ఆలోచనలో ఉంది. ఈ తరుణంలో వారం రోజుల క్రితం దీపిక ఇంటికి వచ్చి పెళ్లి చేయాలని నవీన్ అడిగాడు.
Also Read: Madhurawada Crime: ప్రేమ పేరుతో దాడి.. ప్రియురాలి తల్లి మృతి.. వైజాగ్ లో దారుణం
ప్రస్తుతం పెళ్లి చేయడానికి డబ్బులు లేవు, కొన్ని రోజులు సమయం కావాలని కుటుంబ సభ్యులు అడిగారు. దీనితో బుధవారం ఇంటికి వచ్చి ఎవరూ లేని సమయంలో దీపిక తల్లి పై దాడి చేసి నవీన్ హత్య చేసినట్లు బాబూరావు తెలిపారు. పెళ్లి చేస్తాం అని మాటిచ్చినా కూడా హత్యకు పాల్పడిన ఇలాంటి వాడిని కఠినంగా శిక్షించాలని దీపిక బంధువులు డిమాండ్ చేస్తున్నారు.